ఆర్జీవీని ఎవరైనా పట్టించుకుంటారా? 'సర్కార్ 4' తీస్తారట!
ఆర్జీవీ తన స్వయంకృతాపరాధాల వల్లే ఈ స్థాయికి దిగజారిపోయారనే విశ్లేషణలు పెరిగాయి.
By: Sivaji Kontham | 14 March 2026 11:40 AM ISTఒకప్పుడు భారతీయ సినిమా గమనాన్ని మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు తన ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారనే విశ్లేషణలు బలంగా ఉన్నాయి. శివ, సత్య, క్షణక్షణం, సర్కార్ వంటి క్లాసిక్స్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్జీవీ గత కొంతకాలంగా నాణ్యత లేని కంటెంట్‌తో.. వివాదాస్పద చిత్రాలతో తన స్థాయిని తానే తగ్గించుకున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఆయన నుంచి `సర్కార్ 4` ప్రకటన రావడంతో అసలు ఈసారి ఈ సినిమాను ఎవరైనా సీరియస్‌గా తీసుకుంటారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఆర్జీవీ కెరీర్‌ను గమనిస్తే...`26/11 ఎటాక్స్` సినిమా కోసం తప్ప, ఆ తర్వాత వచ్చిన మెజారిటీ చిత్రాల్లో ఆయన మునుపటి శ్రద్ధ కనబరచలేదని స్పష్టమవుతోంది. క్వాలిటీ విషయంలో రాజీ పడుతూ.. కేవలం సంచలనం కోసమే సినిమాలు తీస్తున్నారనే అపవాదు ఆయనపై ఉంది. ఈ నేపథ్యంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ వంటి దిగ్గజంతో తీసిన `సర్కార్` సిరీస్‌లో నాలుగో భాగాన్ని ప్రకటిస్తూ షూటింగ్ షెడ్యూల్‌ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసారు. అయితే ఆర్జీవీలోని పాత దర్శకుడు మళ్ళీ మేల్కొంటాడా? లేదా ఇది కూడా మరో నాసిరకం ప్రయత్నమేనా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
మరోవైపు ఆర్జీవీకి పరిశ్రమలో అందుతున్న గౌరవం కూడా తగ్గుతోందనే చర్చ నడుస్తోంది. ఇటీవల కోకాపేటలో ప్రారంభమైన అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్‌లో దేశంలోని ప్రముఖ దర్శకుల ఫోటోలను ప్రదర్శించారు. అందులో ఆర్జీవీ సమకాలీనుడు.. అత్యంత సన్నిహితుడైన మణిరత్నం ఫోటో ఉంది కానీ ఒకప్పుడు టాలీవుడ్ ఖ్యాతిని పెంచిన వర్మ ఫోటో లేకపోవడం చర్చనీయాంశమైంది. అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల మల్టీప్లెక్స్‌లో ఆర్జీవీ ఫోటో లేకపోవడాన్ని నెటిజన్లు `షేమ్` అంటూ విమర్శిస్తున్నారు.
ఆర్జీవీ తన స్వయంకృతాపరాధాల వల్లే ఈ స్థాయికి దిగజారిపోయారనే విశ్లేషణలు పెరిగాయి. గొప్ప కథలు చెప్పే నైపుణ్యం ఉండి కూడా చీప్ పబ్లిసిటీకి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఆయన బ్రాండ్ వ్యాల్యూ పడిపోయింది. ఇప్పుడు `సర్కార్ 4` లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రకటించినా జనాల్లో నమ్మకం కలగడం లేదు. అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ మళ్ళీ ఆర్జీవీకి అవకాశం ఇస్తారా? ఒకవేళ ఇచ్చినా వర్మ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా? అన్నది వేచి చూడాలి.
సినిమా అంటే కేవలం కెమెరా యాంగిల్స్ మార్చడం మాత్రమే కాదు అందులో ఆత్మ ఉండాలని వర్మ గతంలో నిరూపించారు. కానీ ఇప్పుడు ఆయన తీస్తున్న చిత్రాల్లో ఆ `జీవం` కనిపించడం లేదు. `సర్కార్ 4` ద్వారా తన దర్శకత్వ పవర్ ఏంటో మళ్ళీ చూపిస్తానని ఆర్జీవీ అనుకుంటుండవచ్చు. కానీ కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా.. తెరపై ఆ మ్యాజిక్ పునరావృతం అయితేనే ప్రేక్షకులు ఆయన్ని మళ్ళీ పట్టించుకుంటారు.
ఏది ఏమైనా రామ్ గోపాల్ వర్మ తన కెరీర్‌లో అత్యంత క్లిష్ట దశలో ఉన్నారు. ఒకవైపు మిత్రుల నుంచి పరిశ్రమ పెద్దల నుంచి గౌరవం తగ్గడం.. మరోవైపు తనపై తనకు ఉన్న అతివిశ్వాసం ఆయన కెరీర్‌ను ప్రమాదంలో పడేశాయి. `సర్కార్ 4` ని ఘనంగా ప్రకటించారు సరే..! ఆయనకు కంబ్యాక్ సినిమా అవుతుందా? లేక ఆయన పతనానికి మరో మెట్టు అవుతుందా? అన్నది కాలమే నిర్ణయించాలి. ఆ మల్టీప్లెక్స్ గోడల మీద ఫోటో లేకపోయినా పర్వాలేదు కానీ.. ప్రేక్షకుల మనసులో మళ్ళీ స్థానం సంపాదించాలంటే వర్మ తన పంథాను మార్చుకోవాల్సిందే!
