Begin typing your search above and press return to search.

ముంబై మాఫియా ఆర్జీవీని బెదిరించ‌క‌పోవ‌డానికి కార‌ణం?

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆర్జీవీ తన ఆత్మకథ `గన్స్ అండ్ థైస్`ను దావూద్ ఇబ్రహీంకే అంకితం ఇవ్వాలని భావించారట.

By:  Sivaji Kontham   |   12 April 2026 3:00 PM IST
ముంబై మాఫియా ఆర్జీవీని బెదిరించ‌క‌పోవ‌డానికి కార‌ణం?
X

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన ఏకంగా భారత దేశ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్ట‌ర్ దావూద్ ఇబ్రహీంను తన కెరీర్ విజయానికి మూలకారకుడిగా అభివర్ణించారు. దావూద్ ఇబ్రహీం అనే వ్యక్తి అండర్ వరల్డ్ లో లేకపోయి ఉంటే.. తన సినిమా కెరీర్ లో అత్యంత కీలకమైన మలుపులు ఉండేవి కావని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నాయి.

ఆర్జీవీ కెరీర్ లో సత్య, కంపెనీ వంటి చిత్రాలు మైలురాళ్ళుగా నిలిచాయి. ఈ క్రైమ్ డ్రామాలు అన్నీ నిజ జీవిత అండర్ వరల్డ్ సంఘటనల ఆధారంగా తీసినవేనని ఆయన బాహాటంగానే అంగీకరించారు. ``నా జీవనోపాధి దావూద్ వల్లే సాగుతోంది`` అని ఫిలింఫేర్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆ గ్యాంగ్‌స్టర్ లేకపోతే తాను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదని ఘాటుగా వ్యాఖ్యానించారు. ముంబై మాఫియా ప్రపంచాన్ని తన సినిమాల ద్వారా కళ్ళకు కట్టినట్లు చూపించడంలో దావూద్ పాత్ర ఉందన్నది వర్మ వాదన.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆర్జీవీ తన ఆత్మకథ `గన్స్ అండ్ థైస్`ను దావూద్ ఇబ్రహీంకే అంకితం ఇవ్వాలని భావించారట. అయితే అందుకు పబ్లిషర్స్ అంగీకరించక పోవడంతో ఆ పేరును తొలగించాల్సి వచ్చిందని వెల్లడించారు. తాను తీసిన అండర్ వరల్డ్ సినిమాలను దావూద్ స్వయంగా చూశారని.. అవి ఆయనకు ఎంతగానో నచ్చాయని వర్మ పేర్కొనడం విశేషం. ఈ చిత్రాల కారణంగానే అండర్ వరల్డ్ ముఠాల నుండి తనకు ఎప్పుడూ బెదిరింపు కాల్స్ రాలేదని.. బదులుగా తాను వారికి ఒక `సోల్ మేట్` లా మారిపోయానని ఆయన చెప్పుకొచ్చారు.

గతంలో కూడా ఆర్జీవీ ఇలాంటి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో చ‌ర్చ‌ల్లోకొచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అమితాబ్ బచ్చన్, స్టీవెన్ స్పీల్‌బర్గ్ వంటి హేమాహేమీలతో పాటు దావూద్ ఇబ్రహీంను కూడా ఒక `ఇన్స్పిరేషన్` (స్ఫూర్తి)గా పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అప్పట్లో ఈ విషయంపై భారీ ఎత్తున నిరసనలు, ఆగ్రహావేశాలు వ్యక్తమైనా వర్మ మాత్రం తన పంథాను మార్చుకోలేదు. సృజనాత్మకతకు స్ఫూర్తి ఎక్కడి నుండైనా రావచ్చనేది ఆయన సిద్ధాంతమ‌ని మ‌రోసారి ప్రూవ్ అయింది.

ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ `సర్కార్ 4`, `సిండికేట్` వంటి వరుస క్రైమ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అండర్ వరల్డ్ నేపథ్యాన్ని వదలని వర్మ తన తాజా చిత్రాల్లో కూడా మాఫియా అంతరాలను ఏ విధంగా చూపించబోతున్నారో అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఏది ఏమైనా ఒక గ్యాంగ్‌స్టర్ వల్ల తన బతుకు దెరువు సాగుతోందని ప్రకటించి ఆర్జీవీ మరోసారి టాలీవుడ్- బాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చకే తెర లేపారు.