రామ్ గోపాల్ వర్మ రివర్స్ ఆపరేషన్!
ఐకానిక్ పాత్రకు నటీనటులను మార్చడం ఎప్పుడూ పెద్ద చర్చకు దారితీస్తుంది. `డాన్ 3` చిత్రంలో షారుఖ్ ఖాన్ స్థానంలో రణ్‌వీర్ సింగ్‌ను ఎంపిక చేయడంపై సోషల్ మీడియాలో వ్యతిరేకత, చర్చలు ఏ రేంజ్ లో సాగాయో తెలిసిందే.
By: Srikanth Kontham | 30 May 2026 10:00 PM ISTఐకానిక్ పాత్రకు నటీనటులను మార్చడం ఎప్పుడూ పెద్ద చర్చకు దారితీస్తుంది. `డాన్ 3` చిత్రంలో షారుఖ్ ఖాన్ స్థానంలో రణ్‌వీర్ సింగ్‌ను ఎంపిక చేయడంపై సోషల్ మీడియాలో వ్యతిరేకత, చర్చలు ఏ రేంజ్ లో సాగాయో తెలిసిందే. ఒక స్టార్ ఇమేజ్‌ను మరొకరు అందుకోవడం అంత సులువు కాదని అభిమానుల అభిప్రాయం ఒకటైతే? ఈ నిర్ణయం వెనుక దర్శకుడి సృజనాత్మక స్వేచ్ఛ దాగి ఉందనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. అంతిమంగా ప్రస్తుతానికి డాన్ 3 అన్నది వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ నుంచి రణవీర్ సింగ్ తప్పుకోవడం... సినిమా సంఘాలు బ్యాన్ చేయడ విధితమే. తాజాగా ఈ వివాదంపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తనదైన శైలిలో స్పందించారు.
`డాన్ 3` చిత్రానికి సంబంధించి రణ్‌వీర్ సింగ్‌కు ఆయన పూర్తి మద్దతు ప్రకటించారు. ఒక సినిమాకు ఎవరిని ఎంపిక చేసుకోవాలనేది పూర్తిగా దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన నిర్ణయమని ఇందులో మూడో వ్యక్తి జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు. ఇదే క్రమంలో ఆర్జీవీ సినిమా పరిశ్రమలోని కార్మిక సంఘాలపై, ఎఫ్‌డబ్ల్యూఐసీఈ (FWICE) వంటి సంస్థలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కొన్ని సందర్భాల్లో ఇలాంటి సంఘాలు చిత్ర నిర్మాణ స్వేచ్ఛను హరిస్తున్నాయని.. అవసరమైతే వాటిపై నిషేధం విధించాలనే డిమాండ్‌ను కూడా తెరపైకి తెచ్చారు.
కళాకారులు, దర్శకుల హక్కులను అణచివేసేలా యూనియన్ల తీరు ఉండకూడదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో చిత్రనిర్మాతలు ఎదుర్కొంటున్న సవాళ్లు బడ్జెట్ లేదా కథకు మాత్రమే పరిమితం కావడం లేదు. సోషల్ మీడియా ట్రోలింగ్ .. పరిశ్రమలోని అంతర్గత రాజకీయాలు దర్శకుల ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తున్నాయి. ఫర్హాన్ అఖ్తర్ వంటి ప్రతిభావంతుడైన దర్శకుడు కొత్త ప్రయోగానికి పూనుకున్నప్పుడు అతనికి మద్దతు ఇవ్వాల్సింది పోయి అడ్డంకులు సృష్టించడం సరికాదనే చర్చ పరిశ్రమ వర్గాల్లో నడుస్తోంది.
గతంలో అమితాబ్ బచ్చన్ పోషించిన ఐకానిక్ డాన్ పాత్రను షారుఖ్ ఖాన్ విజయవంతంగా రీమేక్ చేసి మె ప్పించారు. అప్పట్లో కూడా ఇలాంటి విమర్శలు వచ్చినా? కాలక్రమేణా షారుఖ్ తన నటనతో సరికొత్త రికార్డులు సృష్టించారు. అలాంటి నమ్మకాన్ని రణవీర్ సింగ్ విషయంలో ఎందుకు ఉంచలేకపోతున్నారు? అన్నది అర్దం కాని ప్రశ్నగా వర్మ సందేహం వ్యక్తం చేసారు. సినిమా విజయం అనేది నటీనటుల స్టార్‌డమ్‌పైనే కాదు. దర్శకుడి విజన్ .కథాబలంపై ఆధారపడి ఉంటుంది. చిత్ర పరిశ్రమ ఎదుగుదలకు బాహ్య శక్తుల ఒత్తిడి కంటే సృజనాత్మక స్వేచ్ఛే అత్యంత కీలకం. రణ్‌వీర్ సింగ్ ఈ సవాలును ఎలా స్వీకరిస్తాడో ? ఆర్జీవీ లేవనెత్తిన యూనియన్ల వివాదం ఎంతవ రకు సర్దుమణుగుతుందో చూడాలి.
