Begin typing your search above and press return to search.

‘పెద్ద సినిమాలు కాదు.. మంచి సినిమాలు తీయాలి’.. అబ్సెషన్‌పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు!

హాలీవుడ్ హారర్ చిత్రం అబ్సెషన్ గురించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

By:  Priya Chowdhary Nuthalapti   |   12 Jun 2026 2:58 PM IST
‘పెద్ద సినిమాలు కాదు.. మంచి సినిమాలు తీయాలి’.. అబ్సెషన్‌పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు!
X

హాలీవుడ్ హారర్ చిత్రం అబ్సెషన్ గురించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ సినిమా తనకు ఎంతో ప్రభావం చూపిందని, ముఖ్యంగా దర్శకులు, నిర్మాతలు నేర్చుకోవాల్సిన ఎన్నో పాఠాలు ఇందులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

“అబ్సెషన్ మనకు ఏం చిత్రీకరించామన్నది కాదు.. ఎలా చిత్రీకరించామన్నదే ముఖ్యమని చూపించింది” అని వర్మ అన్నారు. స్టార్ హీరోల పరివారం ఖర్చుకంటే తక్కువ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందిందని ఆయన వ్యాఖ్యానించారు.

వర్మ తన ట్విట్టర్లో,” ఈ చిత్రం ప్రధానంగా రెండు గదులు, ఒక కారు ఇంటీరియర్, ఒక చిన్న స్టోర్‌లో మాత్రమే చిత్రీకరించబడింది. ఇందులో ఐదుగురు కొత్త నటులు నటించారు. సినిమా ఖర్చు సుమారు 70 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉండకపోవచ్చు. కానీ అదే సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.2,279 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం నిజంగా ఆశ్చర్యకరం,” అని రాసుకొచ్చారు.

దర్శకుడు కర్రీ బార్కర్ పనితీరును వర్మ ప్రత్యేకంగా ప్రశంసించారు. చిన్న ప్రదేశాలను ఉపయోగించడం ద్వారా ప్రేక్షకులను పాత్రల ప్రపంచంలో బంధించాడని అన్నారు. ఎడిటింగ్ కేవలం సన్నివేశాలను కలపడం కాదని, ప్రేక్షకుల మనసుపై మానసిక ప్రభావం చూపే ఆయుధంలా ఉపయోగించారని చెప్పారు.

వేగవంతమైన కట్స్, తలుపులు మూసుకునే శబ్దాలు, నవ్వులు, గుండె చప్పుడు, వాయిస్ మార్పులు, అలాగే కొన్ని సన్నివేశాల్లో ఎక్కువసేపు కెమెరాను ఒకే షాట్‌పై ఉంచడం ద్వారా భయాన్ని పెంచారని వివరించారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సమయంలో నిక్కీ ముఖంపై నిలిచిపోయే షాట్ తనకు అత్యంత ఇష్టమైనదని అన్నారు.

సీజీఐ ఆర్మీలు, భారీ సెట్లు, విదేశీ లొకేషన్లు, 500 కోట్ల బడ్జెట్‌ల కంటే.. బలమైన దర్శకత్వం, వినూత్న ఎడిటింగ్, అద్భుతమైన సౌండ్ డిజైన్, నటీనటుల భావోద్వేగ ప్రదర్శన ఎక్కువ ప్రభావం చూపుతాయని వర్మ అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం స్టార్ హీరోలు, రీమేక్‌లు, భారీ విజువల్ స్పెక్టకిల్స్ వెంబడిస్తున్న ఇండస్ట్రీకి అబ్సెషన్ ఒక చెంప దెబ్బ లాంటిదని అన్నారు. తక్కువ బడ్జెట్‌ను పరిమితిగా కాకుండా స్వేచ్ఛగా భావించాలని నిర్మాతలకు సూచించారు. చివరగా..“కర్రీ బార్కర్ బ్లాక్‌బస్టర్ మాత్రమే తీయలేదు. పెద్ద సినిమాలు కాదు, మంచి సినిమాలు తీయడంపైనే మన అబ్సెషన్ ఉండాలని నేర్పించాడు” అంటూ వర్మ తన వ్యాఖ్యలను ముగించారు.