అల్లు vs యశ్ గొడవలో ఆర్జీవీ.. ఒక డంబోకైనా అర్థం కావాలి
అల్లు అరవింద్ మూడేళ్ల క్రితం “కేజీఎఫ్ ముందు యశ్ ఎవరు?” అనే కామెంట్ ఇప్పుడు మళ్లీ వైరల్ కావడంతో వివాదం మొదటికొచ్చింది.
By: M Prashanth | 2 Sept 2026 9:12 AM ISTఅల్లు అరవింద్ మూడేళ్ల క్రితం “కేజీఎఫ్ ముందు యశ్ ఎవరు?” అనే కామెంట్ ఇప్పుడు మళ్లీ వైరల్ కావడంతో వివాదం మొదటికొచ్చింది. అసలు ఆయన ఆ మాట ‘కోటబొమ్మాళి పీఎస్’ టీజర్ లాంచ్‌లో చెప్పారు. పెద్ద సినిమాల బడ్జెట్లు ఎందుకు పెరుగుతున్నాయి, హీరోల రెమ్యునరేషన్ ఎంత ప్రభావం చూపుతోంది అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ యశ్‌ను ఉదాహరణగా తీసుకున్నారు. హీరో ఫీజు ఒక్కటే బడ్జెట్‌ను పెంచదని, సినిమా మేకింగ్‌పై పెట్టే ఖర్చు కూడా స్టార్ మార్కెట్‌ను పెంచుతుందని చెబుతూ ‘కేజీఎఫ్’ను ప్రస్తావించారు.
‘టాక్సిక్’ ప్రమోషన్స్‌లో యశ్ ముందు అదే కామెంట్ తో ఆ ప్రశ్న ఎదురైంది. యశ్ కూడా ‘కేజీఎఫ్’ తన కెరీర్‌ను మార్చిందని ఒప్పుకున్నాడు. కానీ సినిమా నిర్మాత ఒక్కరిదే కాదని, నటుడు సహా అందరి పని ఉంటుందని చెప్పాడు. తర్వాత యశ్ తల్లి పుష్ప కూడా స్పందించారు. ‘కేజీఎఫ్’కు ముందే తన కొడుకు కన్నడలో హిట్లు ఇచ్చాడని, ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇక్కడివరకు వచ్చాడని చెప్పారు.
ఇప్పుడు ఈ వ్యవహారంలో రామ్ గోపాల్ వర్మ అల్లు అరవింద్‌కు సపోర్ట్‌గా వచ్చాడు. అరవింద్ చెప్పిన మాటను యశ్‌ను తక్కువ చేసి అన్నట్లు చూడవద్దని, అది కరెక్ట్ కాదని అన్నాడు. ఈ వివాదం చూస్తుంటే తనకు నవ్వొస్తోందని చెప్పిన ఆర్జీవీ, అసలు ఆ కామెంట్ ఏ సందర్భంలో వచ్చిందో చూసిన తర్వాతే దాని అర్థం తీసుకోవాలని చెప్పాడు.
ఆర్జీవీ టోన్ అక్కడితో ఆగలేదు. అల్లు అరవింద్ మాట ఏ సందర్భంలో వచ్చిందో “ఒక డంబోకైనా అర్థం కావాలి” అనే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ‘కేజీఎఫ్’ ముందు హిందీ ప్రేక్షకులకు యశ్ ఎంతవరకు తెలుసు, ‘బాహుబలి’ ముందు ప్రభాస్, ‘కాంతార’ ముందు రిషబ్ శెట్టి పరిస్థితి కూడా అలాగే ఉండేదని ఉదాహరణలు ఇచ్చాడు. ఒక సినిమా నటుడిని కొత్త మార్కెట్‌కు తీసుకెళ్లగలదనేదే అరవింద్ చెప్పిన భావమని వర్మ వాదించాడు.
అంతేకాదు, అల్లు అరవింద్ మాటను వ్యక్తిగతంగా తీసుకునేవాళ్లు చాలా ఈగోతో చూస్తున్నారని కూడా ఆర్జీవీ కామెంట్ చేశాడు. హాలీవుడ్‌లో కూడా పెద్ద బడ్జెట్‌ను స్టార్ పేరు కోసం మాత్రమే పెట్టరని, కాన్సెప్ట్ కోసం కూడా పెడతారని చెప్పాడు. నోలన్ సినిమాలను ఉదాహరణగా తీసుకుని, నటుడి స్టార్‌డమ్ ఒక్కటే సినిమా స్థాయిని నిర్ణయించదనే లైన్‌లో తన వాదనను కొనసాగించాడు.
అయితే 2023లో అల్లు అరవింద్ మాట్లాడిన పూర్తి సందర్భం చూస్తే ఆయన యశ్ కెరీర్‌పై ప్రత్యేకంగా దాడి చేయడానికి ఆ మాట చెప్పలేదు. పెద్ద బడ్జెట్‌కు హీరో రెమ్యునరేషన్ ఒక్కటే కారణం కాదని చెప్పే సమయంలో ‘కేజీఎఫ్’ ఉదాహరణ వచ్చింది. కానీ పూర్తి మాట కంటే “కేజీఎఫ్ ముందు యశ్ ఎవరు?” అనే ఒక్క లైన్ ఎక్కువగా తిరగడంతో ఇది అల్లు వర్సెస్ యశ్ గొడవలా మారింది. ఇప్పుడు ఆర్జీవీ కూడా గట్టిగా ఎంటర్ అయ్యాడు కాబట్టి, ఈ మొత్తం వ్యవహారంపై అల్లు అరవింద్ మళ్లీ ఏమైనా మాట్లాడతారా అనేది చూడాలి.
