ధురంధర్ అవన్నింటినీ బ్రేక్ చేసింది:ఆర్జీవి
`ధురంధర్`..ఇప్పుడు ఏ సెలబ్రిటీని, ఏ సగటు ప్రేక్షకుడిని కదిలించినా వినిపిస్తున్న ఒకే ఒక్క మాట `ధురంధర్`.
By: Ravindar Gorantla | 21 March 2026 2:15 PM IST`ధురంధర్`..ఇప్పుడు ఏ సెలబ్రిటీని, ఏ సగటు ప్రేక్షకుడిని కదిలించినా వినిపిస్తున్న ఒకే ఒక్క మాట `ధురంధర్`. ఆదిత్యధర్ అత్యంత సాహసోపేతంగా రూపొందించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తూ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. సైలెంట్‌గా విడుదలై ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద ర్యాపేజ్ చేసింది. రూ.1300 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి ట్రేడ్ వర్గాలతో పాటు ఫిల్మ్ మేకర్స్‌ని విస్మయానికి గురి చేసింది. ఇంతటి సంచలన మూవీ తరువాత దీనికి సీక్వెల్‌గా విడుదలైన మూవీ `ధురంధర్ ది రివేంజ్`.
మార్చి 19న అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్‌ల సునామీని సృష్టిస్తోంది. రూ.240 కోట్లు రాబట్టి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాపై సినీ లవర్స్, సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దక్షిణాదికి చెందిన ప్రముఖ స్టార్లు `ధురంధర్ 2`పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసిస్తున్నారు. సినిమా రిలీజ్‌కు ముందు నుంచి దర్శకుడు ఆదిత్యధర్‌కు హార్డ్ కోర్ ఫ్యాన్ గా మారిపోయిన రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
`ధురంధర్`పై సోషల్ మీడియా వేదికగా ఓ పుస్తకం సైజు ట్వీట్‌తో స్పందించిన వర్మ ..ఆదిత్యధర్‌ని ఆకాశానికి ఎత్తేస్తూ పొగడ్తల వర్షం కురిపించారు. తాజాగా `ధురంధర్ ది రివేంజ్` రిలీజ్ అయిన నేపథ్యంలో దర్శకుడు ఆదిత్యధర్‌తో పాటు సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఓ జాతీయ మీడియాలో మాట్లాడుతూ `నేటి తరం దర్శకుల్లో ఆదిత్యధర్ ది ప్రత్యేక శైలి. `ధురంధర్` చూసిన తరువాత నాకు ఇదే అనిపించింది. ఆ తరువాత మోహిత్ సూరి `సయారా` కూడా చాలా కొత్తగా ఉంది. నేను చాలా ఎంజాయ్ చేశాను`అన్నారు.
ధురంధర్ గురించి మాట్లాడుతూ `ఇది కేవలం సినిమా మాత్రమే కాదు. ఇది సినిమా గ్రామర్‌ని, ప్రేక్షకుల ఆలోచనా విధానాన్ని మార్చేసింది. దీనిని ఓ ప్రమాణికంగా, బెంచ్ మార్క్‌గా తీసుకుని కొత్త తరం దర్శకులు సినిమాలు చేస్తారు. మీరు చేసినట్టుగా శివ, సత్యలని చూసి మేకర్స్‌గా మారతారంటారా? అని అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం చెబుతూ `సత్యని గాడ్ ఫాదర్, గుడ్ ఫెల్లస్‌ల నుంచి స్ఫూర్తి పొంది రూపొందించాను. ఈ విషయాన్ని నేను ఎప్పుడో చెప్పాను. అలాగే ప్రతీ ఒక్కరూ ఎక్కడో అక్కడ ఇన్స్పైర్ అయి చేస్తుంటారు.
అది ఫిల్మ్ మేకింగ్‌లో ఓ భాగం. సత్య చేసే టైమ్‌లో దీన్ని ఎంత కమర్షియల్‌గా తీయాలి..ఎంత వరకు పుష్ చేయాలనే దాన్ని ఆలోచించి తీశాను. క్యారెక్టర్ డైనిమిజమ్, ఆర్టిస్ట్‌ల నటన, మిగతా వాటికి పదిరెట్లు ఉండేలా చూసుకున్నాను. ఆ ఫార్ములా స్క్రిన్‌పై వర్కవుట్ అయ్యింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంటూ `సత్య` నాటి పరిస్థితుల గురించి చెప్పుకుంటూ వచ్చారు.
