Begin typing your search above and press return to search.

ట్రైల‌ర్‌ని పొగిడేసి సినిమాని తిట్టేస్తే ఎలా ఆర్జీవీ?

ఆదిత్య ధర్ తెరకెక్కించిన `ధురంధర్` చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేసిన వర్మ.. పేరు ప్రస్తావించకుండానే `టాక్సిక్` చిత్రంలోని మేకింగ్ శైలిని తీవ్రంగా తప్పుబట్టారు.

By:  Sivaji Kontham   |   1 Sept 2026 12:00 AM IST
ట్రైల‌ర్‌ని పొగిడేసి సినిమాని తిట్టేస్తే ఎలా ఆర్జీవీ?
X

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలి విమర్శలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తార‌నే సంగతి తెలిసిందే. అత‌డికి ఆనందం క‌లిగినా చికాకు పుట్టినా ఆప‌లేము. తాజాగా అత‌డు యష్ నటించిన `టాక్సిక్` సినిమాను - దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ పనితీరును పరోక్షంగా టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆదిత్య ధర్ తెరకెక్కించిన `ధురంధర్` చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేసిన వర్మ.. పేరు ప్రస్తావించకుండానే `టాక్సిక్` చిత్రంలోని మేకింగ్ శైలిని తీవ్రంగా తప్పుబట్టారు.

`ధురంధర్` చిత్రంలో హీరో ఆరాధన కంటే పాత్రల సహజత్వానికి, కథా బలానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారని వర్మ కొనియాడారు. అయితే దీనికి విరుద్ధంగా కొన్ని చిత్రాల్లో (టాక్సిక్ ఉద్దేశించి) కథ కంటే స్టైల్, యాటిట్యూడ్‌కే ఎక్కువ పీపీ ఇస్తున్నారని విమర్శించారు. ఆ సినిమాల్లో పాత్రల అంతరంగం కంటే స్లో-మోషన్ షాట్లే ఎక్కువసేపు ఉంటాయని.. హింస అనేది కేవలం సందర్భం - భావోద్వేగం లేని దృశ్యంగా మాత్రమే మిగిలిపోతోందని వర్మ పెదవి విరిచారు.

తన ఐకానిక్ చిత్రం సత్యను ఉదాహరణగా చూపిస్తూ.. ధురంధర్ సినిమాలో సహాయ నటుల పాత్రలను ఎంతో సహజంగా తీర్చిదిద్దారని కొనియాడారు. హీరో పాత్రను దేవుడిలా చూపెట్టకుండా.. సాధారణ వ్యక్తిలా నడవడికను వర్ణించడం కథకు బలాన్ని ఇచ్చిందన్నారు.

కథ లేకుండా కేవలం హీరోయిజం, స్లో-మోషన్ షాట్లు, హంగులతో తీసే సినిమాలపై ఆర్జీవీ పరోక్ష విమర్శలు గుప్పించారు. ``కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ల అంతరంగం కంటే స్లో-మోషన్ షాట్లే ఎక్కువసేపు ఉంటాయి. అక్కడ హింస అనేది ఎటువంటి సందర్భం లేని ఒక దృశ్య వినోదం మాత్రమే. ఎడిటింగ్ కూడా కథలో లేని కృత్రిమ తీవ్రతను తెచ్చేలా ఉంది`` అని వ్యాఖ్యానించారు.

మొదట మార్చి నెలలో ధురంధర్ 2, టాక్సిక్ సినిమాలు ఒకేసారి విడుదల కావాల్సి ఉండగా.. టాక్సిక్ విడుదల వాయిదా పడి ఇటీవలే థియేటర్లలోకి వచ్చింది. విడుదలైన మొదటి 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 285 కోట్ల వసూళ్లు సాధించినా.. ఈ రెండు చిత్రాల మేకింగ్ శైలిపై పోలికలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆర్జీవీ లాంటి సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు గీతూ మోహ‌న్ సినిమాని విమ‌ర్శించ‌డం చ‌ర్చ‌గా మారింది. నిజానికి టాక్సిక్ టీజ‌ర్ ట్రైల‌ర్ విడుద‌లైన‌ప్పుడు గీతూ మోహ‌న్ ప‌నిత‌నాన్ని ఆర్జీవీ పొగిడేసారు. కానీ ఇప్పుడు పూర్తి సినిమా విడుద‌ల‌య్యాక త‌న వెర్ష‌న్ కూడా పూర్తిగా మారిపోవ‌డం విశేషం.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. రామ్ గోపాల్ వర్మ 2026లో తనదైన‌ మార్క్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లోనే `పోలీస్ కంపెనీ` అనే ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. టి-సిరీస్ నిర్మాణంలో రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటున్న ఈ పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్, 1990ల ముగింపు - 2000ల ప్రారంభంలో ముంబైలో జరిగిన యథార్థ సంఘటనలు, ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుల జీవితాల ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో ముంబై ప్రముఖ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ పాత్రలో నటుడు హర్షవర్ధన్ రాణే నటిస్తున్నారు. సత్య, కంపెనీ చిత్రాల శైలిలో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాపై టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ అంచనాలు నెలకొన్నాయి.