ఆంధ్ర కింగ్ తాలూకా: 'డెడ్ సీజన్' ఎఫెక్ట్ పై రామ్ క్లారిటీ
సినిమా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయాలంటే కంటెంట్ ఎంత ముఖ్యమో, రిలీజ్ టైమింగ్ కూడా అంతే కీలకం. ఒక్కోసారి మంచి సినిమాలు కూడా రాంగ్ టైమ్ లో వచ్చి ఇబ్బంది పడుతుంటాయి.
By: M Prashanth | 2 Dec 2025 10:35 PM ISTసినిమా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయాలంటే కంటెంట్ ఎంత ముఖ్యమో, రిలీజ్ టైమింగ్ కూడా అంతే కీలకం. ఒక్కోసారి మంచి సినిమాలు కూడా రాంగ్ టైమ్ లో వచ్చి ఇబ్బంది పడుతుంటాయి. ఇప్పుడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సినిమా విషయంలోనూ ఇదే చర్చ నడుస్తోంది. 'ఆంధ్ర కింగ్ తాలూకా' సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా, కలెక్షన్ల విషయంలో స్లో స్టార్ట్ దక్కింది. అయితే దీని వెనుక ఉన్న అసలు కారణాన్ని, సినిమా భవిష్యత్తును అంచనావేస్తూ చిత్ర యూనిట్ ఆసక్తికర కామెంట్స్ చేసింది.
సాధారణంగా మాస్ సినిమాలు అంటే ఫైట్లు, పాటలే హైలైట్ అనుకుంటాం. కానీ దర్శకుడు మహేష్ బాబు పి. మాత్రం ఇందులో ఒక బలమైన ఎమోషన్ ను నమ్ముకున్నారు. ఒక స్టార్ హీరోకి, అభిమానికి మధ్య ఉండే బంధాన్ని వెండితెరపై ఆవిష్కరించిన తీరు చూసి జనాలు ఫిదా అవుతున్నారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ రామ్ నటన గురించి, ఆ రైటింగ్ లోని బలం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. పది మందిలో తొమ్మిది మందికి సినిమా నచ్చిందంటే ఆ కంటెంట్ పవర్ ఏంటో అర్థమవుతుంది.
హైదరాబాద్ లో జరిగిన థ్యాంక్ యు మీట్ లో నిర్మాత మైత్రీ రవి మాట్లాడుతూ వాస్తవ పరిస్థితిని వివరించారు. నవంబర్ చివరి వారం అంటే సినిమాలకు ఒక రకంగా అన్ సీజన్ లాంటిది. అందుకే తాము మొదటి రోజే భారీ ఓపెనింగ్స్ ను ఆశించలేదని క్లారిటీ ఇచ్చారు. అయితే సినిమాకు వస్తున్న మౌత్ టాక్ బాగుంది కాబట్టి, రాబోయే రోజుల్లో కలెక్షన్లు పుంజుకుంటాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
ఇక రామ్ పోతినేని కూడా ఇదే విషయాన్ని స్ట్రాంగ్ గా చెప్పారు. నవంబర్ 'డెడ్ సీజన్' ఎఫెక్ట్ గురించి తమకు ముందే తెలుసని, అందుకే ఓపెనింగ్స్ గురించి కంగారు పడలేదని అన్నారు. ఒక మంచి ప్రయత్నం చేసినప్పుడు అది జనాల్లోకి వెళ్లడానికి కొంత సమయం తీసుకుంటుంది. సినిమా చూసిన వారు రాస్తున్న పెద్ద లెటర్స్, రివ్యూలే తమకు దక్కిన అసలైన విజయం అని రామ్ చెప్పుకొచ్చారు.
సినిమాను ఇప్పుడే తక్కువ అంచనా వేయవద్దని, ఇప్పుడే కథ మొదలైందని రామ్ అంటున్నారు. ఎమోషనల్ గా కనెక్ట్ అయిన ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కట్టడం ఖాయం. ప్రస్తుతం వస్తున్న ఆదరణ చూస్తుంటే, రాబోయే రోజుల్లో బుకింగ్స్ పెరుగుతాయనే కాన్ఫిడెన్స్ టీమ్ లో కనిపిస్తోంది. అందుకే ప్రమోషన్స్ ను ఆపకుండా, మరింత స్పీడ్ గా జనాల్లోకి తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు.
నిజాయితీగా తీసిన సినిమా ఎప్పుడూ ఫెయిల్ అవ్వదని, దానికి ఆడియెన్స్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. స్లోగా మొదలైనా, లాంగ్ రన్ లో 'ఆంధ్ర కింగ్' సేఫ్ జోన్ లోకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి రామ్ నమ్మకం ఏ మేరకు నిజమవుతుందో, ఈ ఎమోషనల్ డ్రామా బాక్సాఫీస్ రేసులో చివరికి ఎక్కడ నిలుస్తుందో వేచి చూడాలి.
