Begin typing your search above and press return to search.

ఇప్ప‌టివ‌ర‌కూ శ్రీ‌రాముడి పాత్ర‌లో న‌టించిన స్టార్ల జాబితా

భారతీయ సినిమా- బుల్లితెర‌ రంగాల్లో శ్రీరాముడి పాత్రకు ఉన్న ప్రాముఖ్యత అపారం. వెండితెరపై లేదా బుల్లితెరపై రామాయణ గాథను ఆవిష్కరించిన ప్రతిసారీ ప్రేక్షకులు ఆ పాత్రలను దైవ సమానంగా ఆరాధించారు.

By:  Sivaji Kontham   |   4 April 2026 8:00 AM IST
ఇప్ప‌టివ‌ర‌కూ శ్రీ‌రాముడి పాత్ర‌లో న‌టించిన స్టార్ల జాబితా
X

భారతీయ సినిమా- బుల్లితెర‌ రంగాల్లో శ్రీరాముడి పాత్రకు ఉన్న ప్రాముఖ్యత అపారం. వెండితెరపై లేదా బుల్లితెరపై రామాయణ గాథను ఆవిష్కరించిన ప్రతిసారీ ప్రేక్షకులు ఆ పాత్రలను దైవ సమానంగా ఆరాధించారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుండి బాలీవుడ్ వరకు... బ్లాక్ అండ్ వైట్ కాలం నుండి నేటి విజువల్ వండర్స్ కాలం వరకు చాలా మంది స్టార్లు రాముడి పాత్రలో మెప్పించారు. ముఖ్యంగా టాలీవుడ్‌లో ఎన్.టి.రామారావు ఈ పాత్రకు ఒక సంపూర్ణ అర్థాన్ని ఆపాదించార‌ని చెప్పొచ్చు. లవకుశ, సంపూర్ణ రామాయణం వంటి చిత్రాలలో శ్రీ‌రాముడి పాత్ర‌తో తార‌క‌రాముడు లక్షలాది మంది హృదయాల్లో నిలిచిపోయారు.

టాలీవుడ్ స్టార్ హీరోలు పౌరాణిక పాత్రలపై ఎప్పుడూ మక్కువ చూపేవారు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు `శ్రీ రామ జననం` (1944) లో, శోభన్ బాబు `సంపూర్ణ రామాయణం` (1971)(బాపు ద‌ర్శ‌కుడు) లో రాముడిగా నటించి తమదైన ముద్ర వేశారు. నందమూరి వారసుల్లో బాలకృష్ణ `శ్రీ రామ రాజ్యం` (2011) చిత్రంతో తండ్రికి తగ్గ తనయుడిగా మెప్పించగా... జూనియర్ ఎన్టీఆర్ `బాల రామాయణం` (1997) లో బాల రాముడిగా నటించి జాతీయ అవార్డును సైతం గెలుచుకున్నారు. సుమన్, ప్రభాస్ వంటి వారు కూడా విభిన్నమైన శైలిలో ఈ పాత్రను పోషించి మెప్పించారు.

బుల్లితెర విషయానికి వస్తే.. 1987లో రామానంద్ సాగర్ రూపొందించిన `రామాయణ్` ఒక చరిత్రను సృష్టించింది. ఇందులో రాముడిగా నటించిన అరుణ్ గోవిల్ పై ప్రజలు ఎంతటి భక్తిభావం ప్రదర్శించారంటే.. ఆయనను నిజమైన రాముడిగానే భావించి పూజించేవారు. ఆ తర్వాత గుర్మీత్ చౌదరి (2008 రామాయణ్), ఆశిష్ శర్మ (సియా కే రామ్) .. సోనీ టీవీలో టెలీకాస్ట్ అయిన‌ `శ్రీమద్ రామాయణ్`లో సుజయ్ రేవూ రాముడి పాత్రలో నేటి తరం ప్రేక్షకులను అలరించారు. ఈ సీరియళ్లు హిందీతో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లోనూ డబ్ అయ్యి దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నాయి.

సినిమాల్లో కూడా బాలీవుడ్ హీరోలు ఈ పాత్రను పోషించేందుకు ఆసక్తి చూపారు. 1997లో వచ్చిన `లవ్ కుష్` చిత్రంలో అగ్ర నటుడు జితేంద్ర శ్రీరాముడిగా కనిపించి ఆకట్టుకున్నారు. జెన్ జెడ్ కాలంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ `ఆదిపురుష్` (2023) లో రాఘవ పాత్రలో ఆధునిక సాంకేతికతతో కూడిన రాముడిని పరిచయం చేశారు. హరనాథ్, కాంతారావు, శ్రీకాంత్ వంటి ఇతర తెలుగు నటులు కూడా ప‌లు చిత్రాల్లో అతిథి లేదా ప్రధాన పాత్రల్లో రాముడిగా కనిపించి రామాయణ గాథను సజీవంగా ఉంచడంలో తమ వంతు కృషి చేశారు.

ప్రస్తుతం భారతీయ సినిమా రంగం నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `రామాయణ` చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ , మేకింగ్ వివరాలు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. గతంలో వచ్చిన అన్ని వెర్షన్ల కంటే ఇది అత్యంత భారీ వ్యూహం తో సాంకేతిక మాయాజాలంతో బ‌రిలోకి దిగుతుండ‌టంతో.. రణబీర్ ఈ పాత్రలో ఎలా కనిపిస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది దీపావ‌ళికి పార్ట్ 1, వ‌చ్చే ఏడాది దీపావ‌ళికి పార్ట్ 2 విడుదల కానున్నాయి.