టాలీవుడ్ ఆర్థిక సంక్షోభంపై వర్మ సంచలన వ్యాఖ్యలు!
తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, బడ్జెట్ నిర్వహణపై దర్శకుడు రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Srikanth Kontham | 3 Aug 2026 6:14 PM ISTతెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, బడ్జెట్ నిర్వహణపై దర్శకుడు రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలకు నిర్మాతలను తప్పుపట్టలేమని.. అసలు బాధ్యత దర్శకులదేనని అభిప్రాయప్పడారు. సినిమాల నిర్మాణం, బడ్జెట్ నియంత్రణ , ఇండస్ట్రీ తీరుతెన్నులపై వర్మ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సినిమా బడ్జెట్లు అడ్డగోలుగా పెరిగిపోవడానికి ప్రధాన కారణం దర్శకులేనని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు. సినిమా తీసేటప్పుడు ఎన్ని షాట్లు ప్లాన్ చేస్తున్నారు? ఎంత ప్రిపరేషన్ అవసరమనే? కనీస అవగాహన చాలా మంది పెట్టుబడిదారులకు ఉండదన్నారు.
ప్లాన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఖర్చులు అంచనాలను మించిపోతాయన్నారు. అయితే దానికి ఎవరిని బాధ్యులను చేయాలో ? తెలియక నిర్మాతలు సతమతమవుతుంటారని పేర్కొన్నారు. ఇండస్ట్రీలో డబ్బు వృథా అవుతుంద నేదానికి ఓ ఉదాహరణగా ఒక సీనియర్ నటి ఉదంతాన్ని ఆర్జీవీ గుర్తు చేశారు. పది రోజుల కాల్ షీట్లు ఇచ్చి రోజూ మేకప్ వేయించుకున్నా? ఐదారు రోజులు అసలు షూటింగ్‌కే పిలవని సందర్భాలు ఉంటాయని చెప్పారు. అయినప్పటికీ ఆ నటికి కోటి రూపాయల రెమ్యునరేషన్ పూర్తిగా చెల్లించారని, బడ్జెట్లు కోట్లలో మారుతున్నప్పుడు ఇలాంటి వాటిని ఎవరూ పట్టించుకోరని విమర్శించారు.
అలాగే టాలీవుడ్‌లో ఉన్నవారిని నిర్మాతలుగా పిలవడం కంటే కేవలం పెట్టుబడిదారులు అనడం సమంజసమని వర్మ వ్యాఖ్యానించారు. సరైన అవగాహన లేకుండా సినిమాల్లోకి డబ్బులు పెట్టడం వల్లే ఇబ్బందులు వస్తాయని, హిట్టయిన సినిమాలొచ్చిన లాభాలన్నీ బడ్జెట్ భవనాలే తినేస్తాయన్నారు. దీనివల్ల సినిమా విజయవంతమైనా నిర్మాతకు పెద్దగా మిగిలేదేమీ ఉండదని అభిప్రాయపడ్డారు. అయితే ఫ్లాప్ సినిమాల వల్ల ఇండస్ట్రీకి తీవ్ర నష్టం జరుగుతుందనే అపవాదును ఆర్జీవీ కొట్టిపారేశారు. ఇండస్ట్రీని వాస్తవానికి ఫ్లాప్ సినిమాలే నడిపిస్తాయని ఆసక్తికర వాదన తెరపైకి తెచ్చారు.
హిట్ సినిమాల డబ్బు అంతా కొద్దిమంది ప్రధాన వ్యక్తుల దగ్గరికి వెళ్తే ఫ్లాప్ అయిన సినిమాల ద్వారా వచ్చే బడ్జెట్ మాత్రం కార్మికులు, టెక్నీషియన్ల మధ్య పంపిణీ అవుతుందన్నారు. డబ్బు ఎక్కడికీపోదని, కేవలం ఒకరి జేబు నుంచి మరొకరి జేబులోకి మారుతుందని పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమ గాడిన పడాలంటే దర్శకులకు జవాబు దారీతనం ముఖ్యమని వర్మ తేల్చిచెప్పారు. ఐడియాలు ఇచ్చి, డబ్బు ఎలా ఖర్చు చేయాలో నిర్ణయించేది దర్శకులే కాబట్టి వారిని నిలదీయకపోతే సరైన బిజినెస్ మోడల్ సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. ఈ లోపాలను సరి దిద్దుకుంటేనే తెలుగు సినిమా రంగం ఆర్థికంగా మరింత పటిష్టంగా మారుతుందని వర్మ సూచించారు.
