Begin typing your search above and press return to search.

చెర్రీ సుక్కు.. ముహూర్తం ఓకే కానీ..

'రంగస్థలం' తర్వాత రామ్ చరణ్, సుకుమార్ మళ్లీ కలుస్తున్నారంటే అభిమానుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో తెలిసిందే.

By:  M Prashanth   |   31 Oct 2026 9:13 PM IST
చెర్రీ సుక్కు.. ముహూర్తం ఓకే కానీ..
X

'రంగస్థలం' తర్వాత రామ్ చరణ్, సుకుమార్ మళ్లీ కలుస్తున్నారంటే అభిమానుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో తెలిసిందే. కానీ ఈ కాంబినేషన్‌కు సంబంధించి ఇప్పటివరకు సినిమా సరైన క్లారిటీ లేదు. ఇప్పటికే పలుమార్లు ముహూర్తాలు మారాయి. ఇప్పుడు నిర్మాతల నుంచి అధికారికంగా మరో ప్రకటన వచ్చింది. అయితే అసలు షూటింగ్ విషయంలో మాత్రం ఇంకొంత సమయం పట్టేలా ఉంది.





చరణ్ 17వ సినిమాకు నవంబర్ 1న ఉదయం 10.50 గంటలకు పూజా కార్యక్రమం నిర్వహించనున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. దసరాకే ప్రారంభించాలని అనుకున్నా కుదరలేదు. అక్టోబర్ చివరివారంలో కూడా ప్రయత్నాలు జరిగాయి. చివరకు నవంబర్ మొదటిరోజును ఎంచుకున్నారు. నిజానికి ఈ సినిమాను 2024 మార్చిలోనే ప్రకటించారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత ప్రారంభ కార్యక్రమం జరుగుతోంది.

'రంగస్థలం' వచ్చి ఎనిమిదేళ్లు దాటిపోయాయి. అప్పట్లో చిట్టిబాబుగా చరణ్ నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. ఆ తర్వాత 'ఆర్ఆర్ఆర్'తో ఆయన స్థాయి పెరిగింది. సుకుమార్ కూడా 'పుష్ప' రెండు భాగాలతో పాన్ ఇండియా దర్శకుడిగా ఎదిగారు. ఇప్పుడు ఇద్దరూ మళ్లీ కలుస్తున్నప్పుడు పాత విజయాన్ని రిపీట్ చేయడం కంటే దాన్ని మించిన సినిమా అందించాలనే అంచనాలు ఉన్నాయి. అందుకే సుకుమార్ కథ విషయంలో ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు పూజ పూర్తయిన వెంటనే షూటింగ్ మొదలయ్యే పరిస్థితి లేదని సమాచారం. మొదట డిసెంబర్‌లో అనుకున్న షెడ్యూల్‌ను సంక్రాంతి తర్వాతకు మార్చినట్లు ప్రచారం జరుగుతోంది. సుకుమార్ ప్రీ ప్రొడక్షన్ కోసం మరింత సమయం కోరినట్లు తెలుస్తోంది. చరణ్ కూడా 'పెద్ది' కోసం మార్చుకున్న శరీరాకృతి నుంచి ఈ సినిమా పాత్రకు తగ్గట్లు సిద్ధమవుతున్నారు. కొత్త లుక్ కోసం ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయని టాక్ వచ్చింది.

ఈ ప్రాజెక్ట్‌లో సంగీత దర్శకుడి ఎంపిక కూడా ఆసక్తికరంగా మారింది. మొదట ప్రకటించినప్పుడు దేవిశ్రీ ప్రసాద్ పేరు ఉంది. ఇప్పుడు అనిరుధ్ రవిచందర్ పేరు వినిపిస్తోంది. హీరోయిన్ విషయంలో సారా అర్జున్, అనీత్ పడ్డా పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే నటీనటులు, సాంకేతిక బృందంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రేపటి కార్యక్రమంలో వీటిలో కొన్నింటికైనా సమాధానం దొరికే అవకాశముంది.

ఇక ఈ సినిమా కథపై రకరకాల. 'ఆర్ఆర్ఆర్' క్లైమాక్స్ షూటింగ్ సమయంలోనే చరణ్ తనకు సుకుమార్ సినిమా ఓపెనింగ్ సీన్ వివరించారని రాజమౌళి కుమారుడు కార్తికేయ గతంలో వెల్లడించారు. ఆ సన్నివేశం విని ఆశ్చర్యపోయానని కూడా చెప్పారు. అంటే అప్పటినుంచే ఈ కథపై వర్క్ జరుగుతోంది. ప్రస్తుతం 2028లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. రేపు పూజ పూర్తయినా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే తేదీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.