Begin typing your search above and press return to search.

థియేట‌ర్ ర‌ద్దీలో త‌ప్పిపోయిన చిన్నారిని కాపాడిన చ‌ర‌ణ్!

అభిమానుల తాకిడి ఒక్కసారిగా పెరగడంతో రామ్ చరణ్ వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది.. థియేటర్ బౌన్సర్లు గుంపును అదుపు చేసే ప్రయత్నం చేశారు.

By:  Sivaji Kontham   |   8 Jun 2026 11:31 AM IST
థియేట‌ర్ ర‌ద్దీలో త‌ప్పిపోయిన చిన్నారిని కాపాడిన చ‌ర‌ణ్!
X

హైదరాబాద్‌లోని ఒక సినిమా థియేటర్ వద్ద నిన్న రాత్రి ఊహించని ఉత్కంఠభరిత సంఘటన చోటుచేసుకుంది. చిరుత‌న‌యుడు చరణ్ న‌టించిన తాజా చిత్రం పెద్ది స్పెష‌ల్ షో వ‌ద్ద ఊహించ‌ని ఘ‌ట‌న ఇప్పుడు చ‌ర్చ‌గా మారింది. అయితే ఈ స్పెష‌ల్ షో ముగించుకుని రామ్‌ చ‌ర‌ణ్ బయటకు వస్తున్న సమయంలో అక్కడ వేచి ఉన్న వందలాది మంది అభిమానులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. దాంతో థియేటర్ ప్రాంగణమంతా భారీ కోలాహలం నెలకొంది.

అభిమానుల తాకిడి ఒక్కసారిగా పెరగడంతో రామ్ చరణ్ వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది.. థియేటర్ బౌన్సర్లు గుంపును అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈ తొక్కిసలాట లాంటి వాతావరణంలో తన తండ్రితో కలిసి సినిమాకు వచ్చిన ఒక చిన్నారి ఆకస్మికంగా తండ్రి చేయి జారి గుంపులో తప్పిపోయింది. తన కళ్ల ముందే కూతురు కనిపించకుండా పోవడంతో ఆ తండ్రి తీవ్ర ఆందోళనతో కన్నీళ్లతో అల్లాడిపోయాడు.

సరిగ్గా కారు ఎక్కబోతున్న రామ్ చరణ్.... అక్కడ జనాల మధ్య ఆ తండ్రి పడుతున్న ఆవేదనను, ఏడుపును గమనించారు. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న చెర్రీ.. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించారు. ప్రమాదం ఏమీ జరగకుండా చూడాలని తన సెక్యూరిటీ సిబ్బందిని వెనక్కి తగ్గాల్సిందిగా ఆదేశించారు. స్వయంగా చొరవ తీసుకుని గుంపులో చిక్కుకుపోయిన ఆ చిన్నారిని సురక్షితంగా గుర్తించేలా చేశారు.

సెక్యూరిటీ సిబ్బంది సహాయంతో ఆ బాలికను రక్షించిన రామ్ చరణ్ వెంటనే ఆమెను చేరదీసి స్వయంగా ఆందోళనతో ఉన్న తండ్రికి అప్పగించారు. అంతటి రద్దీలోనూ ఏమాత్రం కంగారు పడకుండా.. మానవత్వంతో వ్యవహరించి ఒక చిన్నారి ప్రాణాన్ని.. ఆ కుటుంబపు సంతోషాన్ని కాపాడటంతో అక్కడున్న వారంతా చెర్రీ సమయస్ఫూర్తిని అభినందించారు.

ఈ మొత్తం సంఘటనను అక్కడి కొందరు అభిమానులు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదిక‌లపై విపరీతంగా వైరల్ అవుతోంది. చెర్రీ మనసు బంగారమని.. రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ ఆయనో రియల్ హీరో అంటూ మెగా అభిమానులు.. నెటిజన్లు రామ్ చరణ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. `పెద్ది` సినిమా క్రేజ్ నడుమ ఈ ఆక‌స్మిక‌ సంఘటన స‌మ‌యంలో చ‌ర‌ణ్ స‌మ‌య‌ స్పూర్తి, మాన‌వ‌తా సాయం అందరినీ ఆకట్టుకుంటోంది. పెద్ది భారీ ఓపెనింగుల‌తో 200 కోట్ల క్ల‌బ్ లో అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే.