Begin typing your search above and press return to search.

అల్లు వారి పెళ్లిలో చెప్పులు అయినా లేకుండా ఏకైక స్టార్?

అల్లు శిరీష్ - నైనిక రెడ్డిల వివాహ వేడుక మార్చి 6న హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది.

By:  Sivaji Kontham   |   7 March 2026 9:21 AM IST
అల్లు వారి పెళ్లిలో చెప్పులు అయినా లేకుండా ఏకైక స్టార్?
X

అల్లు శిరీష్ - నైనిక రెడ్డిల వివాహ వేడుక మార్చి 6న హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది. సినీ, రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖులు భారీగా తరలివచ్చిన ఈ వేడుకలో ఒక ప్ర‌త్యేక‌ దృశ్యం అందరి దృష్టిని ఆకర్షించింది. వందలాది మంది స్టార్ హీరోలు, నాయకులు విచ్చేసిన ఈ వేడుకలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అత్యంత సామాన్యంగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఈ పెళ్లి వేడుకకు రామ్ చరణ్ కనీసం చెప్పులు కూడా లేకుండా విచ్చేయడం విశేషం. దీని వెనుక ఒక బలమైన ఆధ్యాత్మిక కారణం ఉంది. ప్రస్తుతం రామ్ చరణ్ స్వామి అయ్యప్ప మాల ధరించి ఉండటంతో.. ఆ దీక్షా నియమాలను పాటిస్తూ ఆయన పాదరక్షలు లేకుండానే ఈ వేడుకకు హాజరయ్యారు. చరణ్ - ఉపాసన జంట ఈ పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణగా నిలవడమే కాకుండా.. చరణ్‌లోని భక్తిభావం అందరినీ ఆకట్టుకుంది.

ఒక మెగా సూపర్ స్టార్ కుమారుడై ఉండి.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినప్పటికీ రామ్ చరణ్ పాటించే క్రమశిక్షణ ఎప్పుడూ చర్చనీయాంశంగా మారుతుంటుంది. తను చేసే సినిమా కోసం 500 శాతం శ్రమించే చరణ్.. భక్తి విషయంలో కూడా అంతే చిత్తశుద్ధితో ఉంటారని ఈ ఘటన మరోసారి నిరూపించింది. వందల కోట్లు ఖర్చు చేసే ఇలాంటి వేడుకల్లో కూడా తన ఆధ్యాత్మిక నియమాలకు విలువనివ్వడం ఆయన సంస్కారానికి నిదర్శనం.

చరణ్ తన తండ్రి చిరంజీవి నుండి వారసత్వంగా పొందిన భక్తి అనే సంపదతో ఎంతో ఆనందంగా కనిపిస్తున్నారు. కోట్లాది రూపాయల ఆస్తి ఇవ్వలేని మానసిక ప్రశాంతతను, సంతోషాన్ని కేవలం భక్తి -ఆధ్యాత్మిక విషయాలు మాత్రమే ఇస్తాయని ఇప్పుడు నిరూప‌ణ అయింది. ఆడంబరాలకు పోకుండా ఎంతో సింపుల్‌గా చ‌ర‌ణ్ కనిపించిన తీరు అక్కడికి వచ్చిన ప్రముఖులను సైతం మెప్పించింది.

సాధారణంగా భక్తి , ధ్యానం మనం చేసే పనిపై ఏకాగ్రతను పెంచుతాయని తద్వారా విజయం సిద్ధిస్తుందని ఆధ్యాత్మిక గురువులు చెబుతుంటారు. రామ్ చరణ్ అన్ని వేళలా ఈ సూత్రాన్ని అనుసరిస్తూ కెరీర్‌లోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ముందుకు సాగుతున్నారు. క్రమశిక్షణతో కూడిన ఆయన ఈ జీవనశైలి నేటి తరం యువ నటీనటులకు, ఔత్సాహికులకు ఒక గొప్ప ఆదర్శంగా నిలుస్తోంది.

అల్లు - మెగా కుటుంబాల మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఈ వేడుక ఒక పండుగలా సాగింది. ఒకవైపు రాజకీయా నాయకులు, మరోవైపు సినీ దిగ్గజాల సందడి ఉన్నా కానీ.. రామ్ చరణ్ తన నిరాడంబరతతో ప్రత్యేక గుర్తింపు పొందారు. మొత్తానికి అల్లు శిరీష్ పెళ్లిలో రామ్ చరణ్ `చెప్పులు లేని స్టార్‌`గా అందరి దృష్టిని ఆక‌ర్షించారు. అయితే దీని వెన‌క కార‌ణం కూడా అత్యంత ఉధాత్త‌మైన‌ది..