'రామాయణం' కాలకేయులతో 'బాహుబలి' కాళకేయుల కనెక్షన్ ఇదేనా?
భారతీయ ఇతిహాసాలలో `కాలకేయులు` లేదా `దానవ వంశం` అనే ప్రస్తావన చాలా ప్రాచీనమైనది.
By: Sivaji Kontham | 1 Aug 2026 8:00 AM ISTభారతీయ ఇతిహాసాలలో `కాలకేయులు` లేదా `దానవ వంశం` అనే ప్రస్తావన చాలా ప్రాచీనమైనది. ఇటీవల రామాయణం ట్రైలర్ విడుదల కాగా, ఇందులో కాలకేయ రాజు (దానవుడి)గా పరిచయం అయ్యాడు వివేక్ ఒబెరాయ్. దీంతో మరోసారి సినీప్రియులు `బాహుబలి` చిత్రంలోని కాలకేయను గుర్తు చేసుకున్నారు. కిలికి భాషతో భీకరమైన రూపంతో ఝడిపించే క్రూరుడైన కాలకేయ బాహుబలిపైనా- మాహిష్మతిపైనా దండెత్తుతాడు. అదే క్రమంలో బాహుబలితో భీకరమైన యుద్ధం గురించి తెలిసిందే.
అయితే ఆ కాలకేయుడితో ఇప్పుడు వస్తున్న `రామాయణం` కాలకేయకు సంబంధం ఏమిటి? అంటూ ప్రజలు ఆరాలు తీస్తున్నారు. దీని వివరాలలోకి వెళితే.. నిజానికి `రామాయణం`లో రావణాసురుడితో కాలకేయ వంశానికి నేరుగా సంబంధబాంధవ్యాలు ఉన్నాయి. కాలకేయ వంశానికి చెందిన అత్యంత పరాక్రమవంతుడైన `విద్యుజ్జిహ్వ`(వివేక్ ఒబెరాయ్) అనే రాక్షస యోధుడు రావణాసురుడి చెల్లెలైన శూర్పణఖను వివాహం చేసుకుంటాడు. ఆ రకంగా రావణాసురుడికి బావమరిది (బావ) అయినా... వీరిద్దరి మధ్య తీవ్రమైన అధికార ఆధిపత్య పోరు.. శత్రుత్వం ఉండేది. చివరికి రావణుడి చేతిలోనే విద్యుజ్జిహ్వ హతమవుతాడు. అయితే ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన `బాహుబలి` చిత్రంలో చూపించిన కాళకేయ తెగకు... రామాయణంలోని ఈ కాలకేయ వంశానికి ఏదైనా సంబంధం ఉందా అనే ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు హీట్ పెంచుతోంది.
పురాణాల ప్రకారం... దక్ష ప్రజాపతి కుమార్తె అయిన `దను`.. కశ్యప మహర్షి సంతానాన్ని `దానవులు` అంటారు. ఈ దానవులలో `కాలక` అనే రాక్షస స్త్రీ సంతానాన్ని `కాలకేయులు`గా పిలుస్తారు. రామాయణం, మహాభారతం.. బ్రహ్మాండ పురాణాలలో ఈ కాలకేయులు అత్యంత క్రూరులైన, మాయా శక్తులు కలిగిన దానవ యోధులుగా పేరుపడ్డారు. వీరు దేవతలకు, మానవులకు నిరంతరం సింహస్వప్నంగా మారేవారు. ఈ పౌరాణిక నేపథ్యాన్నే ప్రాతిపదికగా తీసుకుని తమ ఉనికి కోసం దండయాత్రలు చేసే ఒక క్రూరమైన తెగగా రామాయణంలోని విద్యుజ్జిహ్వ లాంటి పాత్రలను మన వేదాలు సాహిత్యంలో చిత్రించారు.
ఇక రాజమౌళి `బాహుబలి` సినిమా విషయానికి వస్తే... ఈ చిత్రంలో చూపించిన కాళకేయుల సైన్యం సంపూర్ణంగా పౌరాణిక ఇతిహాసాల్లోని కాలకేయ వంశం ఆధారంగా రూపుదిద్దుకున్నదే. రాజమౌళి - రచయిత విజయేంద్రప్రసాద్ పౌరాణిక కాలకేయుల స్వభావాన్ని (హింసాత్మక వైఖరి, క్రూరత్వం, వినాశకర మనస్తత్వం) తీసుకుని బాహుబలి ఫిక్షన్ ప్రపంచానికి అనుగుణంగా దానికి ఒక కొత్త చిత్రీకరణ ఇచ్చారు. సినిమాలో కాళకేయ రాజు (కాళకేయ కికాన్) మాట్లాడే `కిలికి` భాష... వారి విచిత్రమైన ఆచారాలు సినిమాటిక్ కల్పన అయినా.. ఆ పాత్రల మూలాలు.. రాక్షస లక్షణాలు మాత్రం పురాణాల్లోని కాలకేయ దానవుల నుంచే ప్రేరణ పొందాయి.
రామాయణంలో రావణాసురుడికి బావగా.. ప్రత్యర్థిగా కనిపించే `విద్యుజ్జిహ్వ` వంశమైన కాలకేయులు ..`బాహుబలి`లో మాహిష్మతి రాజ్యంపై దండయాత్ర చేసే `కాళకేయులు` వేర్వేరు కాలఘట్టాలకు చెందినవారైనా.. వారి పౌరాణిక మూలం మాత్రం ఒకటే. ఇతిహాసాల్లో రామాయణ కాలంలో రావణుడి చేతిలో భంగపడ్డ లేదా మహాభారత కాలంలో అర్జునుడి చేతిలో అంతమైన దానవ గుంపులు లేదా గ్రూపులనే, రాజమౌళి తన బాహుబలి చిత్రంలో మాహిష్మతి రాజ్యానికి నిజమైన విలన్లుగా అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ విధంగా రామాయణంలోని పౌరాణిక కాలకేయులకు... బాహుబలి సినిమాటిక్ కాళకేయులకు స్పష్టమైన మూలాల లింకు ఉంది. అయితే రాజమౌళి- విజయేంద్ర ప్రసాద్ ఫిక్షన్ ని మించి ఇప్పుడు నితీష్ తివారీ తన రామాయణంలో కాలకేయుల పాత్రలను మలిచారనే భావిద్దాం.
