క్రికెట్ బాడీ లుక్ కోసం చరణ్ కు బుచ్చి టార్చర్
టాలీవుడ్‌లో డైరెక్టర్ సుకుమార్ స్కూల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
By: Sravani Lakshmi Srungarapu | 21 May 2026 4:06 PM ISTటాలీవుడ్‌లో డైరెక్టర్ సుకుమార్ స్కూల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన దగ్గర పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు, రైటర్లు తర్వాత డైరెక్టర్లుగా మారి తమదైన గుర్తింపు తెచ్చుకోవడం ఇండస్ట్రీలో ఇప్పటికే పెద్ద చర్చగా మారింది. అలాంటి సుకుమార్ బ్యాచ్ పని తీరు గురించి స్టార్ హీరో రామ్ చరణ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా పెద్ది ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజైన ఓ ఫన్ చిట్‌చాట్ వీడియోలో ఈ ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. పెద్ది సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేస్తున్నారు. అందులో భాగంగా కారులో ప్రయాణిస్తూ రామ్ చరణ్, బుచ్చిబాబు చేసిన సరదా సంభాషణ అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఈ వీడియోలో పెద్ది కోసం తనపై పెట్టిన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రెజర్ గురించి రామ్ చరణ్ సరదాగా మాట్లాడారు. సినిమాలో ఆటకూలీ పాత్రలో కనిపించనున్న చరణ్, కథలో భాగంగా పలు క్రీడల్లో పాల్గొనే వ్యక్తిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. దాంతో ఒక్కో గేమ్‌కు ఒక్కో రకమైన బాడీ లుక్ కావాలని బుచ్చిబాబు అడిగేవాడని చరణ్ చెప్పారు. క్రికెటర్‌లా ఉండాలి అంటావ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా లాంటి ఫిట్ లుక్ కావాలి అంటావ్. వెంటనే కుస్తీకి మరో లుక్, రెజ్లింగ్‌కు ఇంకో లుక్ అంటే ఒకేసారి అన్నీ ఎలా వస్తాయంటూ చరణ్ నవ్వుతూ అడిగిన తీరు వీడియోలో హైలైట్‌గా మారింది. దానికి స్పందించిన బుచ్చిబాబు, కొన్నిసార్లు ఫలానా లుక్ కావాలని అడగడానికే భయమేసేది సార్ అని చెప్పడంతో చరణ్ నవ్వేశారు.
తర్వాత మీ సుకుమార్ గారి బ్యాచ్ అందరికీ దండం పెట్టాలంటూ రామ్ చరణ్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సుకుమార్ శిష్యుల పని తీరు ఎంత డీటైల్‌గా ఉంటుందో, పాత్రల విషయంలో ఎంత కఠినంగా ఆలోచిస్తారో చరణ్ సరదాగా చెప్పినా, అందులో డైరెక్టర్ల కమిట్‌మెంట్‌పై ఉన్న గౌరవం స్పష్టంగా కనిపించింది. దానికి వెంటనే బుచ్చిబాబు, సార్… మేం మా గురువు గారి అంత కాదు అని వినయంగా స్పందించగా, వెంటనే మీ గురువు గారే బెటర్ అంటూ చరణ్ మరోసారి ఫన్నీగా కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది.
