మెగా వారసుడి సెలబ్రేషన్స్‌పై వింత వాదన!
మెగాస్టార్ చిరంజీవికి మనవడు..మెగా ఇంట వారసుడు పుట్టడంతో అభిమానుల్లో ఆమాత్రం ఆనందం ఉండటం సహజం.
By: Tupaki Entertainment Desk | 2 Feb 2026 12:19 PM ISTమెగా ఇంట వారసుడు పుట్టాడు. రామ్‌చరణ్ -ఉపాసన దంపతులు మరో సారి తల్లిదండ్రులయ్యారు. కవల పిల్లలు పుట్టారు. ఒక పాప, బాబు పుట్టడం..అందులోనూ మెగా వారసుడు పుట్టడంతో మెగా ఫ్యామిలీలో..ఇటు అభిమానుల్లోనూ సంబరాలు అంబరాన్నంటాయి. ఒక విధంగా చెప్పాలంటే పట్టరాని ఆనందంతో ఉన్న అభిమానుల అభిమానం హద్దులు దాటింది అని చెప్పొచ్చు. మెగాస్టార్ చిరంజీవికి మనవడు..మెగా ఇంట వారసుడు పుట్టడంతో అభిమానుల్లో ఆమాత్రం ఆనందం ఉండటం సహజం.
అయితే ఈ సెలబ్రేషన్స్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా దీనిపై రెండు వర్గాలుగా విడిపోయి పెద్ద చర్చకు తెరలేపింది. ఓ వర్గం సంబరాలు సహజం అంటుంటే మరో వర్గం మాత్రం మెగా సంబరాలపై ఓ విధంగా వికటాట్టహాసం (రాక్షస విమర్శ) చేస్తోంది. క్లీంకార జన్మించిన సమయంలో మెగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అపోలో హాస్పిటల్ పరిసరాల్లో హంగామా చేశారు. చాలా ఏళ్ల విరామం తరువాత లేక లేక కలిగిన సంతానం కావడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఆనాడు కూడా సంబరాలు అంబరాన్ని తాకాయన్నట్టుగా జరిగాయి. ఆసుపత్రి పరిసరాలన్నీ అభిమానుల రద్ధీతో కిటకిటలాడాయి. రాకపోకలకూ అంతరాయం కలిగింది. ఇన్నాళ్లుకు మరోసారి రామ్ చరణ్- ఉపాసన పేరెంట్స్ కావడం, ఒకే కాన్పులో కలవలలు అందులోనూ మెగా వారసుడు జన్మించడంతో ఫ్యాన్స్ ఆనందం హద్దులు దాటింది. సంబరాలు చేసుకుంది. ఆసుపత్రి పరిసరాల్లో పటాకులు కాల్చుతూ ఆనందాన్ని పంచుకుంది. అయితే దీనిపై కొంత మంది కామెంట్‌లు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా బట్టలు చించుకుంటున్నారు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆసుపత్రి పరిసరాల్లో `డోంట్ సౌండ్ హార్న్` అని సైన్ బోర్డ్‌లుంటాయి.. అవి తెలుసుకోకుండా అభిమానులు క్రాకర్స్ కాల్చారని, హాస్పటల్ దగ్గర ఎవరైనా క్రాకర్స్ కాలుస్తారా? అని కామెంట్‌లు చేస్తున్నారు. అయితే మరో వర్గం వాదన మరోలా ఉంది. అసోలో హాస్పిటల్ ముప్పై ఏళ్ల క్రితం కట్టినప్పుడు అక్కడ చుట్టుపక్కల ఇల్లు లేవు. కానీ ఇప్పుడు చుట్టూ లక్షల ఇల్లు ఏర్పడ్డాయి. దీపావళి వచ్చినప్పుడు క్రాకర్స్‌ని ఎవరు ఆపగలుగుతున్నారు?..ఇది అభిమానుల దీపావళి. అభిమానులకే కాదు వారి శ్రేయోభిలాషులకూ దీపావళే.
ఆసుపత్రి చుట్టుపక్కలా అభిమానుల కోలాహలం అక్కడ చుట్టుపక్కలా మెగా అభిమానులు కవాతు చేస్తున్నట్టుగా కనిపించిందని, పుట్టి పుట్టగానే మెగా వారసుడు రికార్డు బ్రేక్ చేశాడని, ఈ సంబరాలని చూసి మెగా ఫ్యామిలీ అంటే గిట్టని సైకోలు షాక్ అవుతున్నారని, వాళ్లు చాలా వికృతంగా తయారయ్యారని, ఎదుటివారి ఆనందాన్ని, అభివృద్ధిని ఏమాత్రం సహించలేకపోతున్నారని వాపోతున్నారు. దీంతో ప్రస్తుతం నెట్టింట మెగా ఫ్యాన్స్..మెగా శ్రేయోభిలాషులు వర్సెస్ సోషల్ మీడియా కామెంటర్స్ వార్ నడుస్తోంది.
