సుక్కూ ఆ మాస్టర్‌పీస్ ను కదిలిస్తాడా?
అందులో భాగంగానే రామ్ చరణ్ ప్రస్తుతం ఉప్పెన తో భారీ బ్లాక్ బస్టర్ ను అందుకున్న బుచ్చి బాబు సాన దర్శకత్వంలో పెద్ది అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 17 Oct 2025 9:00 PM ISTరాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ లో నటించి గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు రామ్ చరణ్. ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో ఎంతో కష్టపడి, ఎన్నో ఆశలు పెట్టుకుని గేమ్ ఛేంజర్ సినిమా చేస్తే అది కాస్తా డిజాస్టర్ అయింది. ఇక చేసేదేమీ లేక చరణ్ తన తర్వాతి సినిమాను మొదలుపెట్టి దానిపైనే తన ఆశలన్నింటినీ పెట్టుకున్నారు.
పెద్ది షూటింగ్ లో చరణ్ బిజీ
అందులో భాగంగానే రామ్ చరణ్ ప్రస్తుతం ఉప్పెన తో భారీ బ్లాక్ బస్టర్ ను అందుకున్న బుచ్చి బాబు సాన దర్శకత్వంలో పెద్ది అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న చరణ్ పుట్టిన రోజు నాడు ప్రేక్షకుల ముందుకు రానుంది. పెద్ది సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, వచ్చే ఏడాది జనవరి వరకు చరణ్ ఈ సినిమా కోసం డేట్స్ ను కేటాయించినట్టు ఇప్పటికే పలు వార్తలొచ్చాయి.
రంగస్థలంతో బ్లాక్ బస్టర్ అందుకున్న రామ్ చరణ్- సుకుమార్
పెద్ది తర్వాత రామ్ చరణ్, సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. చరణ్ కెరీర్లో 17వ సినిమాగా రానున్న మూవీ సుక్కూ దర్శకత్వంలోనే అని ఇప్పటికే అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. పెద్ది సినిమాను పూర్తి చేశాక కొన్నాళ్ల పాటూ రెస్ట్ తీసుకుని మే 2026 నుంచి సుకుమార్ సినిమాను మొదలుపెట్టాలని చరణ్ అనుకుంటున్నారట. అయితే ఆల్రెడీ వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో రంగస్థలం అనే బ్లాక్ బస్టర్ మూవీ రాగా, ఆ సినిమా కలెక్షన్ల పరంగా కూడా రికార్డులు సృష్టించింది. రామ్ చరణ్ లోని పూర్తి స్థాయి నటుడిని సుకుమార్ ఆ సినిమాతో బయటకు తీసుకొచ్చారు.
రంగస్థలంకు సీక్వెల్
చరణ్ కెరీర్లో కూడా రంగస్థలం ఓ స్పెషల్ ఫిల్మ్ గా ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆ సినిమాతో చరణ్ అందుకున్న ప్రశంసలు అన్నీ ఇన్నీ కావు. అయితే ఇప్పుడా సినిమాకు సీక్వెల్ రాబోతుందని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. చరణ్ తో సుకుమార్ చేయబోయేది రంగస్థలం కు సీక్వెలేనని, ప్రస్తుతం సుక్కూ ఆ స్క్రిప్ట్ వర్క్ లోనే బిజీగా ఉన్నారని అంటున్నారు.
అయితే రంగస్థలం మూవీ చూస్తే ఆ సినిమాకు ఓ ప్రాపర్ ఎండింగ్ ఉంటుంది. ఒకవేళ వస్తున్న వార్తలు నిజమైతే రంగస్థలం సినిమాకు సీక్వెల్ ను సుక్కూ ఎలా ప్లాన్ చేస్తారనేది చూడాలి. ఇదిలా ఉంటే ఈ న్యూస్ విన్న తర్వాత దానిపై మిశ్రమంగా స్పందిస్తున్నారు. రంగస్థలం లాంటి మాస్టర్ పీస్‌లను కదిలించకూడదని, దాన్ని అలానే వదిలేయాలని, ఒకవేళ దానికి సీక్వెల్ చేసి వర్కవుట్ అవకపోతే రంగస్థలం సినిమాకు ఉన్న క్రెడిబిలిటీ కూడా తగ్గుతుందని కొందరంటుంటే, మరికొందరు మాత్రం చరణ్- సుక్కూ చేయబోయే సినిమా కాన్సెప్ట్ పూర్తిగా కొత్తదని తమ లాజిక్స్ తాము చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు.
