Begin typing your search above and press return to search.

గ్యాంగ్‌స్టర్‌ దెయ్యం అయితే... వర్మ సీరియస్‌ ప్రయత్నం

శివ వంటి చరిత్రలో నిలిచి పోయే సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించిన ఘనత రామ్‌ గోపాల్‌ వర్మకు దక్కుతుంది.

By:  Ramesh Palla   |   1 Sept 2025 1:00 PM IST
గ్యాంగ్‌స్టర్‌ దెయ్యం అయితే... వర్మ సీరియస్‌ ప్రయత్నం
X

శివ వంటి చరిత్రలో నిలిచి పోయే సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించిన ఘనత రామ్‌ గోపాల్‌ వర్మకు దక్కుతుంది. తెలుగు సినిమా చరిత్రను రెండు భాగాలుగా చేసిన శివ సినిమాను రూపొందించిన రామ్‌ గోపాల్ వర్మ గత పదేళ్ల కాలంలో శ్రద్ధ పెట్టకుండా సినిమాలను తీస్తున్నాడు. క్రియేటివ్‌ జీనియస్‌ అనిపించుకున్న వర్మ తన క్రియేటివిటీని పక్కన పెట్టి సినిమాలు తీస్తున్నాడు అంటూ చాలా రోజులుగా వర్మ ఫ్యాన్స్ స్వయంగా అంటున్నారు. ఏదో పబ్లిసిటీ కోసం లేదంటే ఎవరిని అయినా తిట్టడానికి లేదంటే ఎవరిని అయినా పొగడడం కోసం మాత్రమే వర్మ సినిమాలు తీస్తున్నాడు అంటూ ఒక అభిప్రాయం జనాల్లో ఏర్పడింది. ఆ అభిప్రాయంను ఆయన తొలగించుకునేందుకు ఇన్నాళ్లు ప్రయత్నం చేయలేదు. వారు అనుకున్నది నిజమే అన్నట్లుగానే వర్మ సినిమాలు వస్తూ వచ్చాయి.

పోలీస్‌ స్టేషన్ మే భూత్‌ సినిమాతో వర్మ..

ఎట్టకేలకు వర్మ ఒక సీరియస్‌ ప్రయత్నం చేస్తున్నాడని ఆయన సన్నిహితులు అంటున్నారు. రామ్‌ గోపాల్‌ వర్మ ప్రస్తుతం 'పోలీస్ స్టేషన్‌ మే భూత్‌' సినిమాను రూపొందిస్తున్నాడు. మనోజ్ బాజ్‌పేయీ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయన ఒక పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. పెద్ద మాఫియా డాన్‌, గ్యాంగ్‌స్టర్‌ ను పోలీసులు హత్య చేస్తారు, ఆ మాఫియా డాన్‌ దెయ్యంగా మారి, పోలీస్‌ స్టేషన్‌లో సెటిల్‌ అయితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్‌తో నవ్వులు పూయిస్తూ, భయపెట్టే విధంగా ఈ సినిమాను రామ్‌ గోపాల్‌ వర్మ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. వర్మ మార్క్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయని అంటున్నారు. అంతే కాకుండా వర్మ ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటుతాడని కూడా ఆయన అభిమానులు నమ్ముతున్నారు.

చాలా కాలం తర్వాత రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో..

రామ్‌ గోపాల్‌ వర్మ సినిమా వచ్చి చాలా కాలం అయింది. గత ఏడాదిలో ఆయన దర్శకత్వంలో రూపొందిన ఒక్క సినిమా కూడా రాలేదు. బి గ్రేడ్‌ సినిమాలు తీస్తూ విమర్శలు ఎదుర్కొన్న రామ్‌ గోపాల్‌ వర్మ, ఒకానొక సమయంలో విభిన్నమైన సినిమా అంటూ పొలిటికల్‌ మూవీని తీసి మరింతగా ప్రేక్షకులకు దూరం అయ్యాడు. కొందరిని సంతృప్తి పర్చడం కోసం వర్మ తీసిన సినిమాల వల్ల ఆయన్ను చాలా మంది ద్వేషిస్తున్నారు. ఇండస్ట్రీలో కొందరు ఆయన్ను ఎంతో అభిమానించే వారు, వారు కూడా ఆయన పట్ల ఆగ్రహంతో ఉన్నారు. అలాంటి వారు అంతా తిరిగి వర్మను అభిమానించే విధంగా ఈ దెయ్యం సినిమా ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. షూటింగ్‌ సైలెంట్‌గా పూర్తి చేసిన వర్మ విడుదలకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు.

సర్కార్‌ 3 తర్వాత మనోజ్‌ బాజ్‌పేయీ...

వర్మ దర్శకత్వంలో వచ్చిన సర్కార్‌ 3 తో పాటు పలు సినిమాల్లో మనోజ్ బాజ్‌పేయీ నటించాడు. బాలీవుడ్‌లో మనోజ్‌ కు మంచి క్రేజ్ దక్కడానికి, ఆయన కెరీర్‌ యూటర్న్‌ తీసుకోవడానికి ఖచ్చితంగా వర్మ సినిమాలు కారణం అనడంలో సందేహం లేదు. అందుకే వర్మ దర్శకత్వంలో ఇప్పుడే కాదు ఎప్పుడైనా మనోజ్ బాజ్‌పేయీ నటించేందుకు రెడీగా ఉంటాడు. వెబ్‌ సిరీస్‌ల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్న మనోజ్ బాజ్‌పేయీ ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకోవడంకు ప్రధాన కారణం వర్మ అని చెప్పాల్సిందే. ఎందుకంటే మనోజ్‌ బాజ్‌పేయీ నటుడిగా వెబ్‌ సిరీస్‌లతో మంచి పేరు సొంతం చేసుకున్నాడు. కనుక ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటుతాడా అనేది చూడాలి. వర్మ చేస్తున్న ఈ సీరియస్‌ ప్రయత్నం ఏ మేరకు ఫలితాన్ని ఇస్తుంది అనేది చూడాలి.