రామ్ పోతినేని.. మళ్ళీ పెద్ద సినిమానా?
దీంతో తన మార్కెట్ స్టామినాను నిరూపించుకునే బలమైన కథ కోసం వేచి చూసిన రామ్, ఫైనల్‌గా లోకేష్ కనగరాజ్ శిష్యుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
By: M Prashanth | 24 March 2026 11:36 PM ISTఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాల్సిన అవసరం ఉంది. 'ఇస్మార్ట్ శంకర్' తెచ్చిన ఊపును 'రెడ్', 'వారియర్', 'స్కంద' వంటి చిత్రాలు కొనసాగించలేకపోయాయి. దీంతో రామ్ తన తదుపరి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. రీసెంట్‌గా వచ్చిన 'ఆంధ్రా కింగ్ తాలుకా' పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో తన మార్కెట్ స్టామినాను నిరూపించుకునే బలమైన కథ కోసం వేచి చూసిన రామ్, ఫైనల్‌గా లోకేష్ కనగరాజ్ శిష్యుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో సాగే ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నట్లు టాక్. గత కొన్నాళ్లుగా రామ్ తన సొంత కథలపై కూడా వర్క్ చేశాడు. కానీ బయట దర్శకులు చెప్పిన కథలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తోంది.. పెద్ద దర్శకుల దగ్గర పనిచేసిన శిష్యులు కొత్త ఐడియాలతో వచ్చి హిట్లు కొడుతున్నారు. ఇప్పుడు రామ్ కూడా అదే నమ్మకంతో లోకేష్ కనగరాజ్ స్కూల్ నుంచి వచ్చిన టాలెంట్‌ను నమ్ముకున్నాడు.
ముఖ్యంగా ఈ సినిమా బడ్జెట్ విషయంలో రామ్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదని కూడా తెలుస్తోంది. ఇప్పటివరకు తన కెరీర్‌లో చేసిన సినిమాలన్నింటికంటే ఇది అత్యంత భారీ ఖర్చుతో కూడిన ప్రాజెక్ట్ అని టాక్. రామ్ మార్కెట్ లెక్కలను మించి మరీ నిర్మాతలు ఈ సినిమాపై ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధమయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇద్దరు నిర్మాతలు కలిసి నిర్మించే అవకాశం ఉందట. కేవలం యాక్షన్ సీక్వెన్సుల కోసమే కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారట. ఒక రకంగా చెప్పాలంటే, రామ్ కెరీర్‌లోనే ఇది అతిపెద్ద రిస్క్ అని కొందరు అంటున్నా.. కంటెంట్ మీద నమ్మకంతో ఈ బిగ్ బడ్జెట్ మూవీకి ఉస్తాద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.
ఆమధ్య రామ్ చాలా కథలు విన్నప్పటికీ, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా యాక్షన్ థ్రిల్లర్ కథకు ఓకే చేయడం వెనుక ఒక పక్కా ప్లాన్ ఉన్నట్లు అర్థమవుతోంది. కేవలం మాస్ మసాలా ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా, లేటెస్ట్ ట్రెండుకు తగ్గట్టుగా కథలో కొత్తదనం ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారని రామ్ గుర్తించినట్లున్నాడు. భారీ హంగులతో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రం రామ్ కెరీర్‌లో ఒక విజువల్ వండర్‌గా నిలిచే ఛాన్స్ ఉంది.
రామ్ కెరీర్ గ్రాఫ్ చూస్తే, ఒక సాలిడ్ హిట్ పడితే తప్ప మార్కెట్ నిలదొక్కుకోవడం కష్టం. వరుస ప్రయోగాల కంటే, తన బాడీ లాంగ్వేజ్‌కు సెట్ అయ్యే కమర్షియల్ విజువల్ వండర్ కోసం ఆయన ఇన్ని రోజులు వేచి చూశాడు. ఒకవైపు ఇతర హీరోలు చకచకా సినిమాలు పూర్తి చేస్తుంటే, రామ్ మాత్రం చాలా నిదానంగా కథను కొలిక్కి తెచ్చాడు. మరి ఈ లోకేష్ శిష్యుడు రామ్ లోని అసలైన 'ఉస్తాద్' ను మళ్ళీ బయటకు తీస్తాడా లేదా అన్నది చూడాలి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
