Begin typing your search above and press return to search.

గ్యాంగ్ స్ట‌ర్ల‌కు రాంగో పాల్ వ‌ర్మ సోల్ మేట్ లాంటోడు!

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో గ్యాంగ్‌స్టర్ డ్రామాలకు సరికొత్త నిర్వచనం చెప్పిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ .

By:  Srikanth Kontham   |   24 Oct 2026 11:00 PM IST
గ్యాంగ్ స్ట‌ర్ల‌కు రాంగో పాల్  వ‌ర్మ సోల్ మేట్ లాంటోడు!
X

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో గ్యాంగ్‌స్టర్ డ్రామాలకు సరికొత్త నిర్వచనం చెప్పిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ . ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యంతో తీసిన `సత్య`, `కంపెనీ`, `ఢీ` వంటి చిత్రాలు భారతీయ సినిమాలో ట్రెండ్ సెట్టర్లుగా నిలిచాయి. ముంబై అండర్‌వరల్డ్ శకం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు ఎంతోమంది సినీ ప్ర‌ముఖులు బెదిరింపులు.. దాడులు ఎదుర్కున్నా? రామ్ గోపాల్ వర్మపై మాత్రం ఎలాంటి దాడులు జరగకపోవడం ఇప్ప‌టికీ ఆసక్తికరమైన అంశమే.

దీనికి కారణం వర్మ అండర్‌వరల్డ్ నేరస్థులను తెరపై చూపించిన తీరు అని సినీ విశ్లేషకులు భావిస్తుంటారు. సాధారణంగా సినిమాల్లో గ్యాంగ్‌స్టర్లను సమాజానికి హానికరమైన దుర్మార్గులుగా .. విలన్లుగా మాత్రమే చూపిస్తారు. కానీ ఆర్జీవీ మాత్రం వారి మానసిక స్థితిని.. నేర ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి గల కారణాలను.. వారి వ్యక్తిగత జీవితాలలోని సంక్లిష్టతలను ఎంతో లోతుగా ఆవిష్క‌రిస్తారు. ఒక రకంగా వారి కోణాన్ని ప్రపంచానికి చూపిస్తూ వారికి మంచి మైలేజ్ ఇచ్చేలా వ‌ర్మ‌ సినిమాలుంటాయ‌న్న‌ది కాద‌న‌లేని నిజం.

ఈ విషయాన్ని రామ్ గోపాల్ వర్మ గతంలో పలు ఇంటర్వ్యూలలో కూడా అంగీకరించారు. తాను అండర్‌వరల్డ్‌ను గ్లోరిఫై చేయడం లేదని.. కానీ వారి మనస్తత్వాన్ని అర్థం చేసుకుని నిజాయితీగా తెరపై ఆవిష్కరిస్తున్నానని పేర్కొనేవారు. అలాగే గ్యాంగ్‌స్టర్లకు తాను ఒక సోల్ మేట్ (ఆత్మబంధువు) లాంటివాడినని.. అందుకే వారు తనను గౌరవిస్తారే తప్ప తనపై ఎలాంటి శత్రుత్వాన్ని లేదా క్రోధాన్ని పెంచుకోరని స్వయంగా వ్యాఖ్యానించడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

అండర్‌వరల్డ్‌తో ఆర్జీవీకి ఉన్న ప్రత్యేక అనుబంధం ..అవగాహన కారణంగానే ఆయన ప్రత్యక్షంగా నిజమైన గ్యాంగ్‌స్టర్లను.. నిఘా వర్గాలను కలిసి అనేక నిజాలను సేకరించగలిగారు. సాధారణంగా నేరగాళ్లు సినీ పరిశ్రమను డబ్బు గుంజడానికి లేదా బెదిరించడానికి ఉపయోగించుకునేవారే తప్ప తమ కథలను ఇంత లోతుగా అధ్యయనం చేసి తెరకెక్కించే దర్శకుడిని ఓ శ్రేయోభిలాషిగానే చూసేవారు. దీంతో అప్పట్లో బాలీవుడ్‌ను ఊపేసిన అండర్‌వరల్డ్ దాడుల నుంచి వర్మ సురక్షితంగా ఉండగలిగారు.

హింస.. నేరం.. రౌడీయిజం వెనుక ఉన్న మానవ నైజాన్ని అత్యంత సహజంగా తెరపైకి తీసుకురావడంలో వర్మ చూపించిన ప్రతిభ అద్భుతమైనది. `సత్య` చిత్రంలోని భీఖూ మాత్రే పాత్ర కానీ.. `కంపెనీ`లోని మాలిక్, చందు పాత్రలు కానీ.. సమాజానికి దూరంగా బ్ర‌తికే అండర్‌వరల్డ్ మనుషులకు గుర్తింపును.. ప్రత్యేకమైన ఇమేజ్‌ను తెచ్చిపెట్టాయి. ఈ తరహా చిత్రీకరణ ఆయా నేరగాళ్లకు కూడా ఒకరకమైన పబ్లిసిటీని.. మైలేజ్‌ను అందించడంలో తోడ్పడింది.

మొత్తానికి ముంబై అండర్‌వరల్డ్ కల్లోల సమయాన్ని అత్యంత సమీపం నుంచి చూసిన కొద్దిమంది దర్శకులలో ఆర్జీవీ ముఖ్యుడు. గ్యాంగ్‌స్టర్ల మనస్తత్వాన్ని అంచనా వేసి వారితో ఒక రకమైన మానసిక బంధాన్ని ఏర్పర చుకోవడం వల్లే వ‌ర్మ ప్రమాదకరమైన ప్రపంచంలోనూ సురక్షితంగా ఉంటూనే.. భారతీయ సినిమా చరిత్రలో నిలిచిపోయే క్లాసిక్ సినిమాలను అందించగలిగారు.