Begin typing your search above and press return to search.

'రామాయణ 2' రీ షూట్‌ వార్తల్లో నిజం ఎంత?

తొలి భాగంపై ప్రేక్షకుల నుంచి వచ్చిన విమర్శల నేపథ్యంలో ‘రామాయణం-2’లో కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తవగా, భారీ వీఎఫ్‌ఎక్స్ పనుల కారణంగా సినిమాను దీపావళి 2027 నుంచి 2028కి వాయిదా వేశారు.

By:  Ramesh Palla   |   14 Nov 2026 1:00 AM IST
రామాయణ 2 రీ షూట్‌ వార్తల్లో నిజం ఎంత?
X

ఇండియన్‌ సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన 'రామాయణ' మూవీ ఇటీవల దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ, భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా మొదటి వారం రోజుల లోపే రూ.1000 కోట్లకు మించి వసూళ్లు రాబట్టడంతో లాంగ్‌ రన్‌లో సినిమా రూ.2000 కోట్లు ఈజీగా క్రాస్ చేస్తుందనే విశ్వాసంను బాక్సాఫీస్‌ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. సెకండ్‌ వీకెండ్‌లో సినిమా సాలిడ్‌ కలెక్షన్స్ ను రాబట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక వరల్డ్ బాక్సాఫీస్‌ జర్నీకి సైతం ఈ సినిమా రెడీ అవుతోంది. ముఖ్యంగా చైనాలో ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడ సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్ వస్తే ఈజీగా సినిమా రూ.3000 కోట్ల వసూళ్ల క్లబ్‌ లో జాయిన్‌ కావడం ఖాయం, ఆల్‌ టైమ్‌ రికార్డ్‌కి చేరువలో ఈ సినిమా నిలువబోతుందనే విశ్వాసం వ్యక్తం అవుతోంది.

రణబీర్ కపూర్‌, సాయి పల్లవి జంటగా...

రణబీర్‌ కపూర్‌, సాయి పల్లవి, యశ్‌, కాజల్‌, రకుల్‌ ముఖ్య పాత్రల్లో నటించిన 'రామాయణ' సినిమా మొదటి పార్ట్‌ పై ప్రశంసలు మాత్రమే కాకుండా విమర్శలు సైతం వస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా రావణుడి పాత్రను మరీ ఎక్కువ ఎలివేట్‌ చేశారని, రాముడిని కాస్త తగ్గించి చూపించారు అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా సూర్పణక పాత్ర విషయంలోనూ చాలా మంది విమర్శలు చేస్తున్నారు. దాంతో పార్ట్‌ 2 లో ఈ తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఫిల్మ్‌ మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పటికే రామాయణ పార్ట్‌ 2 దాదాపుగా 50 శాతం పూర్తి అయినట్లుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. అంటే సినిమా షూటింగ్‌ ఆరు నెలలు అంతకు తక్కువ సమయంలోనే పూర్తి అవుతుందని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాను 2027 దీపావళి కి కాకుండా 2028 దీపావళికి విడుదల చేస్తామని నిర్మాత అధికారికంగా ప్రకటించడంతో చర్చ మొదలైంది.

రామాయణ సినిమా షూట్‌ పై...

ఇప్పటికే సగానికి పైగా షూటింగ్‌ పూర్తి అయిన సినిమాను రెండేళ్లు ఎందుకు వాయిదా వేయడం అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలోనే బాలీవుడ్‌లో వినిపిస్తున్న టాక్‌ ప్రకారం సినిమాలో ఇప్పటికే తీసిన కొన్ని సీన్స్‌ ను రీ షూట్‌ చేయాలని నిర్ణయించుకున్నారట. మొదటి పార్ట్‌కు వచ్చిన రెస్పాన్స్‌, పాత్రల విషయంలో వస్తున్న విమర్శల కారణంగా కొన్ని సీన్స్ ను రీ షూట్‌ చేస్తేనే బెటర్‌ అనే నిర్ణయానికి మేకర్స్ వచ్చారట. అందుకే రీ షూట్‌ ను ప్లాన్‌ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మద్య కాలంలో బాలీవుడ్‌లో వచ్చిన సినిమాల్లో ఎక్కువ శాతం సక్సెస్‌ ను దక్కించుకోవడంలో విఫలం అవుతున్నాయి. అలాంటి సమయంలో వచ్చిన సినిమా రామాయణ. ఈ సినిమా నుంచి పార్ట్‌ 2 రాబోతున్న నేపథ్యంలో మొదటి పార్ట్‌ కి జరిగిన తప్పులు పునరావృతం కాకూడదు అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

నితేష్ తివారీ రామాయణ 2 రిలీజ్ డేట్‌..

రామాయణ షూటింగ్‌ కంటే వీఎఫ్‌ఎక్స్ వర్క్ కి ఎక్కువ సమయం పడుతుంది, అలాగే ఎక్కువ బడ్జెట్‌ ఖర్చు అవుతుంది. కనుక రీ షూట్‌ విషయంలో బడ్జెట్‌ ప్రభావం ఎక్కువ ఉండక పోవచ్చు. పైగా మొదటి పార్ట్‌ కి వస్తున్న భారీ కలెక్షన్స్ నేపథ్యంలో రెండో పార్ట్‌ కు ముందు అనుకున్న దాని కంటే ఎక్కువగానే ఖర్చు చేసేందుకు నిర్మాతలు రెడీగా ఉన్నారని తెలుస్తోంది. నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సెకండ్‌ పార్ట్‌ లో రామ-రావణ యుద్దం కీలకంగా ఉండే అవకాశం ఉంది. అంతే కాకుండా హనుమాన్‌ పాత్రకు సంబంధించి కీలక సన్నివేశాలు ఉంటాయి. హనుమాన్‌ పాత్ర విషయంలో చిన్న తప్పు జరిగినా కూడా మొత్తం సినిమా ఆ ప్రభావం ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే మేకర్స్ ఒకటికి రెండు సార్లు ఆలోచించి షూట్‌ చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే రీ షూట్‌ ఆలోచన చేశారేమో అనే అనుమానాలు సైతం కొందరు వ్యక్తం చేస్తున్నారు.