రామ్ చరణ్ కు సర్జరీ సక్సెస్.. రంగంలోకి యూఎస్ స్పెషలిస్ట్!
అయితే నేడు కోయంబత్తూర్ లోని గంగ హాస్పిటల్ లో డాక్టర్ రాజశేఖరన్ ఆధ్వర్యంలో ఆయన చేతి మణికట్టుకు సర్జరీ దిగ్విజయంగా పూర్తయింది.
By: Madhu Reddy | 27 July 2026 6:05 PM ISTమెగాస్టార్ చిరంజీవి వారసుడిగా గ్లోబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు రామ్ చరణ్. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈయన ఇటీవల పెద్ది సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం పెద్ది విడుదల తర్వాత విరామం లభించడంతో తన చేతి మణికట్టు సర్జరీ కోసం నిన్న తన భార్య ఉపాసన, తల్లిదండ్రులు చిరంజీవి, సురేఖలతో కలిసి కోయంబత్తూర్ కి వెళ్ళిన విషయం తెలిసిందే.
రామ్ చరణ్ కి సర్జరీ సక్సెస్..
అయితే నేడు కోయంబత్తూర్ లోని గంగ హాస్పిటల్ లో డాక్టర్ రాజశేఖరన్ ఆధ్వర్యంలో ఆయన చేతి మణికట్టుకు సర్జరీ దిగ్విజయంగా పూర్తయింది. ఈ క్లిష్టమైన సర్జరీలో యూఎస్ మియామీకు చెందిన మణికట్టు స్పెషలిస్ట్, డాక్టర్ అలెంజాడ్రో బేడియా కూడా ఈ ఆపరేషన్ లో భాగమయ్యారని గంగా హాస్పిటల్ ఒక ప్రకటనలో తెలిపింది. రామ్ చరణ్ వేగంగా కోలుకుంటున్నారని, అయితే కొన్ని వారాల పాటూ విశ్రాంతి తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తుందని వైద్య బృందం తెలిపింది. ప్రస్తుతం రామ్ చరణ్ కి సర్జరీ పూర్తయిందని తెలియడంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
గాయానికి కారణం?
రామ్ చరణ్ మణికట్టు వద్ద గాయం ఎలా తగిలింది అనే విషయానికొస్తే.. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది సినిమా షూటింగ్ సమయంలోనే రామ్ చరణ్ మణికట్టు వద్ద గాయమైంది. అయితే అప్పటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆయన సర్జరీకి వెళ్లకుండా గాయమైన చేతితోనే సినిమా షూటింగ్ పూర్తి చేశారు. సినిమా పట్ల ఆయనకున్న నిబద్దతను మరోసారి నిరూపించుకున్నారు రామ్ చరణ్. అలాగే సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొన్నారు. ఎట్టకేలకు విరామం దొరకడంతో కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో గంగా హాస్పిటల్ లో సర్జరీ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయనకు సర్జరీ సక్సెస్ అవ్వడంతో త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
రామ్ చరణ్ సినిమాలు..
పెద్ది సినిమాతో 400 కోట్ల క్లబ్లో చేరిన రామ్ చరణ్.. ఇప్పుడు RC 17 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేయబోతున్నారు. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని రాంచరణ్ చేయనున్నారు. అయితే రామ్ చరణ్ ప్రస్తుతం కొన్ని వారాలపాటు విశ్రాంతి తీసుకుని.. ఆ తర్వాతే సుకుమార్ సినిమా షూటింగ్ సెట్లో అడుగుపెట్టబోతున్నారని సమాచారం. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో రంగస్థలం సినిమా వచ్చి మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలోనే మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో మూవీ అనడంతో అంచనాలు తారస్థాయికి చేరిపోయాయి. మరి వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా స్టోరీ, నటీనటులు, సాంకేతిక బృందం ఇలా పలు విషయాలు త్వరలోనే తెలియనున్నాయి.
