రామ్.. ఇది కదా కావాల్సింది
రామ్ పోతినేని అంటే ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ మాత్రమే ఉండేది. 'దేవదాసు'తో ఎంట్రీ ఇచ్చి, 'రెడీ', 'రామ రామ కృష్ణ కృష్ణ' వంటి సినిమాలతో యూత్ ను బాగా ఆకట్టుకున్నాడు.
By: M Prashanth | 27 Nov 2025 11:10 PM ISTరామ్ పోతినేని అంటే ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ మాత్రమే ఉండేది. 'దేవదాసు'తో ఎంట్రీ ఇచ్చి, 'రెడీ', 'రామ రామ కృష్ణ కృష్ణ' వంటి సినిమాలతో యూత్ ను బాగా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా 'నేను శైలజ' సినిమాలో ఆయన చూపించిన సటిల్ యాక్టింగ్, ఆ ఎమోషన్ చాలా మందికి కనెక్ట్ అయ్యింది. అప్పట్లో రామ్ నటనలో ఒక హుందాతనం, పాత్రకు తగ్గట్టుగా ఒదిగిపోయే లక్షణం స్పష్టంగా కనిపించేది.
'ఉన్నది ఒకటే జిందగీ', 'హలో గురు ప్రేమ కోసమే' వంటి చిత్రాల్లో కూడా రామ్ తన మార్క్ ఎమోషన్స్ ను పండించాడు. ఓవర్ యాక్షన్ లేకుండా, కళ్ళతోనే భావాలను వ్యక్తపరిచే రామ్ నటనకు క్లాస్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. లవ్ స్టోరీలకు పర్ఫెక్ట్ ఛాయిస్ అనిపించుకున్నాడు. అయితే కాలక్రమేణా ట్రెండ్ మారుతున్న కొద్దీ, రామ్ కూడా తన పంథాను మార్చుకోవాల్సి వచ్చింది.
'ఇస్మార్ట్ శంకర్' రామ్ కెరీర్ ను పూర్తిగా మలుపు తిప్పింది. పూరీ జగన్నాథ్ చూపించిన ఆ ఊర మాస్ యాంగిల్ కు బాక్సాఫీస్ షేక్ అయ్యింది. అక్కడి నుంచి రామ్ ఫోకస్ అంతా మాస్ మీదే పడింది. 'రెడ్', 'ది వారియర్', 'స్కంద', 'డబుల్ ఇస్మార్ట్'.. ఇలా వరుసగా లౌడ్ క్యారెక్టర్లే ఎంచుకున్నాడు. దీనివల్ల ఆయనలోని ఆ సున్నితమైన నటుడు వెనకబడిపోయాడు.
మాస్ ఇమేజ్ కోసం రామ్ చేసిన ప్రయత్నం ఒక దశలో బాగానే వర్కవుట్ అయినా, అదే పనిగా రొటీన్ మాస్ కథలు చేయడం వల్ల ఆడియన్స్ కు మొనాటమీ వచ్చేసింది. ఎమోషన్ కంటే ఎలివేషన్స్ కు, నటన కంటే మాస్ హడావుడికి ప్రాధాన్యత పెరిగిపోయింది. దీంతో 'నేను శైలజ'లో చూసిన ఆ రామ్ ఎక్కడా? అని ఫ్యాన్స్ కూడా ఫీలయ్యే పరిస్థితి వచ్చింది. ఆ మ్యాజిక్ మిస్ అవుతోందనే కామెంట్స్ గట్టిగానే వినిపించాయి.
సరిగ్గా ఇలాంటి టైంలో 'ఆంధ్ర కింగ్ తాలూకా' రూపంలో రామ్ మళ్ళీ తన పాత రూట్ లోకి వచ్చాడు. ఇందులో 'సాగర్' పాత్రలో ఆయన చూపించిన పరిణితి, ఆ సటిల్ ఎమోషన్స్ చూస్తుంటే.. రామ్ కు కావాల్సింది ఇదే కదా అనిపిస్తోంది. మాస్ ముసుగు తీసేసి, ఒక సామాన్యుడి పాత్రలో జీవించడం ద్వారా తనలోని నటుడిని మళ్ళీ తట్టిలేపాడు. ఎక్కడా అతి చేయలేదు, అనవసరమైన హీరోయిజం చూపించలేదు. చాలా కుదురుగా, ఒక పక్కింటి కుర్రాడిలా ఒదిగిపోయాడు.
ఒక అభిమానిలో ఉండే ఆరాధనను, అదే సమయంలో తన జీవితంలో ఉండే సంఘర్షణను చాలా బ్యాలెన్స్డ్ గా చూపించాడు. రామ్ కెరీర్ లోనే ఇదొక మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. సటిల్ గా నటిస్తూనే ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చని రామ్ నిరూపించాడు. ఇన్నాళ్లు రామ్ ను కేవలం మాస్ హీరోగానే చూసిన వారికి ఈ సినిమా ఒక సర్ప్రైజ్. ఈ పాత్రలో రామ్ నటన చూశాక, కొత్తగా ఆయనకు అభిమానులు తయారైతే ఆశ్చర్యపోనక్కర్లేదు. ముఖ్యంగా క్లాస్ ఆడియన్స్, నటనను ఇష్టపడే వారికి రామ్ ఈ సినిమాతో మరింత దగ్గరయ్యాడు. కథలో ఎంత నిజాయితీ ఉందో, రామ్ నటనలోనూ అంతే నిజాయితీ కనిపించింది.
రామ్ తన కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. లవర్ బాయ్ నుంచి మాస్ హీరోగా, ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ నటుడిగా మారుతున్న ఈ ప్రయాణం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మాస్ అవసరమే కానీ, అది మాత్రమే ఉంటే సరిపోదు. అప్పుడప్పుడు ఇలాంటి కంటెంట్ ఉన్న పాత్రలు చేస్తేనే రామ్ లాంటి టాలెంటెడ్ హీరోకు న్యాయం జరుగుతుంది. 'ఆంధ్ర కింగ్' ఆ దారిని చూపించిందనే చెప్పాలి.
