థియేటర్లలో జనం హీరో ఎవరి కొడుకు అని సినిమా చూడరు: రామ్ చరణ్
ఇటీవల విడుదలైన `పెద్ది` సక్సెస్ ని ఆస్వాధిస్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, తన భార్య ఉపాసనతో కలిసి `రిపబ్లిక్ సమిట్ 2026` వేదికపై సందడి చేశారు.
By: Sivaji Kontham | 23 Jun 2026 9:19 AM ISTఇటీవల విడుదలైన `పెద్ది` సక్సెస్ ని ఆస్వాధిస్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, తన భార్య ఉపాసనతో కలిసి `రిపబ్లిక్ సమిట్ 2026` వేదికపై సందడి చేశారు. ఈ సదస్సులో చరణ్ తన సినీ ప్రయాణం.. స్టార్ కిడ్‌గా ఎదుర్కొన్న ఒత్తిళ్లు.. .. మెగాస్టార్ చిరంజీవి పెంపకం గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేసారు. ఒక స్టార్ హీరో కొడుకుగా పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పుడు తన భుజాలపై ఉన్న బాధ్యతల బరువును ఎలా అధిగమించారో రామ్ చరణ్ చాలా ఓపెన్‌గా వివరించారు.
చిన్నప్పటి నుంచే చుట్టుపక్కల వారు `నువ్వు మీ నాన్నగారి వారసత్వాన్ని నిలబెట్టాలి` అని ఒత్తిడి తెస్తున్నా.. తాను మాత్రం వాటిని పట్టించుకోకుండా చాలా సాధారణంగా పెరిగానని చరణ్ చెప్పారు. ``తెలియకపోవడమే ఒక వరం అనుకుంటే.. దానికి నేనే ఒక క్లాసిక్ ఉదాహరణ`` అంటూ చరణ్ నవ్వుతూ గుర్తుచేసుకున్నారు. దానికి ప్రధాన కారణం చిరంజీవి ఇంట్లో అసలు సినిమా వాతావరణాన్ని రానివ్వకపోవడమే. షూటింగ్ విశేషాలు, డైలాగులు, సినిమా చర్చలు అన్నీ ఆఫీస్ రూమ్‌కే పరిమితం చేసేవారని.. డైనింగ్ టేబుల్ లేదా బెడ్‌రూమ్ వరకు ఆ ప్రొఫెషనల్ విషయాలను నాన్నగారు ఎప్పుడూ తీసుకురాలేదని చరణ్ వెల్లడించారు. ఆ కారణంగానే స్టార్‌డమ్ తాలూకు వేడి తగలకుండా తామంతా చాలా నార్మల్‌గా పెరిగామన్నారు.
నటవారసత్వం గురించి మాట్లాడుతూ రామ్ చరణ్ ఒక ప్రాక్టికల్ విషయాన్ని చెప్పారు. సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వస్తే ఒక మంచి ప్లాట్‌ఫారమ్ దొరుకుతుందనే మాట నిజమే కానీ.. అది కేవలం మొదటి సినిమా వరకే ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. థియేటర్లలో సామాన్య ప్రేక్షకులు తమ కష్టార్జితాన్ని పెట్టి సినిమా చూసేటప్పుడు స్క్రీన్ మీద ఎవరి కొడుకు నటిస్తున్నాడనేది చూడరని.. కేవలం ప్యూర్ సినిమాను..నటుడి కష్టాన్ని...నిజాయితీని మాత్రమే ప్రేమిస్తారని చరణ్ అన్నారు. మొదటి సినిమా తర్వాత ఎవరికైనా సొంత ప్రతిభ, కష్టపడే తత్వమే పరిశ్రమలో నిలబెడతాయని ఆయన నొక్కి చెప్పారు.
ప్రస్తుతం ముగ్గురు పిల్లల తండ్రిగా తన బాధ్యతలను నెరవేరుస్తున్న రామ్ చరణ్.. 72 ఏళ్ల వయసులోనూ తన తండ్రి చిరంజీవి చూపిస్తున్న క్రమశిక్షణే తనకు పెద్ద ఇన్స్పిరేషన్ అని కొనియాడారు. ఈ వయసులోనూ ఆయన ఉదయం 5:30 గంటలకే నిద్రలేచి.. కాఫీ తాగి 6 గంటలకల్లా జిమ్‌లో ఉంటారని... తనను కూడా వర్కౌట్ చేయమని పిలుస్తుంటారని చెప్పారు. ``ఇంకా ఎందుకు ఇంత కష్టపడుతున్నారు నాన్న?`` అని అడిగితే.. ``నా మెదడును చురుగ్గా ఉంచుకోవడానికి... నా మనవళ్లు-మనవరాళ్ల కోసం... నా సినిమాల కోసం నేను ఆరోగ్యంగా జీవించాలి చరణ్`` అని అన్నారట.
ప్రస్తుతం మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న మెగాస్టార్.. తన 15 ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడూ వేలు పట్టి నడిపించలేదని.. సొంతంగా ఎదగడానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారని రామ్ చరణ్ చెప్పడం చూస్తే వారిద్దరి మధ్య ఉన్న పరిణతి, బంధం ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది.
