Begin typing your search above and press return to search.

నాలుగు క‌థ‌ల‌కు డైరెక్ట‌ర్ల‌ను సెట్ చేసే ప‌నిలో హీరో!

రామ్ పోతినేనికి తొలి నుంచీ ఓ ప్రత్యేకమైన అలవాటు ఉంది. తనకు నచ్చిన కథలను, విభిన్నమైన పాయింట్లను ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి తన స్టోరీ బ్యాంక్లో భద్రపరుచుకుంటాడు.

By:  Srikanth Kontham   |   17 March 2026 10:58 AM IST
నాలుగు క‌థ‌ల‌కు డైరెక్ట‌ర్ల‌ను సెట్ చేసే ప‌నిలో హీరో!
X

ప్రస్తుతం ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ తన కెరీర్‌లో అత్యంత కీలకమైన దశలో ఉన్నారు. వరుసగా వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి కమర్షియల్ సక్సెస్ మాత్రం ఆయనకు ప‌డ‌టం లేదు. ఆమ‌ధ్య రిలీజ్ అయిన ` ఆంధ్రా కింగ్ తాలూకా` తోనైనా బౌన్స్ బ్యాక్ అవుతాడ‌నుకుంటే?ఆ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్ల పరంగా మాత్రం చిత్ర యూనిట్‌ను పూర్తిస్థాయిలో సంతృప్తి పరచలేదు. ఈ నేపథ్యంలో రామ్ రూటు మార్చి పక్కా కమర్షియల్ బ్లాక్ బస్టర్ కోసం ప్లానింగ్‌తో బ‌రిలోకి దిగుతున్నాడు.

రామ్ పోతినేనికి తొలి నుంచీ ఓ ప్రత్యేకమైన అలవాటు ఉంది. తనకు నచ్చిన కథలను, విభిన్నమైన పాయింట్లను ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి తన స్టోరీ బ్యాంక్లో భద్రపరుచుకుంటాడు. సినిమా సినిమాకు మధ్య గ్యాప్ వచ్చినా? తన దగ్గర ఉన్న కథల్లో ఏది సమయానికి సరిపోతుందో? దాన్ని పట్టాలెక్కించడం ఆయన స్టైల్. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం రామ్ వద్ద నాలుగు కథలు సిద్ధంగా ఉన్నాయ‌ని తెలిసింది. ఈ కథలు విభిన్న జోనర్లకు చెందినవి అట‌. దీంతో రామ్ టార్గెట్ ఫిక్స్ అయింది. తన దగ్గర ఉన్న నాలుగు కథలకు సరైన దర్శకులను సెట్ చేయడం. ప్ర‌స్తుతం రామ్ ఆ ప‌నిలోనే ఉన్న‌ట్లు తెలిసింది.

కథ ఎంత బాగున్నా? దాన్ని వెండితెరపై ఆవిష్కరించే దర్శకుడు సమర్థుడైతేనే ఫలితం అద్భుతంగా ఉంటుంది. అందుకే ఏ దర్శకుడు ఏ కథకు న్యాయం చేయగలరు? అనే కోణంలో రామ్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడుట‌. ఇప్పటికే కొంతమంది సీనియర్ దర్శకులతో పాటు, కొత్త తరం ఆలోచనలున్న కుర్ర డైరెక్టర్లతో కూడా ఆయన చర్చలు జరుపుతున్నట్లు ఫిలిం నగర్ టాక్ న‌డుస్తోంది. గత కొన్నాళ్లుగా వరుస ప్లాపులు పలకరిస్తుండటంతో రామ్ ఇప్పుడు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేడు. అందుకే తన స్టోరీ బ్యాంక్‌లోని ఆ నాలుగింటిలో ఏది అత్యంత పవర్‌ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్ కలిగి ఉందో దాన్నే ముందుగా సెట్స్ పైకి తీసుకెళ్లే అవ‌కాశం ఉంది.

మాస్ ఆడియన్స్‌ను మెప్పించే అంశాలు, పక్కా ఎంటర్టైన్మెంట్ ఉన్న క‌థ‌కు ప్రాధ‌న్య‌త ఇవ్వ‌నున్నాడు. ఇలా హీరో స్వయంగా కథలను ఎంచుకుని వాటికి తగిన దర్శకులను వెతకడం అనేది అత‌డికి సినిమాపై ఉన్న అంకితభావాన్ని చాటిచెబుతోంది. `ఇస్మార్ట్ శంకర్` వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత మళ్ళీ అలాంటి మేజిక్ రిపీట్ కాలేదు. దీంతో ఈసారి ప్రయోగాలు పక్కన పెట్టి బాక్సాఫీస్‌ను షేక్ చేసే బొమ్మనే దించాలని కంకణం కట్టుకున్నాడు. ఈ నాలుగు కథల్లో ఒకదానితో త్వరలోనే ఒక క్రేజీ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.

రామ్ పోతినేని ప్లానింగ్ చూస్తుంటే ఈసారి ఆయన కొట్టే దెబ్బ మామూలుగా ఉండదనిపిస్తోంది. కమర్షియల్ హిట్ అనేది ఇప్పుడు ఆయన కెరీర్‌కు బూస్ట్ లాంటిది. తన సొంత కథా బలంతో రామ్ ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి.