Begin typing your search above and press return to search.

కంగ‌న చెప్ప‌డం వ‌ల్లే ఆర్జీవీలో ఇంతటి మార్పు!

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన పుట్టినరోజు వేడుకలను ముంబైలో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల మధ్య ఘనంగా జరుపుకున్నారు.

By:  Sivaji Kontham   |   10 April 2026 11:09 PM IST
కంగ‌న చెప్ప‌డం వ‌ల్లే ఆర్జీవీలో ఇంతటి మార్పు!
X

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన పుట్టినరోజు వేడుకలను ముంబైలో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు సినిమా సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కేక్ కట్ చేస్తున్న ఫోటోను షేర్ చేస్తూ.. ``నా గతాన్ని #ధురంధర్2 అనే కత్తితో పొడుస్తున్నాను`` అని పేర్కొన్నారు. బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల వసూళ్లతో ప్రభంజనం సృష్టిస్తున్న` ధురంధర్: ది రివెంజ్` సక్సెస్ ఇచ్చిన ప్రేరణతో.. తన పాత వైఫల్యాలను చెరిపేసి సరికొత్తగా ప్రయాణం మొదలుపెట్టబోతున్నానని వర్మ ఈ వ్యాఖ్యల ద్వారా సంకేతాలిచ్చారు.

వర్మ చేసిన ఈ సంచలన ప్రకటనకు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నుండి అద్భుతమైన మద్దతు లభించింది. వర్మ సినిమాల వల్ల తాము ఎంతగా ప్రభావితమయ్యామో కంగనా గుర్తుచేసుకోవడం ఆయనలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో ఒక మారుమూల పల్లెటూరులో ఉన్నప్పుడు.. అక్కడ థియేటర్లు లేకపోయినా వర్మ సినిమాల డీవీడీలు తెప్పించుకుని మరీ చూసేదాన్నని వివరించారు. ఆ చిత్రాలే తనను ముంబై నగరం వైపు.. సినిమా ప్రపంచం వైపు అడుగులు వేసేలా కలలు కనేలా చేశాయని కంగనా పేర్కొనడం విశేషం.

నిజానికి ఆర్జీవీ గత కొంతకాలంగా వరుసగా నాణ్యత లేని చిత్రాలను తీస్తూ తన ఇమేజ్‌ను దెబ్బతీసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. అయితే కంగనా వంటి నటీమణులు ఆయనలోని అసలైన ప్రతిభను గుర్తు చేస్తూ ప్రశంసలు కురిపించడం వల్ల మార్పు మొదలైందని చెప్పవచ్చు. తన కథలు ప్రజల జీవితాలను ఎంత సుసంపన్నం చేశాయో తెలుసుకున్న వర్మ.. ఇప్పుడు మళ్లీ పునరుత్తేజం పొందారు. `ధురంధర్` సినిమా సాధించిన విజయం ఆయనకు ఒక బెంచ్ మార్క్‌గా మారిందని.. దాన్ని మించిన అద్భుతమైన చిత్రాలను రూపొందించాలనే గట్టి సంకల్పాన్ని ఆయనలో రగిల్చింది.

కంగనా చేసిన వ్యాఖ్యలకు వర్మ తనదైన శైలిలో చమత్కారంగా స్పందించారు. ``నన్ను మరీ ఇంత ప్రాచీన వ్యక్తిని చేసినందుకు ధన్యవాదాలు` అంటూనే.. కంగ‌న‌ భావాలను మనస్ఫూర్తిగా అభినందించారు. తోటి కళాకారుల పనిని గౌరవించడంలో వర్మ ఎప్పుడూ ముందుంటారని.. అదే సంస్కారంతో ఆయన కంగనాకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మళ్లీ పాత ఆర్జీవీని గుర్తుకు తెచ్చేలా.. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా గొప్ప చిత్రాలను రూపొందిస్తానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

మొత్తానికి `ధురంధర్` ఇచ్చిన సక్సెస్ కిక్కు.. కంగనా అందించిన నైతిక మద్దతు వర్మను ఒక కొత్త మనిషిగా మార్చేశాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అపజయాల గతాన్ని పొడిచి పారేసి.. విజయాల భవిష్యత్తు వైపు ఆయన అడుగులు వేస్తున్నారు. ఇక‌పై ఇండియ‌న్ సినిమా రికార్డులను అధిగమించే దిశగా వర్మ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఒకప్పుడు సినిమా దిశను మార్చిన ఈ మేధావి మళ్లీ తన మునుపటి వైభవాన్ని ఎలా చాటుకుంటారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.