చరణ్ 'పెద్ది' రేట్లు.. ఆ ఫార్ములా ఫాలో అవుతారా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన పెద్ది సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతోంది.
By: M Prashanth | 8 Jun 2026 6:29 PM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన పెద్ది సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలైన తొలి నాలుగు రోజుల్లోనే ఆ మూవీ భారీ కలెక్షన్లు సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండగా, ఇప్పుడు టికెట్ రేట్ల విషయం చర్చనీయాంశంగా మారింది.
సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు విడుదలయ్యే సమయంలో టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వాల నుంచి స్పెషల్ పర్మిషన్లు తీసుకోవడం చూస్తుంటాం. పెద్ది విషయంలో కూడా అదే జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా విడుదల సందర్భంగా టికెట్ ధరలు పెంచుకునేందుకు, ఎక్స్ ట్రా షోలు వేసుకునేందుకు అనుమతులు వచ్చాయి. దీంతో తొలి రోజుల్లోనే సినిమా భారీ వసూళ్లు రాబట్టింది.
అయితే ఇప్పుడు పరిస్థితి కొంత మారుతోంది. సినిమా విడుదలై ఇప్పటికే నాలుగు రోజులు కంప్లీట్ అయ్యాయి. తొలి వీకెండ్ పూర్తయ్యాక సాధారణంగా సినిమాల వసూళ్లు వీక్ డేస్ లో తగ్గే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి నిర్మాతలు ఫాలో అయ్యే మార్గాల్లో టికెట్ ధరల తగ్గింపు కూడా ఒకటి.
ఇటీవల కొన్ని సినిమాల విషయంలో కూడా ఇదే ఫార్ములా పని చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రారంభ రోజుల్లో ఎక్కువ ధరలతో టికెట్లు సేల్ చేసిన తర్వాత, ఆడియన్స్ కౌంట్ ను పెంచేందుకు ధరలు తగ్గించారు. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్, విద్యార్థులు, రిపీట్ ఆడియన్స్ థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపించారు. దీంతో ఆక్యుపెన్సీ పెరిగి వసూళ్లు కూడా పెరుగుతాయి.
పెద్ది విషయంలో కూడా ఇప్పుడు అదే చర్చ వినిపిస్తోంది. ప్రస్తుతం సినిమాకు మంచి టాక్ ఉండటం, ప్రేక్షకుల్లో ఆసక్తి కొనసాగుతుండటం కలిసి వస్తున్నాయి. కానీ టికెట్ ధరలు ఎక్కువగా ఉండటం వల్ల కొంత మంది ప్రేక్షకులు ఇంకా వెయిట్ చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఇప్పుడు ధరలు కొంతమేర తగ్గిస్తే మరింత మంది ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ముఖ్యంగా మాస్ సెంటర్లలో, చిన్న టౌన్స్ లో టికెట్ ధరలు తగ్గితే రెస్పాన్స్ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇప్పటికే సినిమా చూసిన అభిమానులు మరోసారి చూడడానికి కూడా ముందుకు రావచ్చు. ఇక నిర్మాతల యాంగిల్ లో చూస్తే, తొలి రోజుల్లో ఎక్కువ ధరలతో మంచి వసూళ్లు సాధించిన తర్వాత సాధారణ రేట్లకు మారడం ద్వారా లాంగ్ రన్ అవకాశం పెరుగుతుంది. వీక్ డేస్‌లో కూడా సాలిడ్ కలెక్షన్లు రావడానికి ఇది హెల్ప్ అవ్వొచ్చు.
అయితే టికెట్ రేట్ల విషయంలో మూవీ టీమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ప్రస్తుతం సినిమాకు ఉన్న ఊపు కొనసాగాలంటే ప్రేక్షకులకు మరింత దగ్గర కావాల్సిన అవసరం ఉందని చెప్పాలి. అందుకే ఇప్పుడు టికెట్ ధరల తగ్గింపు ఒక మంచి నిర్ణయంగా మారవచ్చు. మరి పెద్ది టీమ్ రేట్ల తగ్గింపు విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటుందా? లేక ప్రస్తుతం ఉన్న విధానాన్ని కొనసాగిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
