Begin typing your search above and press return to search.

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

‘రామాయణం పార్ట్ 1’పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశంగా మారింది. తాను నాస్తికుడినని చెప్పిన వర్మ, సినిమాను రెండుసార్లు చూసినట్లు వెల్లడించారు. దర్శకుడు నితీష్ తివారీ, రావణుడిగా నటించిన యష్, రణ్‌బీర్ కపూర్ నటనతో పాటు సంగీతాన్ని కూడా ప్రశంసించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

By:  Priya Chowdhary Nuthalapti   |   11 Nov 2026 1:01 PM IST
సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?
X

సాధారణంగా సినిమాల్లో తప్పులు వెతకడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ముందుంటారు. సినిమా నచ్చకపోతే ఎంత పెద్ద హీరో అయినా.. ఎంతటి దర్శకుడైనా .. రామ్ గోపాల్ వర్మ.. మాత్రం తనదైన శైలిలో విమర్శలు చేస్తుంటారు. అలాంటి వర్మ ఇప్పుడు అందరూ విమర్శలు చేస్తున్న ఒక సినిమాను ఆకాశానికి ఎత్తేయడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.

ముఖ్యంగా బాలీవుడ్ తెరకెక్కించిన రామాయణం పార్ట్ 1పై ఆయన చేసిన ప్రశంసలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు ఈ సినిమాలో వర్మకు అంత గొప్పగా ఏం కనిపించింది.. అని కొంతమంది కామెంట్లు కూడా పెడుతున్నారు.

నవంబర్ 5న విడుదలైన రామాయణం పార్ట్ 1కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమందికి సినిమా చాలా నచ్చితే మరి కొంతమంది మాత్రం.. ఈ సినిమాలో దర్శకుడు చాలా తప్పులు చూపించారు అని అంటున్నారు. అయితే రాంగోపాల్ వర్మ మాత్రం ఈ సినిమాను రెండోసారి కూడా చూసినట్లు తన ట్విట్టర్ ద్వారా చెప్పడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. తాను నాస్తికుడినని, రామభక్తుడిగా కాకుండా ఒక సినిమా ప్రేక్షకుడిగా ఈ విశ్లేషణ చేస్తున్నానని చెబుతూ.. ఈ సినిమా గురించి ఒక పెద్ద సారాంశమే రాశారు.

దర్శకుడు నితీష్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రా చేసిన ప్రయత్నాన్ని వర్మ ప్రత్యేకంగా ప్రశంసించారు. భారతీయ ఇతిహాసంలోని భక్తి భావాన్ని ప్రపంచ స్థాయి తెరపై చూపించారని అభిప్రాయపడ్డారు. సినిమాలోని ప్రారంభ యుద్ధ సన్నివేశాలు, రావణుడి పది తలల సీన్, అడవి నేపథ్యం, జటాయువు ఘట్టం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. ముఖ్యంగా రావణుడి పాత్రలో నటించిన యష్‌పై వర్మ ప్రశంసల వర్షం కురిపించారు.

రావణుడిని కేవలం ప్రతినాయకుడిగా కాకుండా తపస్సు, తెలివితేటలు, పట్టుదలతో తన శక్తిని సంపాదించుకున్న వ్యక్తిగా చూపించారని అన్నారు. "రాముడు లేకుండా రావణుడు లేడు" అనే అర్థం వచ్చేలా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతు.. కొంతమంది దగ్గర ప్రశంసలు మరి కొంతమంది దగ్గర విమర్శలు తెచ్చుకుంటున్నాయి.

ఇక రణ్‌బీర్ కపూర్ పోషించిన రాముడి పాత్రపైనా కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. రాముడి పాత్రలో ఎక్కువ భావోద్వేగాలు చూపించలేదని కొందరు విమర్శిస్తున్నారని, కానీ ఆ పాత్రలోని నిశ్శబ్దం, సంయమనం కూడా ముఖ్యమైన అంశాలని వర్మ సమర్థించారు. హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం కూడా కథకు తగినట్లుగా ఉందని ప్రశంసించారు.

సినిమా నిడివి ఎక్కువగా ఉందనే విమర్శలను కూడా వర్మ అంగీకరించడం లేదు. కథలోని పాత్రల గొప్పతనాన్ని చూపించడానికి ఆ సమయం అవసరమని తెలిపారు. మొత్తానికి నాస్తికుడైన రామ్ గోపాల్ వర్మ.. రాముడి సినిమా గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలామందిని ప్రశ్నలు అడిగేలా చేస్తుంది. ఈ సినిమా పైన ఎందుకు ఇంత ప్రేమ నందు ఆయన ట్వీట్ కింద కామెంట్లు పెడుతున్నారు.