పుట్టినరోజునే చావు గురించి మాట్లాడిన ఆర్జీవీ!
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ వివాదాలు, వినూత్న ఆలోచనలతో వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన ప్రత్యేక దృక్పథాన్ని ప్రపంచానికి చూపించారు.
By: Sravani Lakshmi Srungarapu | 7 April 2026 7:29 PM ISTఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ వివాదాలు, వినూత్న ఆలోచనలతో వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన ప్రత్యేక దృక్పథాన్ని ప్రపంచానికి చూపించారు. ఏప్రిల్ 7న తన పుట్టినరోజు సందర్భంగా ఆయన చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం పెద్ద చర్చకు దారి తీసింది. సాధారణంగా పుట్టినరోజులు అనేవి ఆనందం, సంబరాల ప్రతీకగా భావిస్తారు. మరో ఏడాదిలోకి అడుగుపెట్టాననే భావనతో చాలా మంది తమ బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే వర్మ మాత్రం ఈ సాధారణ భావనకు పూర్తి విరుద్ధంగా స్పందించారు. తన బర్త్ డేను ఒక వేడుకగా కాకుండా, జీవిత ప్రయాణంలో మరణానికి ఒక అడుగు దగ్గరయ్యానని ఆయన అభివర్ణించారు.
సెలబ్రేషన్స్ చేయాల్సిన పన్లేదు
తన అఫీషియల్ ఎక్స్ అకౌంట్ లో వర్మ చేసిన పోస్ట్‌లో, ఈ రోజు నేను నా చావుకు మరో ఏడాది దగ్గరయ్యాను. కాబట్టి దీని గురించి సెలబ్రేషన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా కారణంతో మీకు ఆనందం కలిగితే చేసుకోండి, కానీ నా కోసం ప్రత్యేకంగా జరుపుకోవద్దు అని రాసుకొచ్చారు. లైఫ్ అనేది పుట్టుకతో ప్రారంభమై, మరణం వైపు కదిలే ఒక నిరంతర ప్రయాణమని ఆయన తనదైన తాత్విక దృక్పథాన్ని వెల్లడించారు.
ఆర్జీవీ పోస్ట్ కు భారీ డిస్కషన్స్
ఆర్జీవీ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విభిన్న స్పందనలకు దారితీశాయి. కొందరు నెటిజన్లు వర్మ ఆలోచనలను ఆసక్తిగా స్వీకరిస్తూ, ఇలాంటి భావన మీకే సాధ్యమంటూ కామెంట్ చేస్తుండగా, మరికొందరు మాత్రం సరదాగా స్పందిస్తూ, హ్యాపీ బర్త్‌డే సర్.. మీరిలాగా మాకు ఎంటర్టైన్‌మెంట్ ఇస్తూ ఉండాలంటూ సెటైర్లు వేస్తున్నారు. మొత్తంగా చూస్తే, ఆయన చేసిన ఒక చిన్న పోస్ట్ కూడా భారీ చర్చకు కారణమవడం వర్మకు ఉన్న ప్రత్యేక గుర్తింపును మరోసారి చూపించింది.
వివాదాలకు కేరాఫ్ గా ఆర్జీవీ
వర్మ తన కెరీర్ ప్రారంభం నుంచే సంప్రదాయాలకు విరుద్ధంగా ఆలోచించే వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆయన సినిమాలు మాత్రమే కాకుండా, ఆయన వ్యాఖ్యలు కూడా తరచూ వివాదాలకు కేంద్రబిందువుగా మారుతుంటాయి. సామాజిక, రాజకీయ అంశాలపై ఆయన తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేయడం ఆయన స్పెషాలిటీ. ఈ ధోరణి కారణంగా విమర్శలు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నప్పటికీ, ఆయనను అభిమానించే వర్గం కూడా పెద్దదే.
కాగా ప్రస్తుతం వర్మ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా వెబ్ సిరీస్‌లు, బయోపిక్‌ల రూపంలో కొత్త కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. టెక్నాలజీని వినియోగించుకోవడంలో ముందుండే డైరెక్టర్ గా ఆయన గుర్తింపు పొందారు. తక్కువ బడ్జెట్‌తో విభిన్నమైన కంటెంట్ అందించడం ఆయన స్టైల్‌గా మారింది. ఇండస్ట్రీలో ఎంతో మంది యంగ్ డైరెక్టర్లకు, కంటెంట్ క్రియేటర్లకు వర్మ ఒక ఇన్సిపిరేషన్ గా నిలిచారు. ఆయన ఆలోచనా విధానం ఎంత విభిన్నమైనదైనా, అందులో ఒక తాత్వికత, వాస్తవానికి దగ్గరైన కోణం ఉంటుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
