కామెరూన్‌కి లార్డ్ శ్రీరాముడి రుణం తీర్చుకునే అవకాశం
అందుకే ఇప్పుడు లార్డ్ రాముడి రుణం తీర్చుకునే సమయం వచ్చింది. కామెరూన్ ఇప్పుడు అందుకు సంసిద్ధంగా ఉన్నాడు.
By: Sivaji Kontham | 16 Dec 2025 10:49 AM ISTప్రపంచ ప్రసిద్ధ దర్శకదిగ్గజం జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అవతార్ 3 (ఫైర్ అండ్ యాష్) ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అవతార్ -1, అవతార్ 2 గ్రాండ్ సక్సెస్ సాధించిన తర్వాత పార్ట్ 3 ని అంతకుమించిన భారీ బడ్జెట్, విజువల్ మాయాజాలంతో తెరకెక్కించామని కామెరూన్ చెబుతున్నారు. ఈ సినిమా విజయం సాధించకపోతే, తాను ఈ ఫ్రాంఛైజీలో తదుపరి సినిమాల్ని తెరకెక్కించనని ఛాలెంజ్ చేసాడు.
అయితే కామెరూన్ కి ఇంతటి నమ్మకాన్ని ఇచ్చిన తెరవెనక శక్తి ఎవరో తెలుసుకోవాలనే ఉత్సుకత వినోదప్రియులకు ఉంది. ముఖ్యంగా భారతదేశంలో అవతార్ 100 కోట్లు అంతకుమించి వసూలు చేయడం వెనక ప్రధాన కారణం.. ఈ సినిమా కోసం ఎంపిక చేసుకున్న పాత్రల రూపం ప్రధాన కారణం. లార్డ్ శ్రీరాముడి నిలువెత్తు రూపాన్ని, ఆంజనేయుడి తోకను తీసుకుని (మెర్జ్ చేసి) అతడు ఒక సరికొత్త రూపాన్ని క్రియేట్ చేసాడు. అలా పుట్టుకొచ్చిన కొత్త ప్రాణి- అవతార్. నీలమేఘ శ్యాముని రంగు, రూపురేఖల్ని ఎంచుకోవడమే గాక, రామాయణంలో అత్యంత కీలకమైన పాత్రధారి ఆంజనేయుడి తోకను ఎంతో తెలివిగా ఉపయోగించుకున్నాడు. అవతార్ రూపం నిజంగా మొదటిసారి విజువల్ గా చూసినవారికి మతులు చెడగొట్టింది. అవతార్ ప్రతి కదలికా ఎగ్జయిట్ చేసింది. అందుకే అవతార్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.97 బిలియన్ డాలర్లు వసూలు చేయగా, అవతార్ 2 చిత్రం 2.3 బిలియన్ డాలర్లతో సంచలనం సృష్టించింది. ఈ రెండు సినిమాలు కలిపి 5 బిలియన్ డాలర్లు పైగా వసూలు చేసాయి. అయితే అవతార్ ఫ్రాంఛైజీకి ఈ స్థాయిని ఇచ్చింది లార్డ్ శ్రీరాముడిపై కామెరూన్ నమ్మకమే. బహుశా అవతార్ లను సృష్టికి `రామాయణం`లో పాత్రలు ఎలా మూల కారణమయ్యాయో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.
అందుకే ఇప్పుడు లార్డ్ రాముడి రుణం తీర్చుకునే సమయం వచ్చింది. కామెరూన్ ఇప్పుడు అందుకు సంసిద్ధంగా ఉన్నాడు. అవును .. ఇది నిజం. ఇప్పుడు భారతదేశంలో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `రామాయణం` టీజర్ ని `అవతార్ - ఫైర్ అండ్ యాష్` తో థియేటర్లకు అనుసంధానిస్తున్నారు. నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న `రామాయణం` చిత్రాన్ని పాన్ వరల్డ్ మార్కెట్లలో రిలీజ్ చేయడమే లక్ష్యంగా ప్లాన్ చేస్తున్నారు గనుక ఈ సినిమా టీజర్ `అవతార్ 3` ఆడుతున్న వరల్డ్ వైడ్ థియేటర్లలో అటాచ్ చేస్తారని తెలిసింది. రణబీర్ కపూర్ ఈ చిత్రంలో లార్డ్ శ్రీరాముడిగా నటించగా, సీతగా సాయిపల్లవి నటిస్తున్న సంగతి తెలిసిందే.
వారణాసికి ఛాన్స్ లేదా?
అయితే జేమ్స్ కామెరూన్ అభిమానిగా ఎస్.ఎస్.రాజమౌళి తన సినిమా `వారణాసి` టీజర్ ని `అవతార్- 3` థియేటర్లకు జత చేస్తారని భావించినా కానీ అది జరగడం లేదు. మహేష్ కథానాయకుడిగా వారణాసి చిత్రాన్ని గ్లోబల్ ఆడియెన్ కి రీచ్ అయ్యేలా జక్కన్న అత్యంత భారీగా రూపొందిస్తున్నారు. ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్ వెబ్ లో సునామీ సృష్టించింది. అయితే ఇప్పుడు కామెరూన్ అవతార్ 3 విడుదలవుతున్న థియేటర్లలో వారణాసి టీజర్ ని ప్రమోట్ చేసుకోలేకపోవడం నిజంగా పెద్ద నిరాశ. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళితో కలిసి పని చేసే అవకాశం ఉంది! అంటూ కామెరూన్ గతంలో వ్యాఖ్యానించారు. ఇక లెజెండ్ కామెరూన్ తో అవార్డుల వేడుకల్లో కనిపించిన రాజమౌళి అతడితో కలిసి పని చేస్తాడని భావించేలా చేసాడు. ఆ ఇద్దరి సాన్నిహిత్యంతో భారతీయ సినిమా సమీకరణం భవిష్యత్ లో మరింత మారుతుందని కూడా విశ్లేషకులు అంచనా వేసారు. కానీ రాజమౌళి ప్రస్తుతం `వారణాసి` చిత్రీకరణ ఒత్తిడిలో ఉన్నారు. ఇంతలోనే నితీష్ తివారీ తన సినిమా `రామాయణం` ప్రచారానికి ఉన్న అవకాశాన్ని వదులుకోలేదు. రామాయణం టీజర్ ని అవతార్ 3 థియేటర్లకు అనుసంధానించడం ద్వారా గ్లోబల్ ఆడియెన్ కి సినిమాని కనెక్ట్ చేస్తున్నారు.
రామాయణం చిత్రానికి ఎనిమిదిసార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న వీఎఫ్ఎక్స్ స్టూడియో అయిన DNEG విజువల్ ఎఫెక్ట్స్ - గ్రాఫిక్ వర్క్ ని అందిస్తోంది. ఇప్పుడు రామాయణం 3డి టీజర్ ని అవతార్ 3తో అనుసంధానిస్తున్నారని తెలిసింది. 3డిలో రామాయణం మాయాజాలం ఎలా ఉంటుందో చాలా ముందే పరిచయం చేయడం ద్వారా సినిమాపై హైప్ పెంచాలన్నది ప్లాన్. `అవెంజర్స్: డూమ్స్‌డే`, `ది ఒడిస్సీ` చిత్రాల టీజర్‌లు కూడా `అవతార్ 3`తో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శితం కానున్నాయి. ఇలాంటి భారీ అంతర్జాతీయ చిత్రాలతో పాటు రామాయణం 3D ప్రోమో విడుదలవుతోంది అంటే దానికి ఎంత క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నితీష్ తివారీ దర్శకత్వంలో దాదాపు 4,000 కోట్ల బడ్జెట్‌తో రామాయణం చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2026 దీపావళి.. 2027 దీపావళికి వరుసగా విడుదల చేయనున్నారు.
