రాముడిగా ఇద్దరు స్టార్లు.. కానీ రామనవమికి మాత్రం నో అప్డేట్స్
శ్రీ రామ నవమి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా భారీ సినిమాల నుంచి ప్రత్యేక అప్డేట్స్ వస్తాయని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 26 March 2026 10:23 PM ISTశ్రీ రామ నవమి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా భారీ సినిమాల నుంచి ప్రత్యేక అప్డేట్స్ వస్తాయని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా రామాయణ, వారణాసి లాంటి పాన్ ఇండియా ప్రాజెక్టుల నుంచి ఏదైనా గ్లింప్స్ లేదా కీలక ప్రకటన వస్తుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే, ఈసారి ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురవుతున్నట్లు కనిపిస్తోంది.
రామాయణ ఈవెంట్ క్యాన్సిల్
గత కొన్ని వారాలుగా రామాయణ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ శ్రీరామనవమి రోజున విడుదల అవుతుందనే వార్తలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. దీంతో అభిమానులు కూడా దీనిపై భారీగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఆ లాంచ్ ఈవెంట్ రద్దయిందన్న వార్తలు వినిపించడంతో గ్లింప్స్ వస్తుందనే హైప్ ఒక్కసారిగా చల్లారిపోయింది. ఇదే సమయంలో వారణాసి సినిమా నుంచి కూడా పెద్ద అప్డేట్ ఉండదన్న సమాచారం రావడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్స్ లేకపోయినా మీడియా రిపోర్ట్స్, ఇండస్ట్రీ బజ్ కలిపి అంచనాలను అమాంతం పెంచగా, చివరకు ఎలాంటి అప్డేట్ రావడం లేదని తెలిసి ఆడియన్స్ నిరాశ చెందుతున్నారు.
సర్‌ప్రైజ్‌లకే రాజమౌళి ప్రాధాన్యత
ఎస్.ఎస్. రాజమౌళి స్టైల్‌ను పరిశీలిస్తే, ఆయన ముందుగా అప్డేట్స్ ఇవ్వడం కంటే సడెన్ సర్ప్రైజ్‌లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అందుకే వారణాసి నుంచి పెద్ద అనౌన్స్‌మెంట్ లేకపోయినా, నార్మల్ పోస్టర్ అయినా రిలీజ్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ రెండు సినిమాల్లో ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే, ఈ రెండు సినిమాల్లోని హీరోలూ శ్రీరాముడి పాత్రలోనే కనిపించబోవడం. రామాయనలో రణ్‌బీర్ కపూర్ రాముడి పాత్రలో అభినయిస్తుండగా, వారణాసిలో మహేష్ బాబు కొన్ని నిమిషాల పాటూ రాముడి అవతారంలో కనిపించనున్నారు.
ఇక రిలీజ్ ప్లాన్ల పరంగా చూస్తే, రామాయణ దీపావళి సందర్భంగా విడుదల కానుండగా, వారణాసి 2027, ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ నేపథ్యంలో, మేకర్స్ ఇంకా సమయం తీసుకుని కంటెంట్‌ను మెరుగుపరచడంపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే, ఈ పండుగకు అప్డేట్స్ లేకపోవడం అభిమానులకు నిరాశ కలిగించినప్పటికీ, భారీ ప్రాజెక్టులు కావడంతో క్వాలిటీపై దృష్టి పెట్టడానికి మేకర్స్ సమయం తీసుకుంటున్నారని అర్థం చేసుకోవచ్చు.
