హీరోల ట్యాగ్స్.. అసలు విషయం బయటపెట్టిన రామ్
ఒకరికి అనుకున్న ట్యాగ్ మరొకరికి వెళ్లడం, లేదా ఫ్యాన్స్ కోసం పాత ట్యాగ్స్ మార్చుకోవడం ఇక్కడ కామన్.
By: M Prashanth | 26 Nov 2025 11:56 AM ISTటాలీవుడ్ హీరోలకు పేర్ల కంటే వాళ్ళకున్న 'ట్యాగ్స్' ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. మెగాస్టార్ నుంచి ఐకాన్ స్టార్ వరకు ప్రతి హీరోకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉండాల్సిందే. అయితే కొన్నిసార్లు ఈ బిరుదుల వెనుక పెద్ద డ్రామానే నడుస్తుంటుంది. ఒకరికి అనుకున్న ట్యాగ్ మరొకరికి వెళ్లడం, లేదా ఫ్యాన్స్ కోసం పాత ట్యాగ్స్ మార్చుకోవడం ఇక్కడ కామన్. తాజాగా హీరో రామ్ పోతినేని చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారితీశాయి.
నిజానికి రామ్ కు తన పేరు ముందు తోకలాగా ఈ బిరుదులు ఉండటం పెద్దగా ఇష్టం ఉండదట. కానీ కెరీర్ మొదట్లో ఫ్యాన్స్, నిర్మాతల ఒత్తిడి మేరకు ఒక ట్యాగ్ పెట్టుకోవడానికి ఒప్పుకున్నాడు. అప్పట్లో రామ్ కోసం ఒక క్రేజీ ట్యాగ్ ను డిసైడ్ చేశారు కూడా. కానీ ఊహించని విధంగా ఆ టైటిల్ పక్క హీరో ఖాతాలోకి వెళ్లిపోయింది. ఆ హీరో ఆ ట్యాగ్ ను వాడేసుకోవడంతో, రామ్ సైలెంట్ అయిపోవాల్సి వచ్చిందట.
రామ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నా సినిమాలకు ఆ ట్యాగ్ వేయడం మొదలుపెట్టారు. ఫ్యాన్స్ కూడా అలవాటు పడ్డారు. కానీ సడెన్ గా మరో హీరో ఆ ట్యాగ్ ను వాడటం మొదలుపెట్టారు. అప్పుడు నేనేమీ చేయలేక సైలెంట్ గా ఆ బిరుదును త్యాగం చేయాల్సి వచ్చింది" అని అసలు విషయం బయటపెట్టారు. అయితే ఆ హీరో ఎవరు? ఆ ట్యాగ్ ఏంటి? అనే విషయాన్ని మాత్రం రామ్ బయటపెట్టకుండా హుందాగా వ్యవహరించారు.
ఆ ట్యాగ్ వేరే హీరోకి వెళ్ళిపోయాక, రామ్ కు "ఎనర్జిటిక్ స్టార్" అనే బిరుదు వచ్చింది. అది ఆయన బాడీ లాంగ్వేజ్ కు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. అయితే మధ్యలో "ఉస్తాద్" అని మార్చుకున్నా, అది పెద్దగా కలిసిరాకపోవడంతో ఇప్పుడు మళ్ళీ తన పాత బ్రాండ్ "ఎనర్జిటిక్ స్టార్" వైపే రామ్ మొగ్గు చూపారు. 'ఆంధ్ర కింగ్ తాలూకా' సినిమాకు ఇదే వాడుతున్నారు.
కేవలం రామ్ మాత్రమే కాదు, ఈ మధ్య చాలామంది హీరోలు పాత ట్యాగ్స్ వైపే చూస్తున్నారు. రామ్ చరణ్ కూడా గ్లోబల్ స్టార్ ట్యాగ్ ను పక్కన పెట్టి, ఫ్యాన్స్ కు ఇష్టమైన "మెగా పవర్ స్టార్" గానే కొనసాగుతున్నారు. కొత్త బిరుదుల కంటే, ఆడియన్స్ కు అలవాటైన పాత ట్యాగ్స్ లోనే కిక్ ఉందని హీరోలు గ్రహించినట్లున్నారు.
ఏదేమైనా హీరోల ట్యాగ్స్ వెనుక ఇంత పెద్ద కథ నడుస్తోందని రామ్ వ్యాఖ్యలతో అర్థమవుతోంది. ఆనాడు తన ట్యాగ్ ను వేరే హీరో తీసుకున్నా, రామ్ పెద్దగా ఎలాంటి క్లాష్ లేకుండా సైలెంట్ గా తప్పుకోవడం ఆయన మెచ్యూరిటీని చూపిస్తోంది. బిరుదులు ఏవైనా, చివరికి నిలిచేది కంటెంట్ మాత్రమే అని ఈ స్టార్స్ బలంగా నమ్ముతున్నారు.
