`కాకా` మీద చరణ్‌కి మరీ అంత నమ్మకమేంటో?
By: Sivaji Kontham | 11 Nov 2026 7:11 AM IST''మరో బ్లాక్ బస్టర్ వస్తోంది.. రాసి పెట్టుకోండి!'' అంటూ కాన్ఫిడెంట్ గా సౌండ్ చేయడం అంటే.. అదేమీ ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ అలాంటి బలమైన నమ్మకం వ్యక్తం చేసారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అది కూడా మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న `కాకా` గురించి డైరెక్టుగా ఓ ఈవెంట్లో చరణ్ ఇచ్చిపడేసిన ప్రకటన మెగాభిమానుల్లో ఒక్కసారిగా జోష్ ని పెంచేసింది.
''సంక్రాంతికి `కాకా`తో మరో బ్లాక్‌బస్టర్ వస్తుంది.. ఇది రాసి పెట్టుకోండి'' అంటూ కాస్త గట్టిగానే సౌండ్ చేసారు చరణ్. ఈవెంట్లో ఈ ప్రకటన విన్న వెంటనే మెగాభిమానుల్లో ఒకటే భావోద్వేగం. కాకాను మరో రేంజులో చూడబోతున్నామా? అనే ఉత్సాహం.. ఒకటే ఎగ్జయిట్ మెంట్..!
సంక్రాంతి ఎప్పుడూ మెగా బాస్ కి కలిసొస్తుంది. మరోసారి విజయం తథ్యం! `మన శంకరవర ప్రసాద్ గారు` 2026 సంక్రాంతి బరిలో విడుదలై ఎంత పెద్ద హిట్టు కొట్టిందో తెలిసిందే. అందుకే ఇప్పుడు చరణ్ ప్రకటన ఒక రేంజులో ఫ్యాన్స్ గుండెల్లో గుచ్చుకుంది. బాస్ చిరంజీవి మరోసారి ఆ రేంజులోనే హిట్టుకొట్టబోతున్నారా? అన్న చర్చ వేడెక్కించేసింది.
అసలే మాస్ లో మాంచి ఊపు తెచ్చే దమ్మున్న బాబి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో ఆ నమ్మకం మరింత రెట్టింపైంది. `వాల్తేరు వీరయ్య` లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాబి మరో పూనకాలు తెప్పించే కాన్సెప్టుతో బాస్ ని తెరపై ఆవిష్కరిస్తుండటంతో ఫ్యాన్స్ లో ఇది హుషారు నింపింది. ఇప్పుడు దీనికి అదనంగా చరణ్ చేసిన సౌండ్ కూడా బాగా కలిసి వస్తోంది.
`కాకా` 2027 సంక్రాంతి బరిలో పందెం పుంజులా దూసుకొస్తున్నాడు. కచ్ఛితంగా సంక్రాంతిని క్లీన్ స్వీప్ చేసేయాలనేదే పట్టుదల. ఇప్పుడు చరణ్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే `కాకా` కొట్టేసేట్టే ఉన్నాడనే చర్చ మొదలైంది. అయితే బాబి టీమ్ సినిమా గురించిన మరింత ప్రచార హంగామాను షురూ చేయాల్సి ఉంటుంది.
అసలు సంక్రాంతి బరిలో రానున్న కాకా స్పెషాలిటీ ఏంటి? అంటే సత్యం అలియాస్ కాకా పాత్రతో తనలోని మాస్ టింజ్ ఏ రేంజులో ఉంటుందో ఇందులో చిరు మరోసారి చూపించబోతున్నారు. పైగా ఆక్వా పరిశ్రమ నేపథ్యంలో కుట్రలు కుతంత్రాల కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్ లాంటి విలన్ ని కాకా ఢీకొట్టబోతున్నాడు. ఇందులో తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ లైన్ కూడా డ్రైవింగ్ ఫోర్స్ గా పని చేయనుండటంతో ఇది కచ్ఛితంగా తెలుగు లోగిళ్లకు ప్రత్యేకమైన సంక్రాంతి పండగ వాతావరణాన్ని తేనుందని అంచనా వేస్తున్నారు. చరణ్ కోరినట్టు అభిమానులు రాసి పెట్టుకున్నారు... సంక్రాంతి డేట్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.
