రణబీర్ కపూర్ రాముడి పాత్రపై సంచలన వ్యాఖ్యలు!
భారతీయ బుల్లితెర చరిత్రలో ఐకానిక్ సీరియల్ `రామాయణం`ను అందించిన దివంగత దర్శకుడు రామానంద్ సాగర్ మనవడు, ప్రొడ్యూసర్ శివ్ సాగర్ బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ కాస్టింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By: Srikanth Kontham | 8 Sept 2026 12:41 PM ISTభారతీయ బుల్లితెర చరిత్రలో ఐకానిక్ సీరియల్ `రామాయణం`ను అందించిన దివంగత దర్శకుడు రామానంద్ సాగర్ మనవడు, ప్రొడ్యూసర్ శివ్ సాగర్ బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ కాస్టింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నితేష్ తివారీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న `రామాయణం` చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో రాముడి పాత్రకు రణబీర్‌ను ఎంపిక చేయడాన్ని తాను వ్యక్తిగతంగా అంగీకరించలేకపోతున్నానని... రణబీర్ ని రాముడి రూపంలో ఊహించుకోలేకపోతున్నానని శివ్ సాగర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రణబీర్ కపూర్ అద్భుతమైన నటుడని.. ఆయన నటనా సామర్థ్యంపై తనకు ఎలాంటి సందేహం లేదని శివ్ సాగర్ స్పష్టం చేశారు. రణబీర్ నటించిన `యానిమల్` వంటి హింసాత్మకమైన, వివాదాస్పద పాత్రల ప్రభావం ఆయనపై ఎక్కువగా ఉందగని సాగర్ అన్నారు. యానిమల్ లాంటి సినిమా చేసిన తర్వాత రణబీర్‌ను రాముడి పాత్రలో చూడటం నాకు కష్టంగా ఉంది. శ్రీరాముడి లాంటి పవిత్రమైన పాత్ర కోసం ఎలాంటి నెగెటివ్ ఇమేజ్ సినిమాల ప్రభావం లేని కొత్త ముఖాన్ని ఎంచుకుని ఉంటే బాగుండేది`అభిప్రాయపడ్డారు.
తమ కుటుంబం గతంలో నిర్మించిన `రామాయణ్` సీరియల్‌ను గుర్తు చేసుకున్నారు. రాముడి పాత్ర కోసం కొత్త నటులను ఎంచుకోవడానికి ఓ బలమైన కారణం ఉందన్నారు. కొత్త ముఖాలకు ఎలాంటి ఇమేజ్ ఉండదు కాబట్టి ప్రజలు వారిని నేరుగా దేవుడి రూపంలోనే స్వీకరిస్తారన్నారు. భారతీయ సంస్కృతిలో రామాయణం అనేది కేవలం పౌరాణిక కథ గాథ మాత్రమే కాదని.. అది మన చరిత్ర అని, రామచంద్రుడిని కోట్లాది మంది ప్రజలు రోజూ పూజిస్తారని కాబట్టి ప్రేక్షకులు ఈ విషయంలో చాలా భావోద్వేగంగా ఉంటారని గుర్తు చేశారు.
అయితే మార్కెటింగ్ , బిజినెస్ పరంగా చూస్తే రణబీర్ కపూర్ వంటి పెద్ద స్టార్‌ను ఎంచుకోవడం సినిమా ప్రమోషన్లకు ఎంతో కలసివస్తుందని శివ్ సాగర్ అంగీకరించారు. `రామ్‌జీ పాత్రకు రణబీర్ సరిపోకపోవచ్చు కానీ సినిమాను భారీ స్థాయిలో బిజినెస్ చేయడానికి మార్కెట్ చేయడానికి రణబీర్ క్రేజ్ ఉపయోగపడుతుంది` అని పేర్కొన్నారు. ఇదే సమయంలో సినిమాలో సీతగా నటిస్తోన్న సాయి పల్లవి, రావణుడి పాత్ర పోషిస్తున్న యష్ పై మాత్రం ప్రశంసలు కురిపించారు. యశ్ కి ఎలాంటి ప్రతికూల బ్యాగేజ్ లేకపోవడం పెద్ద ప్లస్ పాయింట్ అని కొనియాడారు.
ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రల్లో రాముడి తండ్రి దశరథుడిగా అరుణ్ గోవిల్ (పాత రామాయణం సీరియల్ రాముడు), హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే, కైకేయిగా లారా దత్తా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో కొన్ని పాత్రల కాస్టింగ్, కాస్ట్యూమ్స్ ఇంకా మెరుగ్గా ఉంటే బాగుండేదని శివ్ సాగర్ అభిప్రాయపడ్డారు. చివరికి ఏది ఏమైనా? సినిమా విజయాన్ని, పాత్రల ఆమోదాన్ని నిర్ణయించేది ప్రేక్షకులేనని.. `ప్రజలే రాజులు, వారి తీర్పే ఆఖరిది` అని వ్యాఖ్యానించారు. నితేష్ తివారీ దార్శనికతలో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న `రామాయణ: పార్ట్ 1` ప్రపంచవ్యాప్తంగా దీపావళఙకి విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.
