Begin typing your search above and press return to search.

తొమ్మిదేళ్ల‌ క్రితం నాటి పాత బకాయిలు చెల్లించిన వర్మ!

సినిమా నిర్మాణ రంగంలో కార్మికులకు, సాంకేతిక నిపుణులకు పారితోషికాలు సకాలంలో అందడం చాలా ముఖ్యమని లేదంటే ఇలాంటి ఇబ్బందులు తప్పవని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.

By:  Srikanth Kontham   |   19 Aug 2026 10:41 PM IST
తొమ్మిదేళ్ల‌ క్రితం నాటి పాత బకాయిలు చెల్లించిన  వర్మ!
X

సంచ‌ల‌న దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి సినిమా షూటింగ్ కోసం కాకుండా పాత బకాయిల విషయంలో వివాదంలో చిక్కుకుని చివరకు ఆ సమస్యను పరిష్కరించుకున్నారు. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం నాటి బకాయిలను చెల్లించకపోవడంతో వర్మ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న `పోలీస్ కంపెనీ` సినిమా షూటింగ్‌ను ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) నిలిపివేసింది. ఈ ఘటన సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసింది.

విషయంలోకి వెళితే దాదాపు తొమ్మిదేళ్ల క్రితం వర్మ తీసిన చిత్రాలకు సంబంధించి సాంకేతిక నిపుణులకు అందాల్సిన పారితోషికాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని ఎఫ్ డ‌బ్ల్యూ ఐసీఈ ఆరోపించింది. దీనిపై స్పందించిన ఫెడరేషన్ ప్రతినిధులు, బకాయిలు చెల్లించే వరకు వర్మ షూటింగ్ జరగనివ్వమని స్పష్టం చేశారు. దీంతో సెట్స్‌పై ఉన్న షూటింగ్ ప్రక్రియ గంటల తరబడి నిలిచిపోయింది. సినిమా పరిశ్రమలో ఇలాంటి వివాదాలు అరుదుగా జరిగినప్పటికీ రామ్‌గోపాల్ వర్మ వంటి స్టార్ డైరెక్టర్ విషయంలో జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

పరిస్థితి ని గమనించిన వర్మ వెంటనే రంగంలోకి దిగారు. బాధితులకు చెల్లించాల్సిన 1.11 కోట్ల రూపాయల బకాయిలను క్లియర్ చేసేందుకు అంగీకరించారు. దీంతో ఫెడరేషన్ -వర్మ మధ్య నెలకొన్న ఆర్థిక వివాదం సుహృద్భావ వాతావరణంలో ముగిసింది. పాత బకాయిల వల్ల జరుగుతున్న జాప్యం వల్ల షూటింగ్‌కు అడ్డంకులు కలగడంతో ఆర్థిక అంశాలన్నీ పరిష్కారమయ్యాయని ఎఫ్ డ‌బ్ల్యూ ఐసీఈ ప్రతినిధులు ధృవీకరించారు.

సినిమా నిర్మాణ రంగంలో కార్మికులకు, సాంకేతిక నిపుణులకు పారితోషికాలు సకాలంలో అందడం చాలా ముఖ్యమని లేదంటే ఇలాంటి ఇబ్బందులు తప్పవని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. ఇండస్ట్రీలో నిబంధనలను పాటించడం ఏ నిర్మాతకైనా? దర్శకునికైనా? కనీస బాధ్యత అని ఫెడరేషన్ వర్గాలు పేర్కొన్నాయి. రామ్‌గోపాల్ వర్మ సకాలంలో స్పందించి బకాయిలు చెల్లించడం వల్ల మళ్లీ షూటింగ్ పునప్రారంభమైంది.

రామ్‌గోపాల్ వర్మ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటారనే పేరున్నా? పని విషయంలో మాత్రం ఆయన ఎప్పుడూ వెనక్కి తగ్గరు. ప్ర‌స్తుతం `పోలీస్ కంపెనీ` ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేసేందుకు సిద్ద‌మైంది.

ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్ తిరిగి ప్రారంభం కావడంతో, అనుకున్న సమయానికే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చే పనిలో వర్మ నిమగ్నమయ్యారు.