దేవుడా! RGV చేతికి చిక్కిన YRF
అయితే వరుసగా ఫ్లాపులు చవిచూస్తున్న ఆర్జీవీ తన స్థాయికి తగ్గట్టుగా ఒక గొప్ప కమర్షియల్ కంబ్యాక్ ఇవ్వడానికే బాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ వైఆర్ఎఫ్‌తో ఈ పరోక్ష సంబంధాన్ని ఏర్పరుచుకుంటున్నాడా?
By: Sivaji Kontham | 14 Sept 2026 12:51 PM ISTబాలీవుడ్ లో ఎప్పుడూ ఊహించని కలయికలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా అగ్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ (YRF) బ్యానర్‌లో రామ్‌గోపాల్ వర్మ, మోహిత్ సూరి కలిసి పనిచేయబోతున్నారనే వార్త సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆషికి, ఆషికి 2, సైయ్యారా వంటి ప్రేమకథా చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన దర్శకుడు మోహిత్ సూరితో .. క్రైమ్, గ్యాంగ్‌స్టర్ జానర్లలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న ఆర్జీవీ చేతులు కలపడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
`సైయ్యారా` చిత్రంతో మరోసారి తన డైరెక్టర్‌గా ప్రతిభను చాటుకున్న మోహిత్ సూరి ఈసారి పూర్తిగా భిన్నమైన మార్గాన్ని ఎంచుకోవడానికి ఆర్జీవీ ఒక కారణం. వరుసగా పరాజయాలతో సతమతమవుతున్న రామ్‌గోపాల్ వర్మ ఈసారి తనదైన శైలిలో ఒక పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ కథను రాసి మోహిత్ కి ఇచ్చారట. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో సాగే ఈ కథను మోహిత్ సూరికి అందించగా.., ఆయన వెంటనే ఈ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఆర్జీవీ ఆలోచనలు, కథా బలంతో మోహిత్ సూరి ప్రయత్నం ఎలా ఉండబోతోంది? అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
అయితే వరుసగా ఫ్లాపులు చవిచూస్తున్న ఆర్జీవీ తన స్థాయికి తగ్గట్టుగా ఒక గొప్ప కమర్షియల్ కంబ్యాక్ ఇవ్వడానికే బాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ వైఆర్ఎఫ్‌తో ఈ పరోక్ష సంబంధాన్ని ఏర్పరుచుకుంటున్నాడా? అనే కోణంలో విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఆర్జీవీ గత వైభవాన్ని గుర్తు చేసేలా ఈ స్క్రిప్ట్ ఉండటం.. దానికి మోహిత్ సూరి లాంటి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ యాడవ్వడంతోనే వైఆర్ఎఫ్ లాంటి పెద్ద ప్రొడక్షన్ హౌస్ భారీ బడ్జెట్‌తో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిందని తెలిసింది.
ఈ చిత్రంలో ఇద్దరు ప్రముఖ హీరోలకు సమాన ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఉండటం మరో ప్రత్యేకత. ఇద్దరు టాప్ స్టార్లను ఈ ప్రాజెక్ట్ కోసం రంగంలోకి దించాలని మోహిత్ సూరి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ ప్రపంచం, ఇద్దరు హీరోల మధ్య నడిచే ఇంటెన్స్ డ్రామా ప్రేక్షకులను కట్టిపడేసేలా స్క్రిప్ట్‌ను తీర్చిదిద్దారని తెలుస్తోంది. త్వరలోనే నటీనటుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుండగా ఈ ప్రాజెక్ట్‌పై బాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ భారీ గ్యాంగ్‌స్టర్ డ్రామా 2027 చివరి నాటికి సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. రొమాంటిక్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మోహిత్ సూరి.. ఆర్జీవీ రాసిన క్రైమ్ స్క్రిప్ట్‌తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. ఏదేమైనా ఆర్జీవీ ఆలోచనలు వైఆర్ఎఫ్ బ్యానర్ చేతికి చిక్కడం బాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
