Begin typing your search above and press return to search.

అయోధ్య‌లో రామాయ‌ణం స్పెష‌ల్ ఈవెంట్!

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లలో `రామాయణం` ముందు వరుసలో ఉంది.

By:  Srikanth Kontham   |   26 July 2026 9:00 PM IST
అయోధ్య‌లో రామాయ‌ణం స్పెష‌ల్ ఈవెంట్!
X

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లలో `రామాయణం` ముందు వరుసలో ఉంది. నితీష్ తివారీ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న పౌరాణిక చిత్రంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతోంది. తాజాగా యూనిట్ ప్రచారంలో భాగంగా ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా మొదటి భాగం విడుదల తేదీ దగ్గరపడుతున్న నేప‌థ్యంలో చిత్ర ప్రమోషన్లను అత్యంత వైభవంగా ప్లాన్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇందులో భాగంగానే ఆధ్యాత్మిక కేంద్రమైన అయోధ్య నగరంలో భారీ స్పెషల్ ఈవెంట్‌ను నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

రామ భక్తికి, పవిత్రతకు ప్రతీక అయిన అయోధ్య గడ్డపై చిత్ర వేడుకను నిర్వహించడం ద్వారా సినిమాపై అంచనాలను మరింత తారాస్థాయికి చేర్చవచ్చని బృందం యోచిస్తున్నట్లు సమాచారం. భారతీయ సాంస్కృతిక విలువలను, ఇతిహాస సారాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ప్రాజెక్ట్‌కు అయోధ్య వేదిక కావడం సముచితంగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శ్రీరాముడి జన్మస్థలమైన పవిత్ర భూమిపై చిత్ర యూనిట్, నూతన తారలతో కలిసి అడుగుపెట్టడం ప్రేక్షకుల్లో భావోద్వేగాలను కట్టలు తెంచుకునేలా చేస్తుందనడంలో సందేహం లేదు. సినిమాకు సంబంధించిన ఓ భారీ ఈవెంట్ ను స‌రిగ్గా రిలీజ్ కుముందు చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటిస్తుండగా, సీతాదేవిగా సాయి పల్లవి కనిపించనున్నారు. రావణాసురుడి పాత్రలో యశ్ న‌టిస్తున్నారు. ఇంకా ఎంతో మంది స్టార్లు గొప్ప చిత్రంలో భాగ‌మ‌వుతున్నారు. ఇలా దిగ్గజ నటులందరూ ఒకే వేదికపై అయోధ్యలో ప్రత్యక్షమైతే ఆ దృశ్యం అభిమానులకు కన్నుల పండువగా మారుతుంది. పాన్-ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయాలని చూస్తున్న చిత్రానికి ఈ తరహా ఆధ్యాత్మిక ప్రమోషన్లు గట్టి పునాది వేస్తాయని చెప్పొచ్చు. అయితే ఈ స్పెషల్ ఈవెంట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

చిత్ర నిర్మాతలు త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను, తేదీలను ప్రకటించే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. సినిమా గ్రాఫిక్స్, నిర్మాణ విలువలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రచార కార్యక్రమాలు కూడా అదే స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తుండటం విశేషం. ఈవెంట్ ద్వారా సినిమాపై నెలకొన్న క్యూరియాసిటీ మరింత పెరిగేలా పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. మొత్తానికి భారతీయ సినిమా చరిత్రలో మైలురాయిగా నిలవబోయే రామాయణం సినిమా ప్రమోషన్లు సరికొత్త మైలురాళ్లను తాకనున్నాయి.

అయోధ్య వేదికగా జరగబోయే ప్రచార పర్వం సినిమా విజయానికి ఎంతవరకు దోహదపడుతుంది. ప్రేక్షకుల్లో ఎలాంటి స్పందనను రాబడుతుంది అనేది చూడాలి. ఏదేమైనా? వెండితెరపై రాముడి గాథను అద్భుతంగా ఆవిష్క రించేందుకు సన్నద్ధమవుతున్న టీమ్ ప్రచారంలోనూ ప్రత్యేకతను చాటు కునేందుకు సిద్ధమవుతోంది.