రంగస్థలం కంటే పెద్దగానే..
ఇప్పుడు మళ్లీ కలిసి RC17 చేస్తున్న సమయంలో నిర్మాత రవిశంకర్ రంగస్థలం కంటే ఈ సినిమా మరింత బాగుంటుందని చెప్పేశారు. అంటే సినిమా మొదలవకముందే ఒక పెద్ద టార్గెట్‌ను కూడా ముందుంచేశారు.
By: M Prashanth | 27 Aug 2026 10:54 AM ISTరామ్ చరణ్, సుకుమార్.. ఇద్దరి కెరీర్ ను మరో లెవెల్ కు తీసుకు వెళ్ళిన సినిమా రంగస్థలమే. 2018లో వచ్చిన ఆ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ లాగా నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ కలిసి RC17 చేస్తున్న సమయంలో నిర్మాత రవిశంకర్ రంగస్థలం కంటే ఈ సినిమా మరింత బాగుంటుందని చెప్పేశారు. అంటే సినిమా మొదలవకముందే ఒక పెద్ద టార్గెట్‌ను కూడా ముందుంచేశారు.
నిజానికి రంగస్థలం తర్వాత ఈ ఇద్దరి కెరీర్ లెక్క చాలా మారిపోయింది. చరణ్ RRRతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల పెద్ది కూడా మంచి ఫలితం అందుకుంది. సుకుమార్ మరోవైపు పుష్ప, పుష్ప 2తో తన మార్కెట్‌ను తెలుగు దాటి తీసుకెళ్లాడు. అప్పట్లో రంగస్థలం చేసిన హీరో, దర్శకుడు ఇప్పుడు అదే స్థాయిలో లేరు. అందుకే RC17పై అంచనాలు కూడా 2018 లెక్కలో ఉండవు.
పైగా రంగస్థలం తరహా కథనే మళ్లీ చేయడం లేదని ఇప్పటికే నిర్మాత రవిశంకర్ క్లారిటీ ఇచ్చారు. ఈసారి కథ ఇప్పటి కాలంలో నడుస్తుందని గతంలో చెప్పారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్న విషయం ముందే ప్రకటించారు. మిగతా నటీనటులు, కథకు సంబంధించిన వివరాలను త్వరలో అధికారికంగా వెల్లడిస్తామని ఇప్పుడు తెలిపారు.
షూటింగ్ కూడా నవంబర్ లో అని కొంతకాలంగా వినిపిస్తోంది. స్క్రిప్ట్ దాదాపు పూర్తయిందని, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని రిపోర్ట్స్ వచ్చాయి. చరణ్ మణికట్టు సర్జరీ తర్వాత కోలుకుంటున్నాడు. పూర్తిగా ఫిట్ అయిన తర్వాతే షూటింగ్‌కు వెళ్లనున్నాడు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.
అయితే రంగస్థలాన్ని మించుతుందని నిర్మాత చెప్పడంతో ఇక పోలిక తప్పదు. అప్పట్లో చిట్టిబాబు పాత్ర, గ్రామం నేపథ్యం, పాటలు, క్లైమాక్స్ అన్నీ బాగా కుదిరాయి. RC17 పూర్తిగా మరో కథ అయినా చివరకు ప్రేక్షకుడు చూసేది అదే కాంబో నుంచి వస్తున్న రెండో సినిమా అనే లెక్కతోనే. రంగస్థలం తర్వాత ఎనిమిదేళ్లకు చరణ్, సుకుమార్ మళ్లీ కలుస్తున్నారు. మధ్యలో ఇద్దరి మార్కెట్ చాలా పెరిగింది. అందుకే RC17 అంతకుమించిన అంచనాలను ఎంతవరకు అందుకుంటుందన్నదే అసలు లెక్క.
