మే 'దాహం' అంతా 'పెద్ది' తీరుస్తుందా?
టాలీవుడ్ కు మే నెల పెద్దగా కలిసి రాలేదు. అనేక కొత్త సినిమాలు విడుదలైనా, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే స్థాయిలో ఒక్కటి కూడా నిలబడలేకపోయింది.
By: M Prashanth | 3 Jun 2026 6:00 AM ISTటాలీవుడ్ కు మే నెల పెద్దగా కలిసి రాలేదు. అనేక కొత్త సినిమాలు విడుదలైనా, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే స్థాయిలో ఒక్కటి కూడా నిలబడలేకపోయింది. చిన్న చిత్రాల నుంచి మీడియం రేంజ్ సినిమాల వరకు చాలా వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు కనిపించలేదు. దీంతో ఇప్పుడు మొత్తం పరిశ్రమ ఆశలన్నీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమాపైనే నిలిచాయి.
గత రెండు నెలలతో పోలిస్తే మే నెల పరిస్థితి మరింత నిరాశ కలిగించింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో కొన్ని సినిమాలు అయినా థియేటర్స్ లో ఆడగా, మేలో విడుదలైన చిత్రాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో ఫెయిలయ్యాయి. కొన్ని చిత్రాలకు విడుదలకు ముందు మంచి హైప్ వచ్చినప్పటికీ, థియేటర్లలో మాత్రం ఆ హైప్ నిలబడలేదు. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదు.
ఆ పరిస్థితికి కేవలంం కంటెంట్ మాత్రమే కారణం కాదని టాక్ వినిపిస్తోంది. ఐపీఎల్ సీజన్ ప్రభావం, ఎండల తీవ్రత కూడా థియేటర్లకు ప్రేక్షకుల రాకపై ప్రభావం చూపించాయి. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు, సాధారణ సినీ అభిమానులు థియేటర్లకు రావడం తగ్గిపోయిందని తెలుస్తోంది. ఇలాంటి సమయంలో జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న పెద్దిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం మొదటి నుంచి సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. విడుదలైన పోస్టర్లు, గ్లింప్సెస్, పాటలు సినిమాపై మంచి బజ్ ను తీసుకొచ్చాయి. స్పోర్ట్స్, యాక్షన్, ఎమోషన్స్ ఎలిమెంట్స్ తో కూడిన కథతో ఆ సినిమా తెరకెక్కినట్లు ప్రచారం జరుగుతోంది. సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, పాన్ ఇండియా స్థాయిలో విడుదల, రామ్ చరణ్ స్టార్ ఇమేజ్ కలిసి సినిమాపై మరింత ఆసక్తి పెంచుతున్నాయి. ప్రస్తుతం థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు కూడా పెద్ది రిజల్ట్ కోస. ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఒక పెద్ద సినిమా విజయం సాధిస్తే మొత్తం మార్కెట్ లో కొత్త ఉత్సాహం వస్తుంది. ప్రేక్షకులు మళ్లీ థియేటర్ల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా వరుస ఫ్లాపులతో నిరాశలో ఉన్న ఎగ్జిబిటర్లకు ఇది రిలీఫ్ ఇస్తుంది. అయితే అంచనాలు ఎంత ఉన్నా, చివరికి సినిమాను నిలబెట్టేది కంటెంట్ నే. ప్రేక్షకులకు స్టోరీ, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ కనెక్ట్ అయితే భారీ ఓపెనింగ్స్ లాంగ్ రన్ వసూళ్లుగా మారుతాయి. ఏదేమైనా మే నెలలో కనిపించిన బాక్సాఫీస్ నిరాశను జూన్ లో పెద్ది తొలగిస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ సినిమా విజయం సాధిస్తే కేవలం రామ్ చరణ్ కే కాదు, మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమకే కొత్త జోష్ ను తీసుకురావడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
