టాలెంటెడ్ హీరోకి ఈసారైనా హిట్ పడేనా?
ఇవాల్టితో షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసేసి గుమ్మడికాయ కొట్టబోతున్నారని, షూటింగ్ పూర్తి చేసి ఇకపై ప్రమోషన్స్ పై టీమ్ ఫోకస్ చేయనుందని తెలుస్తోంది.
By: Sravani Lakshmi Srungarapu | 1 Nov 2025 3:00 PM ISTఅన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందనే సామెతలాగా టాలీవుడ్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని విషయంలో కూడా అలానే జరుగుతూ ఉంది. అందానికి అందం, యాక్టింగ్ టాలెంట్, మంచి డ్యాన్సులు.. ఇవన్నీ ఉన్నప్పటికీ రామ్ స్టార్ హీరో కాలేకపోయారు. రామ్ కు ఉన్న టాలెంట్ కు అతను ఈపాటికే టైర్2 హీరోల లిస్ట్ లో టాప్ లో ఉండాల్సింది కానీ సరైన కథలను సెలెక్ట్ చేసుకోకపోవడం వల్ల ఇంకా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నారు.
ఇస్మార్ట్ శంకర్ తో ఆఖరి హిట్
అప్పుడెప్పుడో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తప్పించి రామ్ ఖాతాలో మరో హిట్ లేదు. ఆ సినిమా తర్వాత రామ్ నుంచి పలు సినిమాలు వచ్చినప్పటికీ అవన్నీ ఫ్లాపులు, డిజాస్టర్లుగా మిగిలాయే తప్పించి ఒక్కటీ హిట్ అయిన పాపాన పోలేదు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత మాస్ మూసలోకి వెళ్లి ఎక్కువగా అదే జానర్ లో సినిమాలు చేసిన రామ్ కు అవేవీ సక్సెస్ ను అందించలేకపోయాయి.
కీలకంగా మారిన ఆంధ్రాకింగ్ తాలూకా సక్సెస్
అందుకే ఈసారి తనకు బాగా నప్పే జానర్ లోకి వచ్చి మరీ సినిమా చేస్తున్నారు రామ్. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు. పి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. వరుస ఫ్లాపుల్లో ఉన్న రామ్ కు ఈ సినిమా సక్సెస్ ఎంతో కీలకంగా మారింది. ఆంధ్రా కింగ్ తాలూకా టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోకోపేట్ స్టూడియో లో ఆఖరి రోజు షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది.
అవుట్‌పుట్ తో టీమ్ హ్యాపీ
ఇవాల్టితో షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసేసి గుమ్మడికాయ కొట్టబోతున్నారని, షూటింగ్ పూర్తి చేసి ఇకపై ప్రమోషన్స్ పై టీమ్ ఫోకస్ చేయనుందని తెలుస్తోంది. అంతేకాదు, ఇప్పటివరకు షూటింగ్ పూర్తి చేసుకున్న కంటెంట్ మొత్తం పాజిటివ్ గానే ఉందని, చిత్ర యూనిట్ అవుట్‌పుట్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారని సమాచారం. ఆల్రెడీ ఆంధ్రాకింగ్ తాలూకా నుంచి వచ్చిన గ్లింప్స్, రెండు పాటలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా అలానే ఉంటే ఈ మూవీ రామ్ కు సక్సెస్ ను ఇవ్వడం ఖాయమనే అనుకోవాలి. నవంబర్ 28న ఈ సినిమా రిలీజ్ కానుందని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేయగా, ఇప్పుడీ సినిమా ఓ రోజు ముందుగానే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయంలో మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వచ్చింది లేదు.
