Begin typing your search above and press return to search.

'పెద్ది' ప‌హిల్వాన్ వెన‌క ఇంత కష్టం ఉందా?

స్టార్ హీరోలు గ‌తంలో ష‌ర్ట్ న‌ల‌గ కుండా, ఎలాంటి శారీరక శ్ర‌మ‌కు గురి కాకుండా, ఎలాంటి రిస్క్‌ల‌ని సైతం చేయాడానికి ఇష్ట‌ప‌డ‌కుండా రిస్క్ షాట్‌ల‌కు బాడీ డ‌బుల్స్‌ని వాడేస్తూ హ్యాపీగా సినిమాలు చేస్తూ వ‌చ్చారు.

By:  Ravindar Gorantla   |   29 April 2026 7:29 PM IST
పెద్ది ప‌హిల్వాన్ వెన‌క ఇంత కష్టం ఉందా?
X

స్టార్ హీరోలు గ‌తంలో ష‌ర్ట్ న‌ల‌గ కుండా, ఎలాంటి శారీరక శ్ర‌మ‌కు గురి కాకుండా, ఎలాంటి రిస్క్‌ల‌ని సైతం చేయాడానికి ఇష్ట‌ప‌డ‌కుండా రిస్క్ షాట్‌ల‌కు బాడీ డ‌బుల్స్‌ని వాడేస్తూ హ్యాపీగా సినిమాలు చేస్తూ వ‌చ్చారు. అయితే బాహుబ‌లి త‌రువాత నుంచి లెక్క‌లు మారిపోయాయి. ప్రాధామ్యాలూ మారి పోయాయి. రిస్క్ తీసుకోక‌పోతే రేస్‌లో నిల‌వ‌లేమ‌ని గుర్తించ‌డం మొద‌లైంది. దీంతో ప్ర‌తి స్టార్ హీరో స్టోరీ, క్యారెక్ట‌ర్ డిమాండ్ మేర‌కు ఎలాంటి రిస్క్ తీసుకోవ‌డానికైనా వెనుకాడ‌టం లేదు.

క్యారెక్ట‌ర్ డిమాండ్ చేస్తే ఎంత వ‌ర‌కైనా వెళుతున్నారు. ఎం చేయ‌డానికైనా సిద్ధం అంటున్నారు. ఈ విష‌యంలో తాను కూడా రెడీ అంటూ నిరూపిస్తున్నారు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌. ఆయ‌న న‌టిస్తున్న భారీ స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామా `పెద్ది`. బుచ్చి బాబు సాన ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా మూవీ జూన్ 25న భారీ స్థాయిలో ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతోంది. ఇందులో చ‌ర‌ణ్ పెద్దిగా క్రికెట‌ర్‌గా, మ‌ల్ల‌యోధుడిగా క‌నిపించిబోతున్నాడు.

ఇప్ప‌టికే విడుద‌లైన `పెద్ది` క్రికెట‌ర్ లుక్‌, ప‌హిల్వాన్ లుక్ సినిమాపై అంచ‌నాల్ని పెంచ‌డ‌మే కాకుండా అభిమానుల్ని షాక్‌కు గురి చేసింది. ఒక్క మూవీలో క్యారెక్ట‌ర్‌లో రెండు వేరియేష‌న్‌లా అంటూ అభిమానులు, సినీ ల‌వ‌ర్స్ ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. స‌రిగ్గా నెల రోజుల క్రితం హీరో రామ్ చ‌ర‌ణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా `పెద్ది` ప‌హిల్వాన్‌` పేరుతో గ్లింప్స్‌ని టీమ్ విడుద‌ల చేసింది.

ఈ వీడియోలో శ‌రీరాన్ని రాటు దేలిన ఇనుములా మ‌లిచి కుస్తీకి రెడీ అయిన మ‌ల్ల‌యోధుడిగా చూపించిన తీరు అంద‌రిని ఆశ్య‌ర్య‌ప‌రిచింది. అలాగే గ‌ధ‌ని ధ‌రించి చ‌ర‌ణ్ చేసిన విన్యాసాలు, లంగోటీ ధ‌రించి బ‌రిలోకి దిగే యోధుడిగా చ‌ర‌ణ్ ప‌లికించిన హావ భావాలు, బాడీ లాంగ్వేజ్‌, గ‌ద‌ని తిప్పిన తీరు ఆస‌క్తిని రేకెత్తించాయి. అయితే దీని వెనుక చ‌ర‌ణ్ ప‌డిన క‌ఠోర శ్ర‌మ దాగి ఉంద‌ని తెలిసింది. చ‌ర‌ణ్ ప‌హిల్వాన్ లుక్ కోసం క‌ఠోరంగా శ్ర‌మించార‌ని, క‌ఠిన ఆహార నియ‌మాలు పాటించార‌ని ట్రైన‌ర్ రాకేష్ ఉడియార్ తాజాగా చెప్పుకొచ్చారు.

చ‌ర‌ణ్ కార్బ్ సైక్లింగ్ ప‌ద్ద‌తిలో రోజుకు 1,800, 2,500 కేల‌రీల ఆహారం తీసుకున్నార‌ని, వారంలో మూడు రోజులు వెయిట్ ట్రైనింగ్‌, మిగిలిన రోజుల్లో కుస్తీ, గ‌ద శిక్ష‌ణ‌లో పాల్గొన్నార‌ని తెలిపారు. ఫిజియో థెర‌పీ, జాయింట్ కేర్‌తో గాయాలు కాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నామ‌న్నారు. గ‌తంలో `ఆర్ ఆర్ ఆర్‌` విష‌యంలోనూ ఫిజిక‌ల్‌గా ప్ర‌త్యేకంగా క‌నిపించ‌డం కోసం శిక్ష‌ణ తీసుకున్న చ‌ర‌ణ్ ఆ మూవీ త‌రువాత `పెద్ది` కోసం ప్ర‌త్యేకంగా బాడీ బిల్డింగ్ విష‌యంలో ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.