కిలోమీటర్ నైట్ ఫైట్.. డైరెక్టర్ రామ్ ప్లాన్ గట్టిగానే..
రామ్ పోతినేని హీరోగా నటిస్తూ తొలిసారి దర్శకత్వం వహిస్తున్న RAPO23 రెండో షెడ్యూల్ పూర్తైంది. ఈ షెడ్యూల్‌లో భారీ నైట్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు.
By: M Prashanth | 22 Sept 2026 9:12 PM ISTరామ్ పోతినేని హీరోగా నటిస్తూ తొలిసారి దర్శకత్వం వహిస్తున్న RAPO23 రెండో షెడ్యూల్ పూర్తైంది. ఈ షెడ్యూల్‌లో భారీ నైట్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు. దాదాపు ఒక కిలోమీటర్ పొడవునా ఏరియాను షూటింగ్ కోసం సిద్ధం చేసి, రాత్రివేళ మొత్తం లైటింగ్ మధ్య ఫైట్ తీశారు. ఆ సెటప్‌కు సంబంధించిన ఏరియల్ వ్యూను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఒకే యాక్షన్ సీక్వెన్స్ కోసం ఇంత పెద్ద ఏరియాను ఉపయోగించడం హైలెట్ అవుతోంది.
ఈ ఫైట్‌ను కెవిన్ మాస్టర్ డిజైన్ చేశారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమాటోగ్రాఫర్ తిరునవుక్కరసు కెమెరామెనా గా వర్క్ చేస్తున్నారు. కథ నియో నోయర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుండటంతో నైట్ సీన్స్‌కు కూడా మంచి స్కోప్ ఉండనుంది. లేటెస్ట్ షెడ్యూల్‌లో లైటింగ్, లొకేషన్ రెండింటిపైనా ఎక్కువగా వర్క్ చేశారు. ఏరియల్ షాట్‌లో కనిపించిన భారీ సెటప్‌తో ఈ సీక్వెన్స్‌పై టీమ్ ఎంత ఖర్చు పెట్టిందన్నది కూడా అర్థమవుతోంది. ఈ షెడ్యూల్ కూడా ప్రధానంగా రాత్రివేళల్లోనే సాగింది.
రామ్‌కు డైరెక్టర్‌గా ఇదే మొదటి సినిమా. హీరోగా ఎన్నో కమర్షియల్ సినిమాలు చేసిన ఆయన ఈసారి కథను రాసుకోవడంతో పాటు దర్శకత్వం కూడా చేస్తున్నారు. హీరోగా నటిస్తూనే రైటర్, డైరెక్టర్‌గా కూడా ఈ ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేస్తున్నారు. ఆయన సోదరుడు కృష్ణ పోతినేని రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
సంయుక్త హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆమె పాత్ర గురించి మాత్రం ఇప్పటివరకు పెద్దగా వివరాలు బయటకు రాలేదు. సామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్ చూస్తున్నారు. RAPO23ను నియో-నోయర్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. రామ్ గతంలో ఎక్కువగా చేసిన కమర్షియల్ యాక్షన్ సినిమాలకు భిన్నంగా ఈసారి డార్క్ జోన్‌లో కథను ఎంచుకున్నారు. ప్రస్తుతం మేకర్స్ కూడా కథ కంటే మేకింగ్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌నే ఎక్కువగా బయటకు ఇస్తున్నారు.
రెండో షెడ్యూల్‌లో ఈ నైట్ ఫైట్‌కే ఎక్కువ సమయం కేటాయించారు. ఒక కిలోమీటర్ మేర లైటింగ్ ఏర్పాటు చేసి షూట్ చేయడం వల్ల ఇది సినిమాలో కీలకమైన యాక్షన్ బ్లాక్‌గా ఉండొచ్చనే అంచనా ఉంది. అయితే ఫైట్ ఎవరిపై ఉంటుంది, కథలో ఏ సమయంలో వస్తుంది అనే విషయాలను టీమ్ బయటపెట్టలేదు. ఇప్పటివరకు విడుదల చేసిన విజువల్స్‌లో కూడా రామ్ లుక్, కథకు సంబంధించిన విషయాలను దాచిపెట్టారు. రెండో షెడ్యూల్ ముగియడంతో ఇప్పుడు తర్వాతి షెడ్యూల్‌కు ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. తదుపరి షెడ్యూల్‌లో సంయుక్తతో పాటు మిగతా పాత్రలకు సంబంధించిన సీన్స్‌ను కూడా చిత్రీకరించే అవకాశం ఉంది.
