Begin typing your search above and press return to search.

ఓడిపోయినా దిగికపోవడం ప్రజాస్వామ్యంపై దాడే!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో రాజకీయ సంచ‌ల‌నం సృష్టించారు.

By:  Srikanth Kontham   |   6 May 2026 8:30 PM IST
ఓడిపోయినా దిగికపోవడం ప్రజాస్వామ్యంపై దాడే!
X

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో రాజకీయ సంచ‌ల‌నం సృష్టించారు. పశ్చిమ బెంగాల్ ప్రస్తుత రాజకీయ పరిణామాలపై , ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. ఎన్నికల్లో మ‌మ‌త‌ పార్టీ ఓటమి పాలైనా? ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి నిరాకరించడం ప్రజాస్వామ్య విలువలపై దాడి చేయడమేనని వర్మ అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు అత్యున్నతమైనదని దానిని ఎవరైనా గౌరవించాల్సిందేనని ఆర్జీవీ పేర్కొన్నారు.

ఎన్నికల ఫలితాలు స్పష్టంగా వ్యతిరేకంగా వచ్చిన తర్వాత కూడా అధికారంలో కొనసాగాలని చూడటం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. మమతా బెనర్జీ మొండివైఖరి ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదకరమని ఓటమిని అంగీకరించే కనీస సంస్కారం రాజకీయ నాయకుల్లో ఉండాలని హితవు పలికారు. అధికార దాహం ప్రజల ఆకాంక్షల కంటే పెద్దది కాకూడదని వర్మ వ్యాఖ్యానించారు. బెంగాల్ రాజకీయాల్లో హింస - అరాచకం పెరిగిపోవడానికి ఇలాంటి అధికార వ్యామోహమే కారణమని వర్మ విశ్లేషించారు.

ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు గౌరవంగా పక్కకు తప్పుకోవడం నాయకత్వ లక్షణమని కానీ మమతా బెనర్జీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అధికారాన్ని అంటిపెట్టుకుని ఉండటానికి ప్రయత్నించడం వల్ల రాష్ట్రంలో అస్థిరత ఏర్పడుతుందన్నారు. ఇది సామాన్య ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వర్మ తన ట్వీట్లలో మమతా బెనర్జీని నియంతగా అభివర్ణించారు. ప్రజలు తిరస్కరించిన తర్వాత కూడా కుర్చీని వదలకపోవడం ఆమెలోని అహాన్ని సూచిస్తోందని ఎద్దేవా చేశారు.

ఒకప్పుడు ప్రజా పోరాటాల ద్వారా అధికారంలోకి వచ్చిన నాయకురాలు ఇప్పుడు అదే ప్రజల తీర్పును కాలరాయడం విచారకరమన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి పౌర సమాజం గళం ఎత్తాలని, ఇలాంటి ధోరణులను సహించకూడదని వర్మ పిలుపునిచ్చారు. వర్మ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్ల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వర్మ వాదనను సమర్థిస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని గుర్తు చేస్తున్నారు. మరికొందరు బెంగాల్ రాజకీయాల్లోని సంక్లిష్టతలను ప్రస్తావిస్తూ వర్మ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు.

ఏది ఏమైనా రాజకీయాల పై నేరుగా స్పందించే ఆర్జీవీ శైలి మరోసారి పొలిటికల్ సర్కిల్స్‌లో కాక పుట్టిస్తోంది. ఇప్పటికే వివేక్ అగ్నిహోత్రి వంటి వారు బెంగాల్ రాజకీయాలపై స్పందించ‌గా తాజాగా వర్మ కూడా తోడవ్వడం విశేషం. బెంగాల్ బాటలో జరుగుతోన్న రాజకీయ యుద్ధం ఎటు దారితీస్తుందో చూడాలి. ఆర్జీవీ అన్నట్లుగా ప్రజా తీర్పును గౌరవించి మమతా బెనర్జీ దిగిపోతారా లేక పోరాటాన్ని కొనసాగిస్తారా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. రాజకీయాల్లో నైతిక విలువలు కనుమరుగవుతున్నాయని చెప్పడానికి ఇలాంటి సంఘటనలు నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు. బెంగాల్ రాజకీయ యవనికపై తదుపరి అంకం ఏంటో? కాలమే నిర్ణయించాలి.