Begin typing your search above and press return to search.

నేడే రామ్ చరణ్ మణికట్టు కు శస్త్రచికిత్స!

తాజాగా వైద్యుల సూచనల మేరకు ఎట్టకేలకు నేడు చ‌ర‌ణ్‌ శస్త్రచికిత్సకు సిద్ధమయ్యారు.`పెద్ది` చిత్ర షూటింగ్ సమయంలో రామ్ చరణ్‌కు మణికట్టు గాయం అయిన విషయం తెలిసిందే.

By:  Srikanth Kontham   |   27 July 2026 11:46 AM IST
నేడే రామ్ చరణ్ మణికట్టు కు శస్త్రచికిత్స!
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆరోగ్యం పట్ల అభిమానుల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. గత కొంతకాలంగా వాయిదా పడుతూ వచ్చిన చ‌ర‌ణ్ మణికట్టు శస్త్రచికిత్స నేడు కోయంబత్తూరులోని ప్రఖ్యాత గంగా ఆసుపత్రిలో జ‌రుగుతుంది. రామ్ చ‌ర‌ణ్‌ వృత్తిపరమైన బాధ్యతలకు కట్టుబడి సినిమా ప్రచార కార్యక్రమాలు ముగిసే వరకు సర్జరీని పక్కన పెట్టారు. తాజాగా వైద్యుల సూచనల మేరకు ఎట్టకేలకు నేడు చ‌ర‌ణ్‌ శస్త్రచికిత్సకు సిద్ధమయ్యారు.`పెద్ది` చిత్ర షూటింగ్ సమయంలో రామ్ చరణ్‌కు మణికట్టు గాయం అయిన విషయం తెలిసిందే.

సినిమా క్లైమాక్స్ .. కీలకమైన యాక్షన్ సన్నివేశాల చిత్రీక‌ర‌ణ‌ సమయంలో గాయం తగిలినప్పటికీ సినిమాపై ఉన్న అంకితభావంతో షూటింగ్‌ను పూర్తి చేశారు. అలాగే సినిమా విడుదలైన తర్వాత జరిగిన ప్రచార కార్యక్రమాలలోనూ ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా పాల్గొని చిత్ర విజయానికి అంకితభావంతో పనిచేశారు. ఆ ప‌నుల‌న్నీ పూర్త‌వ్వ‌డంతో నేడు శ‌స్త్ర చికిత్స‌కు రెడీ అయ్యారు. ఈ శస్త్రచికిత్స నిమిత్తం ఆదివారం రామ్ చరణ్ సతీమణి ఉపాసన, మెగాస్టార్ చిరంజీవి, సురేఖతో పాటు కుటుంబ సభ్యులందరూ ప్రత్యేక విమానంలో కోయంబత్తూరు చేరుకున్నారు.

శస్త్రచికిత్స సమయంలో రామ్ చరణ్‌కు మానసిక స్థైర్యాన్ని అందించేందుకు కుటుంబ సభ్యులంతా దగ్గరుండి మద్దతుగా నిలవడం విశేషం. మెగా కుటుంబంలో ప్రతి కీలక సమయంలోనూ ఒకరికొరొండరు అండగా నిలవడానికి ఈ ఘటన మరో నిదర్శనంగా నిలిచింది. కోయంబత్తూరులోని గంగా ఆసుపత్రి ఆర్థోపెడిక్ వైద్య రంగంలో దేశవ్యాప్తంగా అత్యున్నత ఖ్యాతిని గడించింది. ఈ ఆసుపత్రికి చెందిన ప్రఖ్యాత ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ రాజశేఖర్ నేతృత్వంలోని అత్యంత అనుభవజ్ఞులైన వైద్యుల బృందం రామ్ చరణ్‌కు శస్త్రచికిత్సను నిర్వహిస్తోంది.

అత్యాధునిక వైద్య సాంకేతికత కలిగిన కేంద్రంలో సర్జరీ జరుగుతుండటంతో శస్త్రచికిత్స విజయవం తమవుతుం దనే ధీమాతో వైద్యులు ..కుటుంబ సభ్యులు ఉన్నారు. చిన్నపాటి గాయాలను సైతం లెక్కచేయకుండా సినిమా కోసం కష్టపడే స్వభావం ఉన్న రామ్ చరణ్ పూర్తిగా కోలుకున్న తర్వాతే మళ్లీ తదుపరి చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొంటారు. ఈ విశ్రాంతి కాలం ఆయనకు పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. నేడు జరుగుతున్న శస్త్రచికిత్స విజయవంతంగా ముగిసి రామ్ చరణ్ త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సినిమా లతో ప్రేక్షకుల ముందుకు రావాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న చ‌ర‌ణ్‌ శ్రేయోభిలాషులు, ప్రముఖులు త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు.