Begin typing your search above and press return to search.

రామ్ నెక్స్ట్.. డైరెక్టర్ తప్పుకున్నారా? తప్పించారా?

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన అప్ కమింగ్ మూవీతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలనే లక్ష్యంతో సిద్ధమవుతున్నారు.

By:  M Prashanth   |   20 April 2026 3:51 PM IST
రామ్ నెక్స్ట్.. డైరెక్టర్ తప్పుకున్నారా? తప్పించారా?
X

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన అప్ కమింగ్ మూవీతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలనే లక్ష్యంతో సిద్ధమవుతున్నారు. అయితే ఆ ప్రాజెక్ట్‌ కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన పరిణామం ఇప్పుడు టాలీవుడ్‌ లో చర్చనీయాంశంగా మారింది. సినిమా అధికారిక ప్రకటనకు ముందే దర్శకుడు ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు నిజమేనని తెలుస్తోంది.

నిజానికి.. ఇటీవల కాలంలో రామ్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. కమర్షియల్, ప్రయోగాత్మక చిత్రాల మధ్య బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ విజయాలు మాత్రం దక్కలేదు. దీంతో ఈసారి కాస్త జాగ్రత్తగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా కొత్త సినిమాకు కథను స్వయంగా రామ్ సిద్ధం చేయడం విశేషంగా మారింది.

ఆ ప్రాజెక్ట్‌ ను తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ శిష్యుడు విఘ్నేష్ తెరకెక్కించనున్నారని గత కొంతకాలంగా వార్తలు వచ్చాయి. ఆ కాంబినేషన్ దాదాపు ఖరారైందని కూడా ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టు నుంచి విఘ్నేష్ తప్పుకున్నారు. అయితే ఆయన స్వయంగా తప్పుకున్నారా? లేక మేకర్స్ పక్కన పెట్టారా? అన్నది స్పష్టంగా తెలియాల్సి ఉంది.

కథకు మంచి డెప్త్ ఉండటంతో, డెబ్యూ డైరెక్టర్‌ కు ఇది పెద్ద సవాల్ అవుతుందనే ఆలోచనతోనే ఆ మార్పు జరిగిందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. దీంతో ఇప్పుడు ఆ సినిమాను ఎవరు దర్శకత్వం వహిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఆ ప్రాజెక్ట్‌ కు సంబంధించి మరో ఆసక్తికర అంశం టైటిల్. ది లోన్ వూల్ఫ్ అనే పేరును ఫిల్మ్ ఛాంబర్‌ లో ఇప్పటికే రిజిస్టర్ చేసినట్టు సమాచారం.

ఆ టైటిల్ కథకు తగినట్లుగానే ఉండబోతుందని తెలుస్తోంది. ఒక స్ట్రాంగ్, ఒంటరిగా పోరాడే పాత్ర చుట్టూ కథ తిరిగే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అధికారిక ప్రకటన విషయానికి వస్తే, మే 15న రామ్ పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమాను అనౌన్స్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఆ రోజు డైరెక్టర్, ఇతర కీలక వివరాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

వరుస పరాజయాలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా, మరింత పట్టుదలతో ముందుకు సాగుతున్న రామ్ పోతినేని కొత్త ప్రాజెక్ట్‌ పై భారీ ఆశలు పెట్టుకున్నారు. కథను స్వయంగా రాసుకోవడం, కొత్త టీమ్‌ తో ప్రయోగం చేయడం.. సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. మరి ది లోన్ వూల్ఫ్ సినిమాతో అయినా రామ్ సక్సెస్ ట్రాక్‌ లోకి తిరిగి వస్తారా? దర్శకుడు మార్పు కొత్త ప్రాజెక్ట్‌ కు ఎంతవరకు ప్లస్ అవుతుంది? అన్నది తెలియాలంటే సినిమా విడుదల అయ్యే వరకు వేచి చూడాల్సిందే.