Begin typing your search above and press return to search.

కింగ్ ఖాన్ రికార్డులకు రామాయణం బ్రేక్?

బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పౌరాణిక దృశ్యకావ్యం `రామాయణ`.

By:  Srikanth Kontham   |   25 May 2026 8:00 PM IST
కింగ్ ఖాన్ రికార్డులకు  రామాయణం బ్రేక్?
X

బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పౌరాణిక దృశ్యకావ్యం `రామాయణ`. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం విడుదలకు ముందే ట్రేడ్ వర్గాల్లో మునుపెన్నడూ లేని విధంగా పెను సంచలనం సృష్టిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతో బిజినెస్ లెక్కలు సరికొత్త రికార్డులను లిఖిస్తున్నాయి. ముఖ్యంగా నార్త్ బెల్ట్‌లో ఈ చిత్రం సాధిస్తున్న క్రేజ్ బాలీవుడ్ అగ్ర చిత్రాల మార్కెట్‌ను సైతం దాటిపోతుండటం విశేషం. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం హిందీ థియేట్రికల్ హక్కుల కోసం నిర్మాతలు ఏకంగా 400 కోట్ల నుండి 450 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకే ఒక్క భాష థియేట్రికల్ హక్కులకే ఈ స్థాయి ధర పలకడం భారతీయ సినిమా మార్కెట్ చరిత్రలోనే ఇదే ప్రథమం అని చెప్పాలి. ప్రస్తుతం బాలీవుడ్‌లోని టాప్ డిస్ట్రిబ్యూషన్ హౌస్‌లన్నీ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను దక్కించుకోవడానికి తీవ్రంగా పోటీ పడుతుండటంతో ట్రేడ్ సర్కిల్స్ హీటెక్కాయి. ఇప్పటి వరకు నార్త్ మార్కెట్‌లో అత్యధిక ప్రీ-రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రికార్డ్ బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ రాబోయే చిత్రం `కింగ్` పేరిట ఉండేది. ఆ సినిమా హక్కులు దాదాపు 250 కోట్లకు అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

తాజాగా `రామాయణ` చిత్రం ఆ రికార్డును భారీ మార్జిన్‌తో అధిగమించడానికి సిద్ధమైంది. కింగ్ ఖాన్ నెలకొల్పిన అత్యున్నత బెంచ్‌మార్క్‌కు బ్రేక్ వేస్తూ `రామాయణ` సృష్టించబోయే సరికొత్త రికార్డు ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఈ స్థాయిలో భారీ బిజినెస్ కోట్ చేయడానికి సినిమాపై ఉన్న నమ్మకమే ప్రధాన కారణం. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, కన్నడ సూపర్ స్టార్ యష్ రావణాసురుడిగా, సాయి పల్లవి సీతగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్న మల్టీస్టారర్ కాస్టింగ్ ప్రాజెక్ట్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

దాదాపు 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా తెరెక్కుతోన్న విజువల్ వండర్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుందనే ధీమాతో నిర్మాతలు ఉన్నారు. ఇంత భారీ మొత్తాన్ని హిందీ హక్కులకే కేటాయించడంపై కొంతమంది ప్రముఖ పంపిణీదారులు పునరాలోచనలో పడ్డట్లు కూడా టాక్ నడుస్తోంది. ప్రస్తుత థియేట్రికల్ మార్కెట్ పరిస్థితులను బట్టి ఈ రేటు ఎక్కువని, కొంత తగ్గించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. అయినా? ఒకవేళ తుది ఒప్పందం 350-400 కోట్ల మధ్య కుదిరినా అది బాలీవుడ్ చరిత్రలోనే అత్యంత భారీ డిస్ట్రిబ్యూషన్ డీల్‌గా నిలిచిపోవడం ఖాయం. ఇంకా ఈ చిత్రం డిజిటల్, శాటిలైట్ హక్కుల పరంగా కూడా కోట్ల రూపాయ‌ల‌ ఆఫర్లను అందుకుంటోంది.