కిటికీ గ్రిల్స్ నట్లు తొలగించి ఔట్.. తిరిగొచ్చాక షాక్‌లో ఫ్రెండ్స్
సినీ పరిశ్రమలో స్టార్ హీరోలైన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, దగ్గుబాటి రానా మధ్య ఉన్న ప్రాణ స్నేహం గురించి అందరికీ తెలిసిందే.
By: Sivaji Kontham | 31 May 2026 1:00 PM ISTసినీ పరిశ్రమలో స్టార్ హీరోలైన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, దగ్గుబాటి రానా మధ్య ఉన్న ప్రాణ స్నేహం గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ చిన్నప్పటి నుండి ఒకే పాఠశాలలో కలిసి చదువుకోవడమే కాకుండా ఎంతో అల్లరిగా పెరిగారు. ఆ ఇద్దరికీ చెన్నైలో బాల్యస్మృతులు ఎప్పటికీ మరువలేనివి. తాజాగా తన చిత్రం `పెద్ది` ప్రమోషన్స్ ఇంటర్వ్యూలలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, తన బాల్య మిత్రుడు రానాతో కలిసి చిన్నతనంలో చేసిన ఒక క్రేజీ అల్లరి పనిని గుర్తుచేసుకుని పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తన చిన్నతనంలో రానా దగ్గుబాటితో చేసిన అల్లరి పనులను `పెద్ది` ప్రమోషన్స్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గుర్తుచేసుకున్నారు.
చిన్నప్పుడు తాను, రానా కలిసి అర్ధరాత్రి వేళల్లో ఇంట్లో వాళ్లకు తెలియకుండా బయటకు వెళ్ళడానికి ఒక రహస్య మార్గాన్ని వెతుక్కున్నట్లు చెప్పారు. తామిద్దరూ ఉన్న రూమ్ కిటికీ గ్రిల్స్ స్క్రూలను, నట్లను అత్యంత చాకచక్యంగా ఊడదీసి... ఎవరికీ అనుమానం రాకుండా కిటికీ గుండా బయటకు చెక్కేసేవాళ్లమని నవ్వుతూ వెల్లడించారు. అలా అర్ధరాత్రి కిటికీ దాటి బయటకు వెళ్లి హ్యాపీగా రైడ్స్‌కు వెళ్లేవాళ్లమని, ఐస్‌క్రీమ్‌లు తింటూ మరికొందరు స్నేహితులను కలిసి ఎంజాయ్ చేసేవాళ్లమని చరణ్ చెప్పారు.
అయితే ఎప్పుడూ ఒకేలా సాగదు అన్నట్లు ఒకరోజు వీరిద్దరి ప్లాన్ తిరగబడి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. రోజులాగే గ్రిల్స్ ఊడదీసి బయటకు వెళ్లి అర్ధరాత్రి అంతా తిరిగేసి మళ్లీ రూమ్‌లోకి ప్రవేశిద్దామని వచ్చేసరికి వీరికి పెద్ద షాక్ తగిలింది. తాము రాకముందే ఇంట్లో వాళ్లు గమనించి ఆ కిటికీ గ్రిల్స్‌ను పూర్తిగా మూసివేయడంతో దొరికిపోయామని ఆ సమయంలో తాము పడ్డ కంగారు... తిరిగొచ్చాక తిన్న తిట్లు ఇప్పటికీ మర్చిపోలేమని చరణ్ నవ్వుతూ ఆనాటి తీపి గుర్తును షేర్ చేసారు.
కేవలం చరణ్ మాత్రమే కాకుండా.... గతంలో రానా కూడా పలు సందర్భాలలో తామిద్దరూ చేసిన అల్లరి పనుల గురించి రివీల్ చేశారు. ముఖ్యంగా రానా హోస్ట్‌గా వ్యవహరించిన పాపులర్ టాక్ షో `నంబర్ వన్ యారీ` కార్యక్రమంలో రామ్ చరణ్ అల్లరి స్వభావం గురించి చిన్నప్పుడు క్లాస్ రూమ్‌లలో తాము షేర్ చేసుకున్న బెంచ్ జ్ఞాపకాల గురించి రానా ఎంతో సరదాగా ముచ్చటించారు. చరణ్ బయటకు చూడటానికి ఎంతో సైలెంట్‌గా హుందాగా కనిపిస్తాడు కానీ లోపల మాత్రం అతడు ఓ పెద్ద అల్లరి పిడుగు అని రానా ఆ షోలో సరదాగా వ్యాఖ్యానించారు.
ఇలా చిన్నప్పుడు స్కూల్ డేస్ నుండి కిటికీ గ్రిల్స్ ఊడదీసే రేంజ్ లో అల్లరి చేసిన చరణ్, రానాలు.. నేడు ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా రాణిస్తూనే తమ స్నేహాన్ని అంతకంతకూ బలోపేతం చేసుకుంటున్నారు. `పెద్ది` ప్రమోషన్ల వేదికగా చరణ్ షేర్ చేసిన ఈ కిటికీ గ్రిల్స్ ట్విస్ట్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో మెగా - దగ్గుబాటి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటూ నెట్టింట వైరల్‌గా మారింది.
