ఒక్క రాత్రిలో మా కుటుంబం జీరోకి వచ్చేశాం -హీరో రామ్
ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోగా.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు హీరో రామ్.
By: Madhu Reddy | 20 Oct 2025 12:30 PM ISTప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోగా.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు హీరో రామ్. అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు సొంతం చేసుకున్న ఈయన.. గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అందుకే ఈసారి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు . ఈ క్రమంలోనే తాజాగా 'ఆంధ్ర కింగ్ తాలూకా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నవంబర్ 28న తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఒక నెల రోజులు ముందుగానే ప్రమోషన్స్ చేపట్టారు రామ్.
ఈ క్రమంలోనే ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో జగపతిబాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'జయమ్ము నిశ్చయమ్మురా' అనే టాక్ షోకి గెస్ట్ గా విచ్చేశారు రామ్. ఇందులో ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ ముచ్చట్లతోపాటు తన బాల్యంలో తమ కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కూడా రామ్ మాట్లాడారు. హీరో రామ్ మాట్లాడుతూ.. "నా గురించి చాలామందికి తెలియదు. మా అమ్మ వాళ్ళది హైదరాబాద్ కావడంతో నేను ఇక్కడే పుట్టాను. కానీ ఆ తర్వాత మేము విజయవాడ వెళ్ళిపోయాము. అయితే 1988లో విజయవాడలో కుల ఘర్షణలు ఎక్కువగా జరిగాయి. ఆ ఘర్షణలో అప్పటివరకు సంపాదించింది అంతా మా కుటుంబం కోల్పోయింది. ఒక్క రాత్రిలో మేము జీరోకి వచ్చేసాము.
దాంతో విజయవాడలో ఉండడం కరెక్ట్ కాదని.. అక్కడ నుంచి మా నాన్న మమ్మల్ని చెన్నైకి తీసుకెళ్లిపోయి.. మొదటి నుంచి ప్రారంభించారు. సాధారణంగా కింద నుంచి కష్టపడి ఒక స్థాయికి రావడం వేరు.. అంత కష్టపడి పైకి వచ్చాక మొత్తం కోల్పోయి మళ్లీ మొదటి నుంచి ప్రారంభించడం వేరు.. అలా మా నాన్న తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని మళ్ళీ ఈ స్థాయికి వచ్చారు. అందుకే మా నాన్న అంటే నాకు చాలా గౌరవం. ఇకపోతే మేము ఆ విజయవాడలో ఎంత కోల్పోయాము అనే విషయానికి వస్తే మేము విజయవాడలో ఉన్నప్పుడు నా కోసం ప్రత్యేకంగా ఒక బొమ్మల గది ఉండేది.. ఆ గదిలో సగం కూడా మేము చెన్నైకి వచ్చిన తర్వాత ఉన్న ఇల్లు లేదు. జీవితంలో అన్ని కష్టాలు పడి మా నాన్న ఈ స్థాయికి వచ్చారు.. మాకంటూ ఒక స్థానాన్ని కల్పించారు" అంటూ అసలు విషయాన్ని తెలియజేశారు హీరో రామ్.
రామ్ కెరియర్ విషయానికి వస్తే.. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో రామ్ హీరోగా.. ఇలియానా హీరోయిన్గా నటించిన చిత్రం దేవదాసు. 2006 జనవరి 11న విడుదలైన ఈ సినిమా మంచి విజయం అందుకోవడమే కాకుండా ఉత్తమ నటుడు విభాగంలో రామ్ కి ఫిలింఫేర్ అవార్డు లభించింది. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన జగడం సినిమా డిజాస్టర్ గా నిలిచినా.. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అలా ఒక్కో చిత్రం చేస్తూ ప్రేక్షకులను విపరీతంగా మెప్పించిన రామ్.. చివరిగా ఇస్మార్ట్ శంకర్ తో ఓవర్ నైట్ లోనే ఊహించని పాపులారిటీ దక్కించుకున్నారు.
అయితే ఆ క్రేజ్ ఎక్కువ కాలం నిలవలేదు. ఇక 2021 నుంచి ఈయనకు పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి. అలా రెడ్, రొమాంటిక్, ది వారియర్, స్కంద , డబుల్ ఇస్మార్ట్ ఇలా ప్రతి సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు రాబోతున్న ఆంధ్ర కింగ్ తాలూకా అయినా సక్సెస్ అందిస్తుందో లేదో చూడాలి.
