Begin typing your search above and press return to search.

'ఆంధ్ర కింగ్' రన్ టైమ్ ఎంతంటే..

రామ్ పోతినేని, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో వస్తున్న 'ఆంధ్ర కింగ్ తాలూకా' విడుదలకు సిద్ధమవుతోంది.

By:  M Prashanth   |   19 Nov 2025 2:23 PM IST
ఆంధ్ర కింగ్ రన్ టైమ్ ఎంతంటే..
X

రామ్ పోతినేని, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో వస్తున్న 'ఆంధ్ర కింగ్ తాలూకా' విడుదలకు సిద్ధమవుతోంది. నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో మంచి అంచనాలే ఉన్నాయి. నిన్న కర్నూలులో జరిగిన భారీ ఈవెంట్‌లో ట్రైలర్ విడుదల చేయగా, దానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుతోంది. ముఖ్యంగా రామ్ ఎనర్జీ, ఫ్యాన్ ఎమోషన్ బాగా వర్కవుట్ అయినట్లు కనిపిస్తోంది.

ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అదే సినిమా రన్ టైమ్. లేటెస్ట్ టాక్ ప్రకారం, ఈ సినిమా నిడివి సుమారు 165 నిమిషాలు, అంటే 2 గంటల 45 నిమిషాల పాటు ఉండబోతోందట. సాధారణంగా ఈ మధ్య కాలంలో వచ్చే కమర్షియల్ సినిమాలు 2 గంటల 30 నిమిషాల లోపే ఉంటున్నాయి. ఆ లెక్కన చూస్తే ఇది కొంచెం నిడివి ఎక్కువే అని చెప్పాలి.

గతంలో 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' వంటి క్లాసీ హిట్ ఇచ్చిన దర్శకుడు మహేష్ బాబు పి, ఈసారి ఒక ఎమోషనల్ డ్రామాను ఎంచుకున్నారు. ఒక అభిమాని జీవితాన్ని, అతని ఎమోషన్స్ ని డీటైల్డ్ గా చూపించడానికి దర్శకుడు ఇంత సమయం తీసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. కథలో విషయం ఉంటే ఆడియన్స్ గంటల తరబడి కూర్చోవడానికి రెడీగానే ఉంటారు కాబట్టి, మేకర్స్ ఈ రన్ టైమ్ ని లాక్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర 'సూపర్ స్టార్' పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్ర నిడివి కూడా ఎక్కువే ఉండొచ్చు. అలాగే హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే, ఇతర కీలక పాత్రల్లో మురళీ శర్మ, రావు రమేష్, సత్య, రాహుల్ రామకృష్ణ, విటివి గణేష్ వంటి భారీ తారాగణం ఉంది. వీరందరి పాత్రలకు సరైన న్యాయం చేయాలంటే ఆ మాత్రం సమయం అవసరమేనేమో.

ఇప్పటికే వివేక్ మెర్విన్ అందించిన పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. మ్యూజిక్ పరంగా సినిమా సక్సెస్ అయ్యింది. ఇప్పుడు ఈ 'లాంగ్ రన్ టైమ్' వార్త నిజమైతే, ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే ఎంత గ్రిప్పింగ్ గా ఉంటుందనేది కీలకం. ఎక్కడా బోర్ కొట్టకుండా కథను నడిపిస్తే, ఈ నిడివి సినిమాకు ప్లస్ అవుతుంది తప్ప మైనస్ కాదు.

అయితే, ఈ రన్ టైమ్ పై నిర్మాణ సంస్థ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. సెన్సార్ పూర్తయితే అసలు నిడివిపై పూర్తి క్లారిటీ వస్తుంది. రిలీజ్ కు ఇంకా వారం రోజులే సమయం ఉండటంతో, ఎడిటింగ్ వర్క్ చివరి దశలో ఉంది. మరి ఈ ఎమోషనల్ రైడ్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.