మెగానందం.. క్లీంకారకు తమ్ముడు- చెల్లి.. కవలల పేర్లేమి?
మెగా కుటుంబం గొప్ప ఆనంద క్షణాలను ఆస్వాధిస్తోంది. దీనికి కారణం.. రామ్ చరణ్- ఉపాసన దంపతులు కవలలకు ఆహ్వానం పలకడమే.
By: Sivaji Kontham | 1 Feb 2026 4:48 PM ISTమెగా కుటుంబం గొప్ప ఆనంద క్షణాలను ఆస్వాధిస్తోంది. దీనికి కారణం.. రామ్ చరణ్- ఉపాసన దంపతులు కవలలకు ఆహ్వానం పలకడమే. మొదట మగ బిడ్డ ఆ తర్వాత ఆడబిడ్డ జన్మించారని ఈరోజు ఉదయం వార్తలు వెలువడ్డాయి. ఈ ఆనంద క్షణాలను మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులు, ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రజలతో పంచుకున్నారు. అపోలో డాక్టర్లకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
అపోలోలో ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో చిరంజీవి మాట్లాడుతూ...రామ్ చరణ్ - ఉపాసన దంపతులు గత రాత్రి కవలలకు జన్మనిచ్చారని వెల్లడించారు. ఒక ఆడబిడ్డ, ఒక మగబిడ్డ జన్మించారని, కొణిదెల, కామినేని కుటుంబాలు ఎంతో ఆనందంగా ఉన్నాయని తెలిపారు. ఉపాసనతో పాటు ఇద్దరు బిడ్డలు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. చాలా కాలంగా ఇలాంటి శుభవార్త వినాలని అందరూ కోరుకున్నారు. భగవంతుడి దయ.. హనుమాన్ కృప వల్ల ఈ శుభవార్త అందిందని చిరంజీవి భావోద్వేగంగా తెలిపారు. ఈ ఆనందకరమైన విషయాన్ని అభిమానులతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని, అభిమానులు పండుగలా జరుపుకుంటున్నారని కృతజ్ఞతలు తెలిపారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన కొణిదెల దంపతులకు ఇప్పటికే క్లీం కారా అనే కుమార్తె ఉంది. ఇప్పుడు క్లీం కారాకు ఒక తమ్ముడు, ఒక చెల్లి ఉన్నారు. చెర్రోపాసనకు ఇప్పుడు డబుల్ ధమాకా కాదు.. ట్రిపుల్ ధమాకా. ముగ్గురు వారసులు ఉన్నారు. ఆ ముగ్గురి ఆలనాపాలన చూసుకుంటూ తాతయ్యగా ప్రమోటైన మెగాస్టార్ తన లైఫ్ లో బెస్ట్ మెమరీస్ ని సొంతం చేసుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉపాసన కవలలకు జన్మనివ్వడంతో ఇరు కుటుంబాల్లో ఆనందానికి అవధుల్లేవ్. అపోలో ఆస్పత్రిలో ప్రసవానికి సహకరించిన గైనకాలజిస్టుకు మెగాస్టార్ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు. సీనియర్ గైనకాలజిస్ట్ చెన్నై అపోలో నుంచి వచ్చారని, క్లీం కారా జన్మించినప్పుడు కూడా ఆమెనే స్వయంగా దగ్గర ఉండి అన్నివిధాలా సంరక్షిస్తూ, సహకరించారని చిరంజీవి తెలిపారు.
మెగా క్లీంకారకు తమ్ముడు- చెల్లి సరే కానీ, ఆ ఇద్దరి పేర్లేమి? అంటూ మెగాభిమానులు సోషల్ మీడియాల్లో తమ ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ ఇప్పుడు కెరీర్ బెస్ట్ ఫేజ్ లో ఉన్నాడు. అతడు తన తదుపరి చిత్రం `పెద్ది` చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత కూడా అతడికి భారీ లైనప్ ఉంది. క్లీంకారా జన్మించినప్పుడు ఆర్.ఆర్.ఆర్ గ్రాండ్ సక్సెస్ ఆనందాన్ని అనుభించిన చరణ్ ఇప్పుడు పెద్ది రిలీజ్ కోసం ఉత్కంఠగా వేచి చూస్తుండగా, కవలల జననంతో ఆనందం పదింతలైంది. తండ్రిగా ఇప్పుడు ట్రిపుల్ ధమాకా హ్యాపీనెస్ అతడి సొంతమైంది.
